ఎన్నోసంవత్సరాలనుండి
ఆ కొండ
అలాగే నిలబడివుంది
అలాగని కాలానికి కొలమానమూకాదు ,
తెలివితేటలకూ
చిహ్నమూ కాదు.
కదలక మెదలక స్తబ్దంగా గడ్డకట్టిన
దు:ఖపు బిందువులా
దాని ఉనికి.
1
ఎందుకలా ఇన్ని యుగాలుగా నిరీక్షిస్తున్నాయో, తదేకంగా ఎటువైపు చూస్తున్నాయో ,
అక్కడే ఎందుకలా ఉండిపోయాయో
2
అసలు రూపాలనేవి అంతరంగాల్ని ప్రతిబింబించే రూపాలేనా
ఆత్మను ఆవిష్కరించే రూపాలేనా
వినవు మాట్లాడవు కదలవు మెదలవు
జడంగా నిశ్చలంగా ఎంతకీ బోధపడని రూపాలు
3
ఏ అర్థమూలేని ఉనికి ,
ఎంత ఉన్నతశిఖరమైనా దాని అస్తిత్వమూ
ఎప్పుడూ ప్రశ్నే!
4
అలా మిగలకపోవడంకోసమే మనిషి ప్రయత్నమంతా !
అక్షరాల కోసం వెతుకులాట ,
నిరంతర సంభాషణ ,
కొండలాకాక
నిత్యం కదులుతూ ఉండటం
వస్తుంటాం పోతుంటాం ఎంతో కొంత మిగలాలి
భుజాలకెత్తుకున్న బరువుల్లోంచి కొంచెమైన దించాలి
మోస్తున్న బరువుకంటే, వీస్తున్నబతుకు హాయినిచ్చేట్లు నడవాలి
5
జీవితం గడ్డకట్టిన కొండగా మిగలక పోవడమే
నిజమైన ఉనికి
కొండకూ మనిషికి తేడా తెలియాలి కదా
- యాకూబ్