మంద కృష్ణకు పద్మ శ్రీ

నాగేశ్వర్‌ రెడ్డికి పద్మ విభూషణ్‌, బాలకృష్ణకు పద్మభూషణ్‌

Advertisement
Update:2025-01-25 23:09 IST

ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగకు పద్మశ్రీ పురస్కారం దక్కింది. కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించిన అవార్డుల్లో తెలంగాణ నుంచి మంద కృష్ణ ఒక్కరికే అవార్డు వచ్చింది. 113 మందికి పద్మ శ్రీ, ఏడుగురికి పద్మవిభూషణ్‌, 19 మందికి పద్మ భూషణ్‌ అవార్డులను కేంద్రం ప్రకటించింది. మంద కృష్ణ మాదిగ ఎస్సీల్లో వర్గీకరణ సాధన కోసం నాలుగు దశాబ్దాలుగా ఉద్యమిస్తున్నారు. అనేక ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించారు. ప్రజా వ్యవహారాల విభాగంలో మంద కృష్ణకు కేంద్రం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. ప్రముఖ డాక్టర్‌ నాగేశ్వర్‌ రెడ్డికి పద్మవిభూషణ్‌, హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు పద్మభూషన్‌ అవార్డులు దక్కాయి. ఆంధ్రప్రదేశ్‌ కు చెందిన కేఎల్‌ కృష్ణ (విద్య, సాహిత్యం), మాడుగుల నాగఫణి శర్మ (కళారంగం), మిరియాల అప్పారావు (కళారంగం - మరణానంతరం), రాఘవేంద్రచార్య పంచుముఖి (సాహిత్యం, విద్య) లకు పద్మశ్రీ అవార్డులు దక్కాయి.

పద్మ అవార్డుల్లో తెలంగాణపై కేంద్రం వివక్ష : సీఎం రేవంత్‌ రెడ్డి

పద్మ అవార్డుల్లో తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిందని సీఎం రేవంత్‌ రెడ్డి ఒక ప్రకటనలో అసంతృప్తి వ్యక్తం చేశారు. గద్దర్‌, చుక్కా రామయ్య, అందెశ్రీ, గోరటి వెంకన్న జయధీర్‌ తిరుమలరావు లాంటి ప్రముఖుల పేర్లను పద్మశ్రీ అవార్డుకు తమ ప్రభుత్వం ప్రతిపాదించినా వారిని కేంద్రం పరిగణలోకి తీసుకోకపోవడం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను అవమానించడమేనన్నారు. పద్మ అవార్డుల్లో వివక్షపై ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాసే ఆలోచనలో సీఎం ఉన్నట్టు ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. పద్మవిభూషణ్‌ అవార్డు గ్రహీత నాగేశ్వర్‌ రెడ్డి, పద్మభూషణ్‌ బాలకృష్ణ సహా ఏపీ నుంచి పద్మశ్రీ అవార్డులు దక్కించుకున్న వారికి సీఎం రేవంత్‌ రెడ్డి అభినందనలు తెలిపారు.

Tags:    
Advertisement

Similar News