దాశరథి శతజయంతి ఘనంగా నిర్వహించాలి
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్
ప్రముఖ కవి దాశరథి కృష్ణమాచార్యుల శతజయంతిని ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఈమేరకు రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావుకు శనివారం ఆమె లేఖ రాశారు. తెలంగాణ సాయుధ పోరాటానికి జవసత్వాలు నింపిన ప్రజాకవి, పీడనపై అగ్నిధారను కురిపించిన కలం యోధుడు దాశరథి అని గుర్తు చేశారు. హైదరాబాద్ నగరంలోని ఏదైనా ప్రముఖ కూడలిలో దాశరథి విగ్రహం ఏర్పాటు చేసి గౌరవించుకోవాలన్నారు. దాశరథి జన్మించిన మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరు గ్రామంలో స్మృతి వనం ఏర్పాటు చేయడంతో పాటు గ్రామస్తులు ఏర్పాటు చేసుకున్న దాశరథి గ్రంథాలయానికి ప్రభుత్వం కొత్త భవనం నిర్మించాలని కోరారు. దాశరథి సమగ్ర సాహిత్యాన్ని ప్రభుత్వమే ముద్రించి లైబ్రెరీలలో అందుబాటులోకి తేవాలన్నారు. దాశరథి శతజయంతి ఉత్సవాలను ప్రభుత్వం సంవత్సరం పొడవునా నిర్వహిస్తామని ఇప్పటికే ప్రకటించిందని, కానీ ఆ దిశగా పెద్దగా కార్యక్రమాలు జరిగిన దాఖలాలు లేవన్నారు.
దాశరథిని నిజామాబాద్ పాత జైలులో నిర్బంధించారని.. తాను కొన్ని నిధులు వెచ్చించి జైలు ఆవరణలో దాశరథి స్మారక ప్రాంగణం ఏర్పాటు పనులు చేపట్టామని, దానిని అందుబాటులోకి తేవడానికి ప్రభుత్వం పూనుకోవాలని సూచించారు. దాశరథి స్ఫూర్తిని చాటేందుకు కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే దాశరథి సాహితి పురస్కారం ఏర్పాటు చేసి ప్రముఖ కవులను సత్కరించుకుంటున్నామని గుర్తు చేశారు. ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలోని ఆడిటోరియానికి దాశరథి పేరు పెట్టి గౌరవించుకున్నామని తెలిపారు. దాశరథి కుటుంబానికి అండగా నిలిచేందుకు ఆయన కుమారుడికి ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చామని తెలిపారు. “తెలంగాణ విముక్తి పోరులో ప్రజల పక్షాన నిలవడమే కాక అనేక రచనా ప్రక్రియలలో సాహితీ సృష్టి చేసిన సృజనకారులు.. ఈ నేల అస్మితను ఆకాశమంత ఎత్తున నిలిపిన ఆ మహనీయుని శత జయంతి ఉత్సవాలు తెలంగాణ తన మూలాలను నెమరువేసుకునే చారిత్రక సందర్భం. దాశరథి గారి స్ఫూర్తిని ముందుతరాలకు చాటే దిశగా ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని తమరిని సవినయంగా కోరుతున్నాను.” అని పేర్కొన్నారు.