నాకు భేషజాలు లేవు.. తెలంగాణ కోసం ఎవరినైనా కలుస్తా

'ఉనిక' పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్‌ రెడ్డి

Advertisement
Update:2025-01-12 15:23 IST

తనకు భేషజాలు లేవని.. తెలంగాణ కోసం ఎవరినైనా కలుస్తా.. ఎవరి సహకారమైన తీసుకుంటానని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. ఆదివారం తాజ్‌ కృష్ణ హోటల్‌లో మాజీ గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌ రావు ఆత్మకథ 'ఉనిక' పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్లు బండారు దత్తాత్రేయ, కంభంపాటి హరిబాబు, విద్యాసాగర్‌ రావు, కేంద్ర మంత్రి బండి సంజయ్‌, మంత్రులు పొన్నం ప్రభాకర్‌, శ్రీధర్‌ బాబుతో కలిసి ఆయన ఉనికి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణను వన్‌ ట్రిలియన్‌ ఆర్థిక వ్యవస్థగా తయారు చేయడానికి సహకరించాలని ప్రధాని మోదీని కోరానన్నారు. రాష్ట్రానికి 60 శాతం హైదరాబాద్‌ నుంచే వస్తుందని.. నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి రీజినల్‌ రింగ్‌ రోడ్డు, రింగ్‌ రైల్‌ ఇవ్వాలని ప్రధానిని కోరానన్నారు. తెలంగాణ సముద్ర తీర ప్రాంతం లేదు కాబట్టి డ్రైపోర్టు ఇవ్వాలని కోరానని చెప్పారు. కాజీపూట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ త్వరగా పూర్తి చేయడానికి ప్రధాని సహకారం కోరనన్నారు. హైదరాబాద్‌ మెట్రోకు కేంద్రం సహకరించాలని కోరుకుంటున్నానని తెలిపారు. స్కిల్‌ యూనివర్సిటీ కోసం రూ.600 కోట్ల కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు చేశామన్నారు. జూన్‌ 2లోగా ఈ వర్సిటీ భవన నిర్మాణం పూర్తవుతుందన్నారు. ఒలింపిక్స్‌ లో బంగారు పతకాలు సాధించడమే లక్ష్యంగా స్పోర్ట్స్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.




 

అమరావతి మనకు పోటీ కాదని.. న్యూయార్క్‌, టోక్యోలాంటి నగరాలతోనే పోటీ పడుతామన్నారు. తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం ఉన్నా, కర్నాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వం చెన్నై, బెంగళూరుకు ప్రధాని మోదీ మెట్రో రైల్‌ ప్రాజెక్టులు ఇచ్చారన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌, బీఆర్‌ఎస్‌ నేత వినోద్‌ రావు లాంటి నాయకులకు పార్టీలకు అతీతంగా తెలంగాణ అభివృద్ధికి సహకరించాలన్నారు. తమిళనాడులో వాళ్ల భాష, జల్లికట్టు కోసం పార్టీలకు అతీతంగా పోరాడుతారని.. 39 మంది తమిళ లోక్‌సభ ఎంపీలు మాతృభాష తమిళంలో ప్రమాణ స్వీకారం చేశారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రాంత నాయకులు ఈ గడ్డ కోసం కలిసికట్టుగా పని చేయాలని విజ్ఞప్తి చేశారు. తన రాజకీయ జీవితంలో ఆదర్శంగా తీసుకున్న వాళ్లందరినీ ఒకే వేదికపై కలిసే అవకాశం ఈరోజు వచ్చిందన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ రాజకీయాల్లో జార్జిరెడ్డి, విద్యాసాగర్ రావు తాము నమ్మిన సిద్ధాంతం కోసం గట్టిగా నిలబడ్డారని అన్నారు. అలాంటి యూనివర్సిటీలు ఇప్పుడు ఉనికి కోల్పోయే స్థితికి చేరుకున్నాయని అన్నారు. అందుకే యూనివర్సిటీలను బాగు చేయడానికి కృషి చేస్తున్నానని తెలిపారు.

విద్యార్థులు అత్యంత క్రియాశీలంగా వ్యవహరించడంతోనే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామన్నారు. రాజకీయాల్లో సిద్ధంత పరమైన భావజాలం లేదని.. అందుకే ఈరోజు పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నాయని, ఏదో ఒక పదవి కోసం పార్టీలు మారుతున్నారని అన్నారు. సిద్దాంతపరమైన విద్యార్థి రాజకీయాలను రాష్ట్రంలో పునరుద్దించాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయాల్లో రాణించాలని అనుకునే వారు 'ఉనిక' పుస్తకాన్ని చదవాలన్నారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రితో పాటు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వేలు చూపిస్తే స్పీకర్ మైక్ ఇవ్వాలన్నారు. పాలకపక్షం, ప్రతిపక్షం కలిస్తేనే ప్రభుత్వమని.. ప్రభుత్వంలోని లోపాలను ఎత్తి చూపడం ప్రతిపక్షం పాత్ర అన్నారు. తమ ప్రభుత్వం ప్రజాస్వామ్య స్ఫూర్తిని చూపుతోందన్నారు. 13 నెలల్లో అసెంబ్లీ నుంచి ప్రతిపక్ష సభ్యులను బహిష్కరించలేదన్నారు. ఉత్తర తెలంగాణలో గోదావరి జలాల కోసం సాగర్‌ జీ పాదయాత్ర చేశారని, అందకే వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు తీసుకువచ్చారని తెలిపారు. తుమ్మిడిహెట్టి వద్ద భూసేకరణ కోసం సాగర్‌ జీ సహకారం తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎంపీ డాక్టర్‌ కె. లక్ష్మణ్‌, మాజీ ఎంపీలు బి. వినోద్‌ కుమార్‌, సుబ్బిరామిరెడ్డి, సీనియర్‌ సంపాదకులు కె. రామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Tags:    
Advertisement

Similar News