సుదీర్ఘ చర్చల తర్వాతనే తెలంగాణ తల్లికి రూపం
తెలంగాణ తల్లి విగ్రహ రూపకర్త బీవీఆర్ చారి
కేసీఆర్ మేధావులు, కవులు, కళాకారులతో సుదీర్ఘ చర్చలు జరిపిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహం ఇలా ఉంటే బాగుంటుందనే అభిప్రాయానికి వచ్చారని తెలంగాణ తల్లి విగ్రహ రూపకర్త బీవీఆర్ చారి తెలిపారు. శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ అస్తిత్వంపై దాడి - చర్చ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. మనిషి శరీర నిర్మాణంలో వెన్నెముఖ ఎంత ముఖ్యమో తెలంగాణ రాష్ట్రానికి బతుకమ్మ చిహ్నం అంతే ముఖ్యం అన్నారు. తెలంగాణ తల్లి దేవతా మూర్తిగా ఉండాలని కేసీఆర్ భావించారని తెలిపారు. అసలైన తెలంగాణ చరిత్రను తుడిపివేయడం సరికాదని, మనం మన సంస్కృతిని, చరిత్రను కాపాడుకుందామని పిలుపునిచ్చారు. మన జీవనవిధానమే తెలంగాణ సంస్కృతితో ముడిపడి ఉందన్నారు. తెలంగాణ తల్లి చేతిలో ఉండే బతుకమ్మలో ఉన్నవి అమరపుష్పాలని, అవి ఎప్పుడూ వికసిస్తూనే ఉంటాయన్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని ఎవరూ చరిత్రపుటల్లో నుంచి తొలగించలేరని తేల్చిచెప్పారు.
కాంగ్రెస్ పాలన చీకటి రోజులను గుర్తు చేస్తోంది : ఎమ్మెల్సీ వాణిదేవి
కేసీఆర్ పాలనలో తెలంగాణ స్వర్ణయుగాన్ని తలపించేదని.. కాంగ్రెస్ ఏడాది పాలన పాత చీకటి రోజులను గుర్తు చేస్తోందని ఎమ్మెల్సీ సురభి వాణిదేవి అన్నారు. శిల్ప శాస్త్రం ప్రకారం కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేయించారని అన్నారు. తెలంగాణ తల్లి గొప్పగా ఉండాలే తప్ప బీదగా ఉండొద్దన్నారు. ఈ ప్రభుత్వం ప్రజల భావోద్వేగాలను దెబ్బతీయసే కుట్ర చేస్తోందన్నారు.
అది విగ్రహం కాదు అస్తిత్వం : గోగు శ్యామల
తెలంగాణ తల్లి అంటే కేవలం విగ్రహం కాదని, అది తెలంగాణ అస్తిత్వమని ప్రముఖ కవయిత్రి గోగు శ్యామల అన్నారు. తెలంగాణ సంస్కృతిని తుడిచేసే ప్రయత్నం చాలా దుర్మార్గమన్నారు. ఆంధ్ర పాలకులు మన సంస్కృతిని ఎప్పుడూ గౌరవించలేదని, ఇప్పుడు స్వరాష్ట్రంలోనే ఆ పరిస్థితులు నెలకొనడం బాధాకరమన్నారు. సంస్కృతిని, అస్తిత్వాన్ని దెబ్బతీయాలనుకోవడం మూర్ఖత్వమని, పాలకులు విధ్వంసం చేస్తే ప్రజలు పునర్నిర్మాణం చేస్తారని అన్నారు. ప్రజల్లో పాతుకుపోయిన బతుకమ్మను అవమానించడం దుర్మార్గమన్నారు.
బతుకమ్మను కించ పరచడం సరికాదు : కేవీ రమణాచారి
బతుకమ్మను కించ పరచడం సరికాదని రిటైర్డ్ ఐఏఎస్ కేవీ రమణాచారి అన్నారు. ప్రభుత్వమే తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయడం సిగ్గు అనిపిస్తోందన్నారు. బతుకమ్మ సబ్బండ వర్గాలు ఆడుకునే పండుగ అని, దానిని కించపరచడం దుర్మార్గమని అన్నారు. దేవతామూర్తిలా ఉన్న తెలంగాణ తల్లిని మార్చివేయడం దారుణమని, ప్రభుత్వం ప్రతిష్టించిన విగ్రహంలో అభయ హస్తం అంటే ఏమిటో ప్రతి ఒక్కరికి తెలుసన్నారు. బ్రాహ్మణ పరిషత్తుతో పాటు అన్ని కార్పొరేషన్లను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందన్నారు.
తెలంగాణ తల్లి సాంస్కృతి వైభవానికి ప్రతీక : వకుళాభరణం
తెలంగాణ తల్లి ఒక ప్రతిమ కాదు.. సాంస్కృతిక వైభవానికి ప్రతీక అని బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు అన్నారు. చరిత్ర నిర్మాణం, ఉద్యమాలు, గత వైభవాలపై అవగాహన లేకుండా సీఎం రేవంత్ రెడ్డి చరిత్రను చెరిపేస్తున్నారని తెలిపారు. బతుకమ్మ అంటే బతుకుజీవుడా అని కాదని, అది మహిళా శక్తికి ప్రతీక అన్నారు. బతుకమ్మను తెలంగాణ తల్లి నుంచి తీసేశారు ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణకు కాంగ్రెస్ ప్రభుత్వం గొప్ప పేరు తేకున్నా పర్వాలేదు కానీ ఉన్న వైభవాన్ని పోగొట్టొద్దని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ సంస్కృతిని కాపాడానికి కవిత మరో పోరాటం ప్రారంభించాలని, తెలంగాణ సాంస్కృతిక ఉద్యమానికి నాయకత్వం వహించాలని కోరారు.
సెక్రటేరియట్ లోపల తెలంగాణ తల్లిని బందీ చేశారు : వి. ప్రకాశ్
రేవంత్ రెడ్డి సెక్రటేరియట్ లోపల తెలంగాణ తల్లిని బందీ చేశారని బీఆర్‌ఎస్ నాయకుడు వి. ప్రకాశ్ అన్నారు. హామీల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నరని.. ఈ దుష్టలక్ష్య సాధన కోసం తెలంగాణ తల్లిని కూడా వదిలిపెట్టలేదన్నారు. జూన్ 2న తెలంగాణ తల్లి విగ్రహాలకు పూజ చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుడుదామన్నారు. చేతి గుర్తు కోసం తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మను మాయం చేశారని తెలిపారు. ప్రభుత్వం ఎన్ని జీవోలు తెచ్చినా, కేసులు పెట్టినా ఉద్యమ తెలంగాణ కోసం తమ పోరాటం కొనసాగుతుందన్నారు.
ఉద్యమానికి తెలంగాణ తల్లి ప్రతీక : హమీద్ మహ్మద్ ఖాన్, జమాతే ఇస్లామీ హింద్ అధినేత
ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమానికి తెలంగాణ తల్లి విగ్రహం ప్రతీక అని జమాతే ఇస్లామీ హింద్ అధినేత హమీద్ మహ్మద్ ఖాన్ అన్నారు. ఉద్యమంలోంచి పుట్టిన తెలంగాణ విగ్రహాన్ని మార్చడం సరికాదన్నారు. వేలాది గ్రామాల్లో అవే విగ్రహాలు ఉన్నాయి వాటిని తొలగిస్తారా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి కరుడుగట్టిన సమైక్య వాది అన్నారు. అబద్ధాలు చెప్పడంలో ఆయన పీహెచ్‌డీ చేశారని అన్నారు. ఇకనైనా తెలంగాణ సంస్కృతి, అస్తిత్వంపై దాడి చేయడం మానుకోవాలని హెచ్చరించారు.