జీవన్నాటకం
World Theatre Day 2023: ( మార్చి 27 ప్రపంచ రంగస్థల దినోత్సవం )
ప్రపంచమే ఒక నాటక రంగం అన్నాడు విఖ్యాత నాటక కర్త విలియం శేక్స్పియర్! ఆయన నాటకాల్లో విషాదాంతాలూ, సుఖాంతాలూ, రెండూ వున్నాయి. ఔను మరి, మన జీవితాలూ అంతేగా! మనలో నాయకులు, ప్రాతినాయకులూవున్నారు, కొండొకచో విదూషకులూ వున్నారు! నాటకం రక్తికట్టాలంటే అన్ని రసాల పోషణ జరగాల్సిందేకదా! ఉదాహరణకు, మనందరికీ తెలిసిన నాటకరాజం హరిశ్చంద్ర, నక్షత్రకుడు ధనం ఇమ్మని జిగటలా హరిశ్చంద్రుని పట్టుకు వెంటపడిన తీరు నవ్వుతెప్పిస్తే (ఇదొక నానుడిలా మారింది కూడా!), తరవాతి కాటి సీనులో ఆయన వైరాగ్య భరితమైన పద్యాలు విని శ్మశాన వైరాగ్యానికి లోనవుతాం, అంతేగా ...
ఈ జీవన్నాటకంలో నిర్మాణం, కథ, స్క్రిప్టు, దర్శకత్వం అంతా పైవాడిదే. మన చేతిలోనే అంతా వుందనుకుని 'అతిగా' నటించేస్తే చివరలో 'క్షమాపణల సీను' వుండనేవుంటుంది. లేదా నాటకానికి 'తెరపడ్డాక' ఆ జగన్నాటక సూత్రధారి చేతిలో మొట్టికాయలు తప్పవు!
మన తెలుగువారు చేసుకున్న అదృష్టమేమోగాని, తిరుపతి వెంకట కవులు అందించిన కృష్ణ రాయబారం నాటకం నేటికీ మన మనసులను రంజింపజేస్తూనేవున్నది, పద్య నాటకాలకు కాలం చెల్లినా. 'బావా ఎప్పుడు వచ్చితీవు' అని కుశలం అడగటం మనకు మామూలే! ఇక 'జండాపై కపిరాజు', అలుగుటయే ఎరగని' ఇలా ఎన్ని పద్యాలని వుదహరించను!
రవీంద్రభారతిలో ఆరోజుల్లో రాయబారం నాటకం ప్రదర్శితమౌతున్నప్పుడు జరిగిన ఒక చిన్న తమాషా సంఘటన గురించి అప్పట్లో చదివాను. అర్జున పాత్రధారి 'అదిగో ద్వారక,' అని పాడుతూ సమీపంలో వున్న ద్వారకా హోటల్ దిశగా చూపించాడట, 'ఆలమందలవిగో' ఆలపిస్తూ ఇటు ఎదురుగా కూర్చున్న ప్రేక్షకులవైపు చూపించాడట, నిజమైనా కాకున్నా వినడానికి బాగుందికదూ!
ఇక తాను వ్రాసిన ఒక్కగానొక్క నాటకం 'కన్యాశుల్కం'తో అనంతమైన కీర్తిని సంపాదించిన గురజాడవారిని ఎలా మరిచిపోగలం
( మార్చి 27 ప్రపంచ రంగస్థల దినోత్సవం )
— డా. తెన్నేటి శ్యామకృష్ణ