తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై హైకోర్టులో పిల్
దాఖలు చేసిన ప్రముఖ రచయిత జూలూరు గౌరీశంకర్
సెక్రటేరియట్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించకుండా ఆదేశాలు ఇవ్వాలని ప్రముఖ రచయిత జూలూరు గౌరీశంకర్ హైకోర్టును ఆశ్రయించారు. శనివారం హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ (పిల్) దాఖలు చేశారు. తెలంగాణ ప్రభుత్వంతో పాటు జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ స్పెషల్ సీఎస్‌లను ప్రతివాదులుగా చేర్చారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త విగ్రహాన్ని ఈనెల 9న ఆవిష్కరించే ప్రయత్నాల్లో ఉందని, ఆ విగ్రహాన్ని ఆవిష్కరించకుండా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం అంటే తెలంగాణ అస్తిత్వంపై జరుగుతోన్న దాడిగానే తెలంగాణ సమాజం భావిస్తోందన్నారు. నా తెలంగాణ కోటి రథనాల వీణ అన్న మహాకవి దాశరథి అన్నట్టుగానే ప్రొఫెసర్ జయశంకర్ సార్, తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్ నేతృత్వంలో అనేక మంది మేధావులు, ఆత్మబంధువుల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహం రూపుదిద్దుకున్నదని తెలిపారు. కేసీఆర్ పై రాజకీయ కక్షతో విగ్రహంలో మార్పులు చేస్తున్నారని తెలిపారు. ఈ ప్రయత్నాలను మానుకోవాలని కోరారు.