పట్టులంగాల పాపలెక్కడ?
బొందుచెడ్డీల బాబులెక్కడ ?
వెన్నెలబంతుల ఆటలు ఏవీ?
చింతగింజలాటలు లేవే?
తొక్కుడు బిళ్ళ ఆటలు,-
అచ్చంగాయల సరదాలు,-
దాగుడుమూత-దండాకోరు,-
దొంగ-పోలీస్ ఆటలు,-
కోతి-కొమ్ముచ్చి గెంతులు,-
ఏదీ ? ఆ బంగారు బాల్యం,-
కర్ర-బిళ్ళ ఆటలు,
గురి తప్పని గోళీల పందేలు,
కొట్టులోని కొసరు తాయిలాలు,
చెరువులో ఈత పోటీలు,
రాలిన తాటిపండ్లు,
కొక్కెంగడతో కోసిన, -
సీమ చింతకాయలు,
త్రుంచిన కలువ పూవులు,
దాలి లో ని చిలకడ దుంపలు,
లేగదూడలతో స్నేహం,
తుమ్మచెట్టుపైన కొంగలు,
కోడిపిల్లలతో బొబ్బో పిలుపులు,
ఏడుపెంకులాటలు,
వేసవిలో గాలిపటాలు,
గుడిఉత్సవాల్లో కోలాటాలు,
బిళ్ళబోర్డు లాటరీలు,
కాయ్ రాజా కాయ్ చిరుజూదాలు,
ఒకటా రెండా?
చిన్ననాటి అనుభవాలు.
నెమరు వేయటం తప్ప
నేనేమి చేయగలను?
- చల్లగుళ్ళ బాలకృష్ణ
Advertisement