తెల్లవారుజామున 5గం. వేళలో మెలుకువ వచ్చీరాక మంచంమీద అటూ ఇటూ దొర్లుతోన్న జగన్నాధం గారు తలుపు కొట్టిన శబ్దంతో పూర్తిగా మేలుకుని ఈ టైంలో ఎవరొచ్చుంటారని గొణుక్కుంటూ ముందు తలుపు దగ్గరకు వెళ్లి "ఎవరూ"అంటూ కాస్త గట్టిగానే అడిగాడు.
బయటనించి"నేను నాన్నా"అంటూ కూతురు గీత గొంతు వినిపించి ఒకింత ఆశ్చర్యం,మరింత ఆదుర్దా తోతలుపు తీసాడు.చేతిలో పెద్ద సూట్ కేసుతో గీత లోనికొచ్చింది.చేతిలో పెట్టెఅందుకుని "రామ్మా"అంటూ తన మంచం మీద కూర్చోబెట్టాడు కూతుర్ని.
కాసేపిద్దరూ ఒకర్నొకరు తేరిపారాచూసుకున్నారు.ఇద్దరిలోనూ అదోరకమైన ఆందోళన.జగన్నాధం గారికి విషయం చూచాయిగా అర్థమవుతోంది. కూతురి తల నిమురుతూ"అల్లుడు మళ్ళీ డబ్బు కోసం పంపాడామ్మా?"
అన్నాడు.అదే అయితే ఇంతపెద్ద పెట్టెతో ఎందుకు వస్తుందిఅని సందేహం. గీత మౌనంగాచాలా సేపు ఉండిపోయింది శూన్యంలోకి చూస్తూ.
ఆయనా కూతుర్ని కదిలించలేదు కానీ పరిపరి విధాలపరిగెడ్తోన్న ఆలోచనలని ఆపలేకపోతు న్నాడు.గీత ఒక్కసారిగా తండ్రి గుండెలపై వాలిపోయి కన్నీరు కార్చింది.జగన్నాధం కూతుర్ని ఓదారుస్తున్నట్లుగా ఆమె వెన్ను నిమురుతూ వుండిపోయాడు.
కాసేపటికి గీత తేరుకుని పమిట తో ముఖం అద్దుకుంటూ "నేనే వాడ్ని వదిలేసి వచ్చేశాను నాన్నా" అంది మెల్లగా రోదిస్తూనే.
షాక్ తగిలినట్లయింది జగన్నాధానికి.
గీత చాలా నిదానస్తురాలు.అస్సలు తొందరపడదు.అలాంటిది ఇప్పుడిలాచేసిందంటే...
అంటూ ఆలోచిస్తున్న ఆయనవైపే చూస్తూ గీత చెప్పసాగింది.
"పుట్టింటి నుంచి పైసా కూడా తీసుకురానని మొండికేసినప్పటినుంచి అతను చాలా దారుణంగా చిత్రహింసలు మొదలుపెట్టాడు.మీ కెవ్వరికీ చెప్పకుండా మౌనంగా భరించాను.ఎప్పటికైనా మారతాడనిఆశపడి.కానీవాడొక సంస్కారం లేని పశువని నిన్ననే తెలిసింది.డబ్బు కోసం నన్నుతార్చడానికి సిద్ధమైతే తెగతెంపులు చేసుకొని వచ్చేశానునాన్నా"అంటూభోరున ఏడ్చేసింది.
తండ్రిమనసాగలేదు.కూతుర్ని దగ్గరకు తీసుకొని తల నిమురుతూ" బాధపడకమ్మా.నీ కష్టాలన్నీ తీరాయనేఅనుకో.
నీకేమిటమ్మా.!ఈ ఇల్లు నీది కాదూ.ఇక్కడేవుందువుగాని"అంటున్న ఆయనకు చప్పట్లు వినిపించడంతో ఆగి చూసాడు.ఆయన కొడుకు సురేష్, కోడలు వాళ్ళ రూంలోంచి హాల్లోకి ఎప్పుడొచ్చారో తండ్రీకూతుళ్ళు గమనించనేలేదు.
కొడుకు చప్పట్లు కొడుతుంటే వాడి చెంప పగలగొట్టాలన్నంత కోపాన్ని నిగ్రహించుకుంటూ "ఆపు,చెల్లెలు కష్టాల్లో వుంటే చప్పట్లు కొడతావా.సిగ్గు లేదా నీకు?"అంటూ గద్దించారు సురేష్ ఏ మాత్రం తగ్గకుండా
"ఎవరికిసిగ్గులేంది.మొగుడితో తెగతెంపులు చేసుకొచ్చానని ఘనకార్యం లా చెప్తున్న తనకా?ఏదో సర్దిచెప్పి కాపురంనిలబెట్టాల్సిన నువ్వు ఇది నీ ఇల్లేనమ్మా ఇక్కడే వుండిపొమ్మంటున్న నీకా?
ఎవరికి లేదు సిగ్గు? ఆది నిష్ఠూరం మేలని ముందేచెప్తున్నాను.గీత ఈ ఇంట్లోవుండటం ఎంతమాత్రం కుదరదు.ఈ ఇల్లు కోడలి పేరున ఎప్పుడో రాసేశావు.గుర్తు లేదేమో. ఎవరికీ ఈ ఇంటిమీద ఏ హక్కూ లేదు."
తమ పని అయిపోయినట్లుగా లోపలికి వెళ్ళిపోతున్న వాళ్ళను చూసి అసహ్యంగా ,అవమానంగా తలదించుకున్నాడు జగన్నాధం.
గీత తీవ్రమైన స్వరంతో "ఆగన్నయ్యా"అనిఅరవడంతో స్థాణువులా నిలబడి పోయాడు సురేష్.
"నేనిక్కడికెందుకొచ్చానో తెలియకుండానే ప్రేమతో నాన్న ఇక్కడ వుండమనటం, నువ్వు నేనుతిష్ఠవేస్తానని భయపడి నీ హక్కులు ప్రదర్శించడం చాలా అసహ్యంగా వుంది.కాపురం పేరుతో ఆ ధనపిశాచి నాలుగేళ్లు నాకు చూపించిన నరకానికి ఆడది ఎలా వుండాలో బాగా నేర్చుకున్నాను.ఎవరి ఆలంబనా లేకుండా నా కాళ్ళమీద నేను జీవించాలనినిర్ణయించుకునే వచ్చాను.నాకు ఉద్యోగం దొరికింది .నాన్నతో కాసేపు నా బాధపంచుకుందామని వచ్చాను.ఇన్నాళ్లు నానా హింసలు పెట్టినవాడిని వదలను.జైలుకి పంపించితీరతాను.నా ఇల్లంటూవేళ్ళాడుతున్నావుగా.ఆ సంగతీ తేలుస్తాను.
నా హక్కుని ఎప్పటికీ వదులుకోను.నాకంటూ ఒక మంచి జీవితం ఏర్పడ్డాక నాన్నను నా దగ్గరే వుంచుకుంటాను.నీలాంటి స్వార్ధపరుడినించి ఆయనను విడిపించుకుంటాను." అంటోన్న గీత పర్సులో ఫోను మ్రోగడంతో ఫోన్ తీసుకుంది.
"ఆ..ఆ... వస్తున్నానే.నాన్నతో ఒక గంట మాట్లాడి నీ దగ్గరకే వచ్చేస్తా"అంటూ ఫోను పెట్టేసిన కూతురి వైపు గర్వంగాచూస్తున్నాడు జగన్నాధం.
మహిళల జీవితాలు స్వావలంబనం కావాలని టీవీలల్లో,ప్రసంగాలలో వింటున్నది తన కూతురి లో ఆయనకుకనిపిస్తోందిప్పుడు.
-విజయకుమార్ నలమోతు.