అనంత విశాల ప్రపంచం నీది
చిరు అత్యల్ప ప్రపంచం నాది
చీమను
ఎవరి కంటికీ కనిపించను
అపరిచిత లోకాలలో
అధో తలాలలో
నేల అడుగున
విపత్కర జగత్తులలో
సంచారం
పెద్ద ఆశలు లేవు
ధన సంపత్తి వెనకేసుకోవాలన్న
సంకల్పం లేదు
మహత్కాంక్షలూ లేవు
వంకాయి కూరతో
రెండు రొట్టెలు చాలు
అన్నంలోకి కాసింత చేపల పులుసు
చాలు
సాయంత్రం ఒక టీ కప్పు చాలు
ఒక చొక్కా ఒక ప్యాంటు
ఒక గది ఒక మంచం ఒక దీపం
ఒక ఫాను ఒక కుర్చీ ఒక కలం
ఒక పుస్తకం ఒక కొవ్వొత్తి ఒక అగ్గెపెట్టె
ఒక ప్లేటు ఒక గ్లాసు ఒక ముంత
ఒక నీళ్ళ కూజా
అనాచ్చాదిత శరీరం
పరిపక్వ మనస్సు దించని శిరస్సు
పరిశుద్ధ అంతరంగం
మృదు పరిమళ భరిత సువాచ్యం
నిత్య ప్రియమిత్ర సమాగం
అనాది కాలాల సత్యాన్వేషణ
ప్రజా పక్షం
మాయని గాయం
ఆగని గానం
అమరం
దుఃఖం ధూళి
భాష్ప నయనం రుద్ధ కంఠం
జ్వలిత వాక్యం
ఈ చిరు స్రోతస్సు
- విజయచంద్ర
Advertisement