గురివింద ( కథ )

Advertisement
Update:2023-03-26 15:05 IST

            "మాటాడవేమిటి?

మా అమ్మ కోడల! అన్న పెళ్ళాం! నాకొదిన!!"

కారు ఎక్కిందో లేదో మాటి,మాటికీ ఫోన్ మోగ సాగింది! ఇలాంటి పిచ్చి పిచ్చి రింగ్ టోన్లు పెట్టేది తన చిన్న నాటి ఫ్రండ్ బండ స్వరాజ్యమే!! క్రితం నెల " ఆచ్చి, తూచ్చి చింతాకు దూసి... " అంటూ పెట్టింది! ఒకసారేమో " దెబ్బకి రెండూ-ద్రాక్షా పళ్ళూ-తీయనో,పుల్లనో నాకేం తెలుసు ?" అని! ఎందుకు? దీనర్ధమేమిటి? అని అడిగామా? ఇక అంతే ! దాని సోది వినలేము. దానితో మాటాడాలనిపించేంత స్థిమితం లేక ఫోన్ కట్టేసింది! ఎన్నో ప్రయాణాలు చేసినా, ఇవాళ పయనం మాత్రం చాలా అలజడిగా, గుండె గుబులుగా వుంది! చాలా విచిత్రమైన సంగతే జరిగింది! కూతురిది ప్రేమ పెళ్ళి! రెండు వైపులా అభ్యంతరాల్లేక పోవటంతో, పెళ్ళి నిరాడంబరంగా జరిగిపోవటంతో ,

ఉద్యోగరీత్యా వాళ్ళు మరో రాష్ట్రం వెళ్ళి కాపురం పెట్టారు. అల్లుడి వైపు బంధువులతో పెద్దగా చుట్టరికం పెంచుకున్నదే లేదు. ఒకప్పుడు వైభవంగా వుండేదే అనిపించే పాతకాలపు ఇంటి ముందు కారు ఆగింది. అల్లుడే తమ ఇంటికి రావటం తప్ప తామీ ఇంటికెపుడూ రానేలేదు. సొంత ఇల్లు వదలి రాననటంతో వియ్యంకుడొకడే ఇక్కడుంటారు. వియ్యపురాలు గతించటంతో దూరపు బంధువులొకరు వంటచేసి, కనిపెట్టుకొని వుంటారు. వియ్యంకుడు మర్యాదగా ఆహ్వానించారు.

"మీ ఆరోగ్యం ఎలా వుంది? ఆ మధ్య కాలికి తగిలిన దెబ్బ మాని పోయిందా? ఎపుడూ రావటం కుదరలేదు, అందుకే ఒకసారి చూద్దామని!" తానొచ్చిన కారణం వివరించింది.

నిజమే, ఇదే మొదటి సారి రావటం! అదీ అల్లుడు వినయ్ కి చెప్పకుండా వాళ్ళ నాన్నగారింటికి !

అకస్మాత్తుగా నిన్న కూతురు ఫోన్ చేసి ఏడుపుగొంతుతో " అమ్మా! నేనూ,వినయ్ విడిపోతున్నాం! వాళ్ళాఫీసులో ఆఫీసర్ గా వచ్చిన గీత ని తానొదులు కోలేననీ, ఆమెతో బంధం ముడిపడిందనీ, దారుణంగా మాటాడుతున్నాడు. ఎందుకిలా మారిపోయాడో తెలియటం లేదు. ఆ గీత తన ఊళ్ళోనే చిన్ననాటి స్నేహితురాలుట! తమ ఇంటి పక్క వీధిలోనే వాళ్ళ ఇల్లుట! ఇన్నాళ్ళకి కలుసుకున్నారుట!"

ఇవీ కూతురు చెప్పిన మాటలు!! ఏం చేయాలి? ఎలా కూతురి జీవితం సరిచేయాలి?? తాను చదివిన సైకాలజీ కారణంగా మహిళామండలిలో తన కౌన్సిలింగ్ కి మంచి పేరుంది. నిన్నటికి నిన్న ఎంతో పెద్ద కాన్ఫరెన్సులో "మహిళల సమస్యలు-వాటి పరిష్కారాలు" అనే అంశంపై తానెంత బాగా మాటాడింది!!?? అందరూ మెచ్చుకోవటమే!

తాగుబోతులో, సైకోలో, బాలికల -అక్రమరవాణా ముఠాలో, గృహహింసల్లో, వరకట్నవేధింపులో వీటన్నిటిలో ప్రత్యక్షంగా,పరోక్షంగా సహకరించే, పాల్గొనే, ప్రభావం చూపే ఆడవాళ్ళు ముందు మారాలి!! స్వార్ధం,ఆర్ధికప్రయోజనాలు పక్కనబెట్టి మన స్త్రీలంతా తోటి మహిళల పట్ల శత్రువులుగా ప్రవర్తించటం మానాలి! కనీసం ఉపకారం చేయక పోయినా అపకారం చేయకుడదు. ఇలా సాగిన తన ఉపన్యాసపు అంశాలకి అంతా బలపరుస్తూ కరతాళ ధ్వనులు కురిపించారు.

కానీ వచ్చేస్తుంటే ఒక ముసలాయన గొణుక్కుంటూ " ఆ..ఆ...ఎదుటి వాడికే చెప్పేటందుకు నీతులు!! తోటి ఆడపిల్లల సమస్యలక్కారణం కాకుండా వుంటారుట!! ఆచరణలో అంతా గురివిందలే!!" ఆయన ఆ మాటల నటానికేదో చేదు అనుభవముంటుం

దనిపించింది!!

ముందు అల్లుడు వినయ్ వాళ్ళ వూరు వెళ్ళి, ఆ గీత కుటుంబాన్ని కలసి గీత వలన కూతురి కాపరానికి ఏ ప్రమాదం రాకుండా ఆపాలి! తరువాతే వియ్యంకుడితో అల్లుడి గురించి మాటాడాలి !

భోజనాలయాక మాటలలో అడిగినట్టు అల్లుడి ఆఫీసులోనే పనిచేసే గీత గురించి వాళ్ళీవూరు వాళ్ళేనటకదా! -అంటూ అడిగింది! ఇరవై సంవత్సరాల క్రితం పక్క వీధిలోనే వుండేవారనీ, ఉద్యోగం తో ఎన్నో వూళ్ళు తిరిగినా ఇపుడు ఇక్కడే మంచి ఇల్లుకట్టుకుని స్ఠిరపడ్డారనీ ,

ఆ ఇంటికెళ్ళే గుర్తులు చెప్పారు.

నిజానికి గీత తనకెక్కువ పరిచయం లేకపోయినా, ఎంతో తెలిసినట్టుగా వియ్యంకుని కి అనిపించేటట్టు , ఒకసారి వాళ్ళింటికెళ్ళి వస్తానని చెప్పింది.!

వెళ్ళిన సుచరితకి గీత తల్లితండ్రులు కొడుకు దగ్గరకి హైదరాబాద్ వెళ్ళారని తెలిసింది. గీత మేనత్త చాలా మర్యాదగా లోపలికి ఆహ్వానించారు.

"మీ గీత గారికి సంబంధాలు చూస్తున్నారా? " యధాలాపంగా అడిగినట్టు అన్నా గీత మేనత్త మాత్రం "నాకేం తెలుస్తుందండీ? దానిష్టం! వాళ్ళ అమ్మా,నాన్నల ఇష్టం! గీత ని నా చేతుల్తో ప్రేమ గా పెంచానే కానీ, పెళ్ళి గురించి నేను కల్పించుకోను. పెళ్ళి అనే మాటంటేనే భయం నాకు !- ఎలాంటి వాడొస్తాడోనని"! ఆమె మాటలని ఆపేయబోయినా, సుచరిత ఏమైనా సరే గీత చేసే తప్పు జరుగ కుండా వాళ్ళ అత్తయ్యకి తెలియచెపితేనే గీత తల్లితండ్రులకి తెలుస్తుందని "అబ్బే, మరోలా అనుకోకండి. గీత మనసు లో ఎవరన్నా వున్నారేమో కనుక్కున్నారా? అడిగింది చొరవగా! మీ అభిప్రాయంలో ప్రేమ వివాహాలు మంచివా? పెద్దలు కుదిర్చినవా?" మామూలుగా అడుగుతున్నట్టు సహజంగా వుండటానికి ప్రయత్నించింది సుచరిత!

ఆవిడ ఏం మాట్లాడకుండా లేచి నిలబడి గోడ కేసి తదేకంగా నిస్తబ్ధంగా చూస్తూ వుండి పోయింది! సుచరిత ఎలా మాటలు పొడిగించాలా అనుకుంటూ తనుకూడా లేచి నిలబడగానే , కళ్ళు తుడుచుకుంటూ ఆమె "కూర్చోండి. ఇపుడే కాఫీ తెస్తాను." లోపలికి వెళ్ళిందావిడ.

సుచరితకి ఏం చేయాలో తెలియక ఇంటిని పరిశీలిస్తూ ఇందాక ఆవిడ సుదీర్ఘంగా చూసిన ఆ ఫొటో కేసి చూసింది సుచరిత. గుండె ఆగిపోయినట్టయింది. నోరు పొడారిపోయింది. కళ్ళు తిరుగుతున్నట్టయింది. ఆ ఫొటోలో గీత మేనత్త ఫొటో పక్కన వున్నది తన భర్తే!! అవును తన భర్తే!!

పెళ్ళయినవాడని తెలిసినా, అందంగా.మంచి పొజిషన్లో వున్న సురేంద్రని తానెలా వివాహం చేసుకున్నదీ గుర్తు వచ్చింది. సురేంద్ర భార్య ఈ గీత మేనత్తా? ఈమె గురించి తానెపుడూ ఆలోచించలేదు. ఇపుడు తన కూతురి గురించి ఆలోచించమని నచ్చచెప్పాలని కదా వచ్చింది!!?

"మాటాడవేమి?

మాఅమ్మ కోడలా !అన్నపెళ్ళాం! నాకొదిన!!" --ఫోన్ మోగసాగింది!!

- వేమూరి సత్యవతి

Tags:    
Advertisement

Similar News