(ప్రముఖ రచయిత శ్రీరమణ ఆంధ్రప్రభ వారపత్రికలో నిర్వహిస్తున్న 'శ్రీ ఛానెల్' ధారావాహిక బాగుందనీ, దాన్ని కొనసాగించాలని సూచిస్తూ వ్యంగ్యాత్మకంగా రాసిన లేఖ.)
అయ్యా!
ఆంధ్రప్రభ 10-11-97లో శ్రీరమణ అనే వ్యక్తి శ్రీఛానెల్ శీర్షికలో రాసిన నేమ్ డ్రాపింగ్ అనే వ్యాసాన్ని చదివాను. అయితే ఆయన నాతో ఇంటర్వ్యూ చేసి నా అనుభవాలన్నింటిని గ్రహించి తన అనుభవాలుగా చిత్రించి సకలాంధ్రావనికే తీరని ద్రోహం
చేశారు. ఆ వ్యాసం ప్రచురించడానికి కాని, నా అనుభవాలను తన అనుభవాలుగా మార్చుకోవడానికి గానీ సదరు రచయిత నాకు తాగించి కానీ, పైకమిచ్చి గానీ ఎలాంటి
అనుమతి తీసుకోలేదు. అవన్నీ నా అనుభవాలే! కాదంటే రాజకీయరంగంలో స్కాములు జరగనంత ,పి.వి.నరసింహారావు నవ్వినంత ఒట్టు.
విశ్వనాథకు జ్ఞానపీఠం వచ్చినప్పుడు ఢిల్లీలో నేనున్నది వాస్తవం. కొద్దోగొప్పో నా చేయి కూడా కలిసిందే! నిజానిజాలు నిర్ధారించుకోవాలంటే నిరాక్షేపంగా బెజవాడ గోపాలరెడ్డి గారిని వెళ్లి అడగండి. లేకపోతే ధైర్యముంటే విశ్వనాథనే నిలదీసి అడగండి.
నాకెలాంటి ఆసక్తి లేదు. వేదం వేంకటరాయశాస్త్రిగారు పుస్తకం ట్రాంబండిలో పోగొట్టుకొన్నట్లు రాశారు.
ఆ కాలానికి ట్రాంబండిగానీ, త్యాగరాయనగర్ కానీ మద్రాసులో లేవు. ఇది ఆయన అనుభవం కాదనడానికి ఇంతకన్నా సాక్ష్యమేమి కావలెను?
అసలు నిజం పాఠకులకు
చెప్పేస్తున్నాను. వేదం వారి వద్ద ఒక ప్రబంధం పుచ్చుకుని ఇంటికి తిరిగివస్తున్నాను. దాని పేరు తిలకాష్టమహిష బంధనం. అది టి.ఆర్.కవి ప్రణీతం. దారిలో వస్తుండగా మధు విక్రయశాల నన్ను ఆకర్షించింది. అభ్యుదయ కవిశేఖరుడు కూడా తాగనంత ఎక్కువగా పట్టించి ఇంటికి వచ్చాను.
మూడో రోజు మత్తుదిగి చూసుకుంటే పుస్తకం ఎక్కడో పోగొట్టుకున్నానని గుర్తించాను.
శ్రీరమణ ట్రాంబండిలో చదివి మొత్తం రాసినట్టు చెప్పి తాను ఏకసంథాగ్రాహినని నమ్మజూపారు.
కాని ఆ పుస్తకం నేను మత్తులో లేని వేళ అరగంట సేపు నా చేతిలో ఉంది. అంతా ఆ స్పర్శతో ఆ పుస్తకాన్ని యావత్తూ యథాతథంగా రాసిచ్చాను. ఇలా స్పర్శ మాత్రాన పుస్తకం యావత్తూ రాయగలిగిన నా ప్రతిభ అసాధారణమని వేదం వారు తమ తెల్లని గడ్డాన్ని నిమురుకుంటూ ప్రశంసించారు.
నేనెంతో వినయంతో "ఏముందండీ దానిలో! ఇది చాలా చిన్నపని. ఈ చిన్నపనికే ఎంతో మెచ్చుకుంటున్న సహృదయులు మీరు. నేను చాలా పెద్ద పనులు చేశాను.
కొందరు పెద్దవారే వినియోగించుకున్నారు. లాభపడ్డారు. కానీ ఒక మంచి మాట కూడా అనలేకపోయారు” అని సమాధానమిచ్చాను.పోనీ లేండి! శ్రీరమణ ఉత్సాహంగా రాశారు. నాలాంటి రాయని భాస్కరుల కి 'రమణీయంగా' రాసే భాస్కరులు మిన్న కదా! ఫరవాలేదు. ఈ శీర్షిక కొనసాగించవచ్చు.
శీర్షికకు, సంపాదకులకు త్రీ ఛీర్స్!!
(ఆంధ్రప్రభ (వారపత్రిక), 22-12-1997)
- వెలుదండ నిత్యానందరావు