సడక్ వెంట నడక

Advertisement
Update:2023-09-16 15:44 IST

ఒక్కడే, మంజునాధుడొక్కడే

అని పాడుకుంటూ

చూపుడు వేలును చూస్కుంటూ,

భ్రమణ గణన స్మరణంతో ప్రధమ భ్రమణం పూర్తి.

చుట్ట చర్చిల్ విక్టరీ సంకేత వేళ్ళు రెండు,

త్రిమూర్తుల మూడు వేళ్ళు,

దుష్ట చతుష్టయ నాలుగు వేళ్లు,

పంచ పాండవుల ఐదువేళ్లు,

బ్యాటు బాదుడికి సిక్సర్ కొడితే ఆరువేళ్లు,

సప్తాహంలో ఏడువేళ్లు,

సప్త భ్రమణాల గంటసేపు భ్రమణం సమాప్తం.

అర్ధంపర్ధం లేని వ్యర్ధ వాక్యాలు కావివి,

ప్రసన్నోషోదయ వ్యాయామ త్వరగమనంలో

గమన గణన సౌకర్య స్మరణ వాక్యాలివి.

ప్రకృతి సోయగాల, సొబగుల

సుమసౌరభాన్నాస్వాదిస్తూ,

ఆపాత మధుర మనోగీతాల నాలపించుకుంటూ,

ఆలకించుకుంటూ కొందరు,

చరవాణి సంభాషణలో నిమగ్నమైపోతూ మరికొందరు,

సహచర సంభాషణలో సరదాగా ఇంకొందరు,

కవిపుంగవుల నవకవనానికి మేధోమధనంతో గమిస్తూ

కొందరి శ్రమ గమనం, గమనశ్రమం!

కాలగణనంతో కొందరి గమనం,

గణన గమనంతో మరికొందరి గమనం,

భ్రమణ గణన సౌలభ్యంకై మనసులో మననం.

ఆరోగ్యంలో నలతలను మాయంచేసే నడకకై,

ఆరోగ్యదాయక శ్రమగమనానికి

గతిక్రమమేదైనా,

గమన గణన రీతేదైనా,

సడక్ మీద నడకకు సరిసమానమేది?

- వేదం సూర్యప్రకాశం (నెల్లూరు)

Tags:    
Advertisement

Similar News