అంతర్వేదం

Advertisement
Update:2023-09-18 17:30 IST

ఖాళీ కలలాంటి దేహంకోసం

కొన్ని కుదుపులనీ

కొన్ని బరువులనీ మోసాక

ఫ్యాన్సీ డ్రెస్ లేని

ఓ మనసుకోసం

ప్రతీక్ష

సెకన్లముల్లులా కొట్టుమిట్టాడుతున్న జీవితం

గుండెకికట్టుకున్న గాయం భారమయ్యి

మరీ అర్ధాలొలికితే తప్ప

ఓ ఫోర్త్ డైమెన్షన్ కోసం

మరో ప్రతీక్షా తప్పదేమో

మనిషి కురిస్తే బావుణ్ణనే అత్యాశ

ఉప్పెండిన మేఘంలా కురిస్తే బావుణ్ణనే

గొంతెమ్మకోర్కె --

మరణాన్నీ మార్కెట్ చెయ్యని మనిషిగా

స్రవిస్తే బావుణ్ణనే అంతర్ఘోష

ఏమీ లేకపోవటం

శూన్యం కాదన్నాక

నిరీక్షణ నింపుకున్న కళ్ళూ

లబ్‌డబ్ జీవితాన్ని నిర్వేదంగా మోస్తున్న గుండె

మాస్కులు తొడగని మనిషికోసం

అలుపెరగని తీవ్ర ప్రతీక్ష

మోహానికావల మరేదో ఉందనే

అమాయకత్వం లోంచి బయటపడేసరికి

గమ్యంకంటే

ప్రయాణమే ముఖ్యమనే నిజం ఒంటబట్టేసరికే సగంకాలిన వత్తిలా

నిస్సహాయత

సర్వసముద్రం ముందు నిలబడి

శూన్యానికి అర్ధం వెతుక్కునే

జీవితానికేం పేరు,

నిరీక్షణ తప్ప

గాలిబుడగలపై

రంగుల మాయాజాలం

ఓ మిథ్యేనని తెలియటమే యుక్తవయస్సా

తానెక్కిన పల్లకీని మోస్తున్నవన్నీ సర్పాలేనన్న

జ్ఞాతమే ఓ జ్ఞానోదయమా

అమ్ముకోలేని కన్నీళ్ళు, కొనుక్కోలేని వర్షపు చుక్కలూ

అవిశ్రాంత సాలెగూళ్ల నుంచీ ఓ పాఠం

అవగతమయ్యాక

ఇక చెప్పటానికేముండదు

కెరటాలేం చెప్పవు--ప్రయత్నించమని తప్ప

నదులేం చెప్పవు-- ప్రవహించమని తప్ప

బొమికలగూడు ఆశ్రమం

బంతులకూడు ఆశ్రయం

అర్ధవంతమైన జీవితానికి అత్యవసరమైన

అంతర్వేదమేదో రాయక,

రాక తప్పదేమో

- వాసుదేవ్

Tags:    
Advertisement

Similar News