నిశ్శబ్దగీతం (కవిత)

Advertisement
Update:2023-10-08 15:22 IST

బాహ్యంలో బలాఢ్యుడవైన మనిషీ!

చూసుకున్నావా నీలోనికి నీవు ఎప్పుడైనా!

నోచుకుందా అంతరాత్మ

ఆ భాగ్యం ఎన్నడైనా!

అంతా నీదని నొల్లుకున్నప్పుడు

స్వార్థం ముల్లు చిన్నగా గుచ్చడం తెలిసిందా!

అసహాయులకు

చేయందించనప్పుడు

చెళ్లుమనిపించింది గుర్తుందా!

నాకేమని చేతులు

దులిపేసుకున్నప్పుడు

చేతకానివాడివని వెక్కిరించింది విన్నావా!

అందరి తప్పులూ ఎత్తిచూపుతున్నప్పుడు

గురివిందవు నీవంటూ

ఫక్కున నవ్వింది మరిచావా!

ప్రగతిబాటయని

పైకెళ్తున్నప్పుడు

తొక్కుతున్నావంటూ ముక్కుతుంది పట్టించుకో!

అవినీతికి

అలవాటుపడినప్పుడు

అణువణువూ ప్రశ్నిస్తుంది సమాధానమియ్!

ఆత్మీయులను

ఆదరించనప్పుడు

నోరునొక్కుతున్నావని నొచ్చుకుంది చూసావా!

బాధ్యత మరచి

సోమరివైనప్పుడు

నీరసంగా నీలుగుతుంది...

నిమ్మళంగా నిద్రపోతుంది

వినాలన్నా వినలేని

ఆ నిశ్శబ్దగీతం ఎప్పుడో ఆగిపోతుంది...

అంతరాత్మ నిద్రపోయినా

బ్రతికే ఉంటావు బాహ్యంలో

అన్ని జీవుల్లానే...

మనిషిగా మాత్రం నీవు

నిహతుడివే!!

-వాణిశ్రీ నైనాల

(గుంటూరు)

Tags:    
Advertisement

Similar News