ఎన్ని మహాయుగాలు యాతనపడి
ఎన్ని మహాప్రళయాలు దాటుకుని
విశ్వం తన ఆకృతి చెక్కుకుందో..
ఎన్ని యుగాలు పోగేసుకుని
ఎన్ని విలీన విస్ఫోటనాలతో
భూమి తన రూపాన్ని దిద్దుకుందో..
ఎన్ని సహస్రాబ్దాల కలగా
ఎన్ని సంవేదనల జతగా
వసంతం ఇక్కడకొచ్చి వాలిందో..
నీవు అడుగు పెట్టడానికి ముందే
జరిగిన అనంతకోటి పరిణామాల్లో
మనుగడ కోసం నీవు చేసిన పోరాటం
అస్తిత్వం కోసం నీవు పడ్డ ఆరాటం
ఆవగింజలో అనంతపరిమాణమే
నువ్విక్కడకు రాకముందే
సూర్యుడు సముద్రాన్ని చుంబించాడు
చందమామ కొలనులో స్నానించాడు
పర్వతాలు మునుల్లా తపస్సు చేశాయి
అడవి అధరాల్లో గాలి వేణువై పాడింది
నదులు నాట్యమాడాయి
పక్షులు పాటపాడాయి
విశ్వం నీతోనే ఆరంభమైనట్లు
సృష్టికి ప్రతిసృష్టి నీకే సాధ్యమంటూ
ఎందుకు నీకీమిడిసిపాటు
గట్టిగా రాస్తే నీ చరిత్ర సమస్తం
ఒక్కటంటే ఒక్క వాక్యం కాదు
నీ ఉనికి ఊరపిచ్చుకంత
ఊపిరి ఉఫ్ మంటే రాలిపోయేంత
సకలచరాచర సృష్టిలో
నీ చావుపుట్టుకలు గణించాల్సిన
విషయాలేమాత్రమూ కానేకావు
సృష్టిధర్మాన్నీ మానవవిలువల్నీ
కాపాడడమే నీ కర్తవ్యమనీ
ఇంకెప్పుడు తెలుసుకుంటావ్
ఋతువులు సృష్టించగలవా
సముద్రాలు తవ్వగలవా
గాలిని ఆపగలవా
పర్వతాలు నిర్మించగలవా
కులమతాల పాకుడురాళ్ళపై
ఇంకెంతకాలం జారుతావు
అసమానతల హద్దురాళ్ళు
ఇంకెన్నాళ్ళు పాతుకుంటావు
క్షణంలో కూలి కుళ్ళిపోయే
నీ తనువుకెందుకింత అహం
మరునాడే మట్టికలిసే దేహంపై
ఎందుకింత వ్యామోహం
ఈ నీటి బుడగ పగలకముందే
నీవైన ఆనవాళ్లు కొన్ని
ఈ నేలపై చెక్కు..
మట్టిలో కలిశాక కూడా
మనిషి వై మిగులుతావు..
- తుల శ్రీనివాస్