తంగెళ్లపల్లి గుట్టపై క్రీ.పూ. 4000 ఏళ్ల ఆనవాళ్లు!

సిద్దిపేట జిల్లా తంగెళ్లపల్లి శివారులోని కిష్టమ్మగుట్టపై కొత్త రాతియుగపు ఆనవాళ్లు వెలుగు చూశాయని, పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్, సీఈవో, డా. ఈమని శివనాగిరెడ్డి తెలిపారు.

Advertisement
Update:2023-10-08 17:29 IST

సిద్దిపేట జిల్లా తంగెళ్లపల్లి శివారులోని కిష్టమ్మగుట్టపై కొత్త రాతియుగపు ఆనవాళ్లు వెలుగు చూశాయని, పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్, సీఈవో, డా. ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. కోహెడ మండలం, గొట్లమెట్లకు చెందిన చింతపల్లి రవీందర్ రెడ్డి, గ్రామంలోని కాకతీయ కాలపు శిధిల శివాలయాన్ని పునరుద్ధణ చేయ‌డానికి ఆహ్వానించగా, తంగెళ్లపల్లి గుట్టపై ఆదివారం నాడు జరిపిన అన్వేషణలో ఆదిమానవుని ఆనవాళ్లు కనిపించాయని అన్నారు.

తంగెళ్లపల్లి- కోహెడ మార్గంలోని కిష్టమ్మగుట్టపై గల వేణుగోపాల స్వామి ఆలయ మార్గంలో కుడివైపు గల రాతి పరుపుపై మూడు చోట్ల క్రీ. పూ. 4000 సంవత్సరాల క్రితం, ఆనాటి మానవులు రాతి గొడ్డలను పదును పెట్టుకున్నప్పుడు ఏర్పడిన గుంతలు ఉన్నాయని, అవి 15 నుంచి 30 సెంటీమీటర్ల పొడవు, 3 నుంచి 6 సెంటీమీటర్ల వెడల్పు, 2 నుంచి 3 సెంటీమీటర్ల లోతు ఉన్నాయని శివనాగిరెడ్డి తెలిపారు. పరిసరాల్లోని రాతి ఆవాసాలు, నీటి వనరులు ఆనాటి మానవులు కిష్టమ్మగుట్టపై తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకోవడానికి తోడ్పడ్డాయన్నారు. తంగెళ్లపల్లి గ్రామ చరిత్రకు చక్కటి ఆధారాలైన ఇప్పటికి 6000 సంవత్సరాల నాటి ఆనవాళ్లను కాపాడుకొని, భవిష్యత్ తరాలకు అందించాలని గ్రామస్తులకు ఆయన విజ్ఞప్తి చేశారు.

కార్యక్రమంలో గొట్లమిట్ట గ్రామానికి చెందిన వట్టిపల్లి లింగారెడ్డి, బొలుమల్ల ఎల్లయ్య, మీసాల రాజయ్య, శిల్పి షేక్ రబ్బాని, శనిగారంకు చెందిన ననువాల ప్రతాపరెడ్డి పాల్గొన్నారని శివనాగిరెడ్డి తెలిపారు.



Tags:    
Advertisement

Similar News