భార్య హుషారును చూస్తుంటే మనోహర్ కి ముచ్చటగా ఉంది. అలాగని, మదిలో కించిత్తు నిరుత్సాహంగానూ లేకపోలేదు. సంక్రాంతి పండుగ వస్తోంది. పెద్దపండుగకు ప్రతి ఏడూ పుట్టింటికి వెళ్ళడం సహస్రకు ఆనవాయితీ అయిపోయింది. పెళ్ళైన ఆడపిల్లలకు పుట్టింటికి వెళ్ళడమంటే అమిత ఉత్సాహము, హుషారూనన్న సంగతి అతను ఎరుగనిదికాదు.
సహస్ర పుట్టిల్లు అందాల గోదావరీ తీరాన ఉన్న ఓ సుందర గ్రామం. ప్రకృతికాంత పచ్చచీర కట్టినట్టు ఎటు చూసినా పచ్చదనంతో కళకళలాడుతుంటుంది…పెళ్ళవగానే భర్తతో హైదరాబాదుకు వచ్చేసింది సహస్ర. అయినా ప్రతి ఏడూ పుట్టింటిలో జరుపుకునే సంక్రాంతి వేడుకలలో ఆమె భాగం కావలసిందే! కన్నవారితో, తోబుట్టువులతో, బంధుమిత్రులతో పండుగ ఐదు రోజులూ సరదా సంతోషాలను పంచుకోవలసిందే!
మనోహర్, సహస్రల వివాహమయి పుష్కరం దాటింది. పదేళ్ళ పాప, ఏడేళ్ళ బాబు ఉన్నారు. అయినా ప్రతి సంక్రాంతికీ పుట్టింటికి వెళ్ళడం మానదు సహస్ర. మనోహర్ హైదరాబాదులో ఓ ఎమ్మెన్సీలో సాఫ్ట్ వేర్ ఇంజనీరు. మనిషి సౌమ్యుడు. గృహిణి ఐన భార్య సంతోషాలకూ సరదాలకూ అడ్డురావడం అతనికి ఇష్టం ఉండదు.
సంక్రాంతి ఇంకా నెల్లాళ్ళు ఉందనగానే ప్లానింగ్ మొదలుపెట్టేసింది సహస్ర. వారం రోజుల ట్రిప్. పిల్లలకు సంక్రాంతి సెలవులు. మనోహర్ కి మాత్రం సెలవు దొరకడం అసంభవం. అందుకే పిల్లల్ని తీసుకుని ఒక్కతే వెళుతుంది. కొన్నేళ్ళుగా అదే జరుగుతోంది. సంక్రాంతి వస్తోందంటే సహస్రకు హుషారూ, మనోహర్ కి నీరసమూనూ. ఆ వారం రోజులూ హోటల్ భోజనం, ఒంటరి పడకాను మరి అతనికి.
సహస్ర తండ్రి పేరున్న భూస్వామి. ఆమె ఒక్కతే కూతురు. ఇద్దరు మగపిల్లల తరువాత పుట్టిన ఆడపిల్ల కావడంతో అపురూపంగా చూసుకుంటారంతా…తమ వివాహమైన తొలి సంక్రాంతి గుర్తుకువచ్చింది మనోహర్ కి…
పండుగకు నాలుగు రోజులు ముందుగానే రావలసిందిగా మామగారి అభ్యర్థన. పండుగ వారం రోజులూ ఉండి వెళ్ళాలన్నారు. అసలే తాను ఉద్యోగంలో చేరిన కొత్త. అన్ని రోజులు సెలవు అంటే అసంభవం.
“మన పెళ్ళైన తొలి సంక్రాంతి ఇది. మీకు, నాకు కొత్తబట్టలు పెట్టి బహుమతులు ఇస్తారు మావాళ్ళు. వెళ్ళకపోతే చిన్నబుచ్చుకుంటారు” అంది సహస్ర. “నిజమే. కాని, ఓ ముఖ్యమైన ప్రాజెక్ట్ లో ఉన్నాను నేను. సెలవు దొరకడం అసంభవం” అన్నాడు మనోహర్.
“మొదటి పండుగకే అల్లుడు అత్తారింటికి రాలేదంటే బంధువులంతా పలురకాలుగా మాట్లాడుకుంటారు. మావాళ్ళ పరువుకు సంబంధిన విషయం అది” అంటూ గ్రుడ్ల నీరు క్రుక్కుకుందామె.ఒక్కతెనూ వెళ్ళమన్నాడు అతను. అది మరింత అవమానకరం అంటూ ససేమిరా అంది. ఏడుస్తూ కూర్చుంది. మౌనపోరాటం సాగించింది. నిరాహారదీక్ష చేసింది.
మనోహర్ కి తల తిరిగిపోయింది. ‘కిం కర్తవ్యం!?’ అనుకుంటూ ప్రాజెక్ట్ లీడర్ ఆంజనేయులు దగ్గర వాపోయాడు.
ఆంజనేయులు యాభయ్యోపడిలో ఉంటాడు. మనోహర్ యొక్క గోడు ఆలకిస్తూంటే తన స్వంత అనుభవం జ్ఞప్తికి వచ్చిందతనికి…తన పెళ్ళైన కొత్తలో దసరా పండుగ వచ్చింది. అత్తారింట్లో నవరాత్రి పూజలు ఘనంగా జరుపుతారు. అల్లుడు, కూతురు తప్పనిసరిగా రావాలనీ, నవరాత్రులు ముగిసేవరకు వుండాలనీ పట్టుపట్టారు మావగారు. అప్పటికి తాను ఓ జూనియర్ ఉద్యోగి. ముఖ్యమైన ప్రాజెక్టులలో పనిచేస్తున్నాడు. సెలవు అడిగితే కొట్టినంత పని చేసాడు తన బాస్.
సెలవు దొరకలేదనేసరికి భార్యామణి అలకపాన్పు ఎక్కేసింది. నిరాహార దీక్ష చేయడమే కాక, తనకు ఫుడ్డూ బెడ్డూ కరవు చేసేసింది. ఆ బాధ భరించలేక డాక్టర్ కి ముడుపు చెల్లించి మెడికల్ సర్టిఫికేట్ సంపాదించి సిక్ లీవ్ పెట్టేసాడు, ఏమైతే అయిందని. పండుగకు అత్తారింటికి వెళ్ళొచ్చాడు…
స్వానుభవం దృశ్యకావ్యమై కనులముందు ఆవిష్కరించడంతో మదిలోనే నవ్వుకున్నాడు ఆంజనేయులు, ‘హిస్టరీ రిపీట్స్!’ అనుకుంటూ. మనోహర్ యొక్క సమస్యను సానుభూతితో అర్థంచేసుకున్నాడు.
“డోంట్ వర్రీ మై బాయ్! కొత్తజంట ముచ్చటను కాదనడానికి నాకు మనసురావడంలేదు. పైగా ఇది ఫస్ట్ ఫెస్టివల్ కూడాను. సెలవు మంజూరుచేస్తున్నాను. కాకపోతే, నీతోపాటు నీ సెకండ్ సెటప్ – ఆర్, ఈజిట్ ద ఫస్ట్ వన్? - అదేనయ్యా, నీ ల్యాప్ టాప్! దాన్ని కూడా తీసుకువెళ్ళు. సందు దొరికినపుడల్లా ప్రాజెక్ట్ లో తలదూర్చు. సందేహాలుంటే తీర్చుకోవడానికి సెల్ ఫోన్లు ఉండనే ఉన్నాయి” అని నవ్వేసాడు.
అతనికి కృతజ్ఞతలు ఎలా తెలుపుకోవాలో తెలియలేదు మనోహర్ కి. పాదాభివందనం చేయబోతే, ఆంజనేయులు అడ్డుకున్నాడు.
ఆ సంక్రాంతి మనోహర్ కి జీవితంలోనే మరపురాని అనుభూతిగా మిగిలిపోయింది.
తండ్రి ఉద్యోగరీత్యా ఉత్తరాదిలో పెరిగాడు తాను. ఇంట్లో పండుగలు చేసుకున్నా, తెలుగు సంస్కృతి, ఆచారాలకు కొంచెం దూరం. మొదటిసారిగా స్వంతగడ్డపైన జరిగే సంక్రాంతి విశేషాలు అమితంగా ఆకట్టుకున్నాయి అతన్ని. అత్తవారింట్లో అంతా తనను ‘వి.ఐ.పి.’ లా చూస్తుంటే సంతోషం కలిగింది. అత్తమామలు, బావమరదులు, వారి కుటుంబాలు, బంధువర్గం, సన్నిహితులు అంతా పండుగ వేడుకలను పంచుకుంటుంటే హృద్యంగా అనిపించింది.
భోగి రోజున చలితో ముడుచుకుని పడుకున్న భర్తను బలవంతంగా నిద్రలేపేసి భోగిమంట దగ్గరకు లాక్కుపోయింది సహస్ర. పెద్ద పెద్ద దుంగలతో మిన్నంటుతోంది మంట. పిల్లలు, పెద్దలు అంతా మంట చుట్టూ చేరి చలికాచుకుంటున్నారు. కొందరు పిడకలదండలు తెచ్చి మంటలో వేస్తున్నారు. మరికొందరు పచ్చిపులుసుకోసం పెద్ద వంకాయలను తెచ్చి ఆ మంటలో కాల్చుకుంటున్నారు.
ఏడాది పొడవునా చేరిన పనికిరాని చెక్క సామాన్లను భోగిమంటకు ఆహుతి చేస్తారని చెప్పింది సహస్ర. కొందరు ఆకతాయి పిల్లలు ముందురోజు రాత్రి ఊరి మీద పడి, ఇళ్ళబైట కనిపించిన నులకమంచాలు, చెక్కపెట్టెలు వగైరాలను ఎత్తుకువచ్చి మంటల్లో పడేస్తారనీ, ఆ సంగతి తెలిసి వాటి యజమానులు లబోదిబోమంటారనీ ఆమె చెబుతుంటే నవ్వు ఆపుకోలేకపోయాడు మనోహర్.
భర్తకు కుంకుడుకాయపులుసుతో తలంటింది సహస్ర. ఇంట్లో చేసిన సున్నుండలు, అరిసెలు, పోకుండలు, కజ్జికాయలు, జంతికలు వగైరాలను వెండిపళ్ళెంలో పెట్టుకుని వచ్చి కొసరి కొసరి తినిపించింది. ఆనక పెసరట్లు, కాఫీలూ అవగానే బావమరదులతో కలసి పొలానికి బైలుదేరాడు మనోహర్.
నెల పట్టిన నాటి నుండీ రోజూ రాత్రులు వాకిళ్ళలో పెద్దపెద్ద రంగుల ముగ్గులు పోటీల మీద పెడతారంతా. ఇంటిముంగిట పేడతో గొబ్బెమ్మలను పెడతారు. ఇళ్ళ ముందు గొబ్బెమ్మలు చూడముచ్చటగా ఉంటే, భోగిమంటలు ఇంకా వెలుగుతూనే ఉన్నాయి.
పొలంనుండి తిరిగి వచ్చాక బంధువుల తాలూకు చిన్నపిల్లలకు భోగిపళ్ళు పోసే కార్యక్రమం జరిగింది. అక్కడ చేరిన ఆడవాళ్ళు, పెద్దపిల్లలూ పసివాళ్ళ తలలపైన పోసిన రేగిపళ్ళు క్రింద పడుతూనే పోటీల మీద ఏరుకోవడం సరదాగా ఉంది.
సంక్రాంతి రోజున ఉదయమే గంగిరెద్దుల మేళాలూ, కీర్తనలను ఆలపిస్తూ హరిదాసులూ వీధుల్లో హడావుడి చేసారు. అత్తవారు మనోహర్ కి కొత్తబట్టలు, బంగారు గొలుసు, ఉంగరమూ పెట్టారు. కూతురికి కంచి పట్టుచీర, నెక్లెస్ సెట్టూ ఇచ్చారు. ఆమె వాటిని ధరించి ఇంట్లో తిరుగుతూంటే అప్సరసలా కనిపించింది మనోహర్ కళ్ళకు.
పొంగల్, పరమాన్నం, గారెలు, బూరెలు వగైరాలు వండి…కొత్త ధాన్యపు వరికంకెలు, చెరకుగెడలతో అలంకరించిన ‘సంక్రాంతిలక్ష్మి’ కి పూజ చేసి ప్రసాదాలను భుజించారంతా. కొత్త ఫలాలతో, పిండివంటలతో ‘పెద్దలకు’ నైవేద్యం పెట్టారు. ఆడ, మగ అంతా కూర్చుని చతురోక్తులాడుకుంటూ, నవ్వులు పంచుకుంటూ భోంచేసారు. మనోహర్ మొదట బిడియపడ్డా, తరువాత అందరితోనూ ఫ్రీగా కలసిపోయాడు.
బావమరదులతో ఊరిబైట తోటలోకి వెళ్ళాడు మనోహర్. కోడిపందాలు ముమ్మరంగా సాగుతున్నాయి అక్కడ. జనం గుంపులుగా చేరి, పౌరుషానికి ప్రతీకల్లా పోరాడుతూన్న బలిసిన కోడిపుంజులను అరుపులు, కేరింతాలతో ఎగబడి చూస్తున్నారు. ఆ పందేలలో కోట్లరూపాయలు, స్థిరాస్థులతో సహా చేతులు మారతాయనీ, ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతాయనీ బావమరదులు చెబుతుంటే ఆశ్చర్యపోయాడు మనోహర్…సంక్రాంతికి ఊళ్ళో కుస్తీ పోటీలు కూడా జరుగుతాయి. అక్కడికి వెళ్ళారు. మనోహర్ ఆసక్తిగా తిలకించాడు.
మరుసటి రోజు కనుమ పండుగ. గోపూజ చేస్తారు. ఆవులను, దూడలను అలంకరించి, ముఖానికి పసుపు పూసి కుంకుమబొట్లు పెట్టి పూజించారు. అందరూ గోమాతకు దాణా వేసి దణ్ణం పెట్టుకున్నారు…ఇక ముక్కనుమనాడు మేకలను వేట వేసారు…చివరి రోజున ‘రథం ముగ్గు’ లు వేసి ఊరి చివరి వరకు లాగేసారంతా.
పండుగ అన్ని రోజులూ ఎంతో మనోహరంగా అనిపించింది మనోహర్ కి. రోజూ వివిధ పిండివంటలు, స్వీట్లతో విందుభోజనాలు, సన్నిహితబంధువుల ఇళ్ళలో డిన్నర్లూ, వినోదాలతో కాలమే తెలియలేదు. వరసైనవారి వేళాకోళాలు, పెద్దవాళ్ళ ఆప్యాయతలు, చిన్నపిల్లల కొంటెచేష్టలతో సరదాగా గడచిపోయింది.
ఐతే రాత్రులు ఆఫీసువర్క్ ను మాత్రం విస్మరించలేదు…తిరుగుప్రయాణం అనేసరికి సహస్ర ఏడ్చేసింది. మనోహర్ కి కూడా ఆ ఆహ్లాదకర వాతావరణాన్ని వదలి వెళుతుంటే ఎలాగో అనిపించింది…
ఆ తరువాత ఎప్పుడూ పండుగకు వెళ్ళివుండే తీరిక చిక్కలేదు మనోహర్ కి. పెళ్ళైన రెండేళ్ళకు ఈషా పుట్టింది. మరో మూడేళ్ళకు కిరణ్ పుట్టాడు…పెళ్ళయి పుష్కరం దాటినా సంక్రాంతి పండుగకు పుట్టింటికి వెళ్ళడంమాత్రం మానలేదు సహస్ర. అతనికి వీలుపడదని పిల్లల్ని తీసుకుని వెళుతుంది.
అమ్మమ్మగారింటికంటే పిల్లలు ఎగిరిగంతేస్తారు. అక్కడ అందరూ వారిని బాగా ముద్దుచేస్తారు.
ఐతే, భార్య పుట్టింటికి వెళ్ళినపుడల్లా మనోహర్ కి ఒంటరితనం తప్పదు. పండుగకు స్నేహితులో, సహోద్యోగులో అతన్ని భోజనానికి తమ ఇళ్ళకు ఆహ్వానించడం కద్దు. పండుగపూట అలా వెళ్ళడం ఇష్టంలేకపోయినా, కాదనలేని పరిస్థితి.తన చిన్ననాటనుండీ పుట్టింట్లో జరిగే సంక్రాంతి వేడుకలను గుర్తుకు తెచ్చుకుని మురిసిపోతుంటుంది సహస్ర. వాటిని కథలుగా పిల్లలకు చెబుతుంది. ఉత్సాహంతో ఆలకిస్తారు వాళ్ళు. మళ్ళీమళ్ళీ అడిగి చెప్పించుకుంటారు…
సహస్ర ప్రయాణం ఇక మూడురోజులే ఉంది. బట్టలు సర్దుకోవడంలో పిల్లలకు సాయంచేస్తున్నాడు మనోహర్.
ఈషా ఉన్నట్టుండి తండ్రిని అడిగింది – “నువ్వూ మాతో రాకూడదూ, డాడీ?” ఆఫీసులో పనుందనీ, తాను రాలేననీ చెప్పాడు మనోహర్.
“మేమంతా ఊరికి వెళ్ళిపోతే నువ్విక్కడ ఒక్కడివే ఉంటావుగా?” “వారం రోజులేగా! పరవాలేదులే” అన్నాడు.
“అక్కడ అమ్మమ్మ, తాతయ్య, మావయ్యలు, అత్తయ్యలు, మమ్మీ కజిన్సూ అందరూ ఉంటారు. నువ్వు కూడా ఉంటే నాకు హ్యాపీగా ఉంటుంది, డాడీ!” జాలిగా అంది ఈషా. మనోహర్ ప్రేమగా కూతుర్ని గుండెలకు హత్తుకున్నాడు.
“డాడీ! ప్రతి ఏడూ సంక్రాంతి పండుగను మేము అమ్మమ్మగారింటి దగ్గరే జరుపుకోవాలా?” అమాయకంగా అడిగింది. అతను నవ్వి, “అమ్మ, నాన్నల దగ్గర జరుపుకోవడమే మమ్మీకి ఇష్టం” అన్నాడు.
“అలాగే, మా మమ్మీడాడీల దగ్గర జరుపుకోవాలని నాకు, తమ్ముడికీ కూడా ఉంటుంది కదా?” లాజిక్ తీసింది ఈషా. “మేము అక్కడ అందరితో ఎంజాయ్ చేస్తుంటే, ఇక్కడ నువ్వు ఒక్కడివే ఉండడం నాకు నచ్చడంలేదు, డాడీ!” ఆ పిల్ల కళ్ళమ్మట నీళ్ళు వచ్చాయి.
తెల్లబోయిన మనోహర్ పాపను దగ్గరకు తీసుకుని, “ఛఁ, పిచ్చిపిల్ల! ఈమాత్రానికే ఏడుస్తారా ఎవరైనా?” అన్నాడు కళ్ళు తుడుస్తూ.
“పోనీ, నేను ఉండిపోతాను. మమ్మీ, తమ్ముడూ వెళతారు. మనిద్దరమూ ఇక్కడ ఇంచక్కా పండుగ చేసుకుందాం” అంది మళ్ళీ. “నాకు ఇల్లు డెకొరేట్ చేయడం వచ్చును, డాడీ! క్రిష్టమస్ కి నా ఫ్రెండ్ ఇంట్లో డెకొరేట్ చేసాము. ముగ్గులు కూడా వేస్తాను. బొమ్మలు కొనుక్కొచ్చి బొమ్మలకొలువు పెడదాం. నీ ఫ్రెండ్స్ నీ నా ఫ్రెండ్స్ నీ పిలిచి పార్టీ ఇద్దాం. ఫుడ్ కోర్ట్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేద్దాం”.
ఎక్కడనుండి ఆలకించాడో, పరుగెత్తుకొచ్చి, “నేనూ మీతో ఉండిపోతాను. ఇంచక్కా పండక్కి నా ఫ్రెండ్స్ ని కూడా పిలుచుకుంటాను” అన్నాడు కిరణ్ ఉత్సాహంగా.
“లేదర్రా. వచ్చే ఏడాది మనందరం కలసి వెళదాంలే,” సర్దిచెప్పబోయాడు మనోహర్.
“డాడీ! మమ్మీ తన పండుగ జ్ఞాపకాలను హ్యాపీగా చెప్పుకుంటున్నట్టే…మా మమ్మీడాడీలతో మనింట్లో పండుగ జరుపుకుని, ఆ జ్ఞాపకాలను మేం కూడా దాచుకోవాలని…మాకూ అనిపిస్తుంది కదా!”
కూతురి ప్రశ్నకు ఏం జవాబు చెప్పాలో తెలియలేదు మనోహర్ కి.
“ప్లీజ్, డాడీ! ఈసారి పండుగ మనింట్లో చేసుకుందాం. కావలిస్తే అమ్మమ్మగారింటికి మమ్మీని ఒక్కతినే వెళ్ళమందాం” అన్నాడు కిరణ్.
వారికి ఎలా నచ్చజెప్పాలో బోధపడలేదు అతనికి. “నా బంగారాలు కదూ! ఈసారికి మమ్మీతో వెళ్ళండి. వచ్చేఏడు మనందరం పండుగ ఇక్కడే చేసుకుందాం. మీరు రానంటే మమ్మీ బాధపడుతుంది” అన్నాడు.
“మా మాట కాదంటే మేం సత్యాగ్రహం చేస్తాం” అంది ఈషా. “ఔను” అన్నాడు కిరణ్.
పక్కగదిలోంచి తండ్రీకూతుళ్ళ సంభాషణను ఆలకిస్తూన్న సహస్ర అక్కడికి వచ్చింది.
“అవసరంలేదు. మన ప్రయాణం క్యాన్సెల్డ్” అంది. “సహస్రా!” మనోహర్ ఆశ్చర్యంగా చూసాడు.
“ఔనండీ! చంటిది నాకళ్ళు తెరిపించింది. నాకున్న తీపిగురుతులలాంటివే నా పిల్లలకూ మిగల్చాలన్న ఆలోచన నాకు రాకపోవడం ఆశ్చర్యకరం. ఇకమీదట సంక్రాంతి ఒక్కటే కాదు, పండుగలన్నీ ఇక్కడే జరుపుకుందాం. మన ఆనందాన్ని స్నేహితులతో పంచుకుందాం” అంది సహస్ర.
పిల్లలు ఆనందంతో చప్పెట్లుకొట్టారు. “మా మంచి మమ్మీ” అంటూ పరుగెత్తుకు వెళ్ళి తల్లిని వాటేసుకుని ముద్దులు పెట్టుకున్నారు. మనోహర్ భార్య చెవిలో ఏదో చెప్పాడు.
అతని వంక ఆశ్చర్యంతో చూసి, అంతలోనే “వండర్ ఫుల్!” అంటూ అక్కణ్ణుంచి వెళ్ళిపోయిందామె.
“మమ్మీ చెవిలో ఏం చెప్పావు, డాడీ?” అంటూ పిల్లలు ఇద్దరూ అతన్ని వాటేసుకుని అడిగారు.
“అది సీక్రెట్!” అని నవ్వేసాడు అతను.
కొద్దిసేపటికి తిరిగి వచ్చి, “ఈ సంక్రాంతిని మనతో గడపేందుకు అమ్మ, నాన్నా అంగీకరించారండీ. ఎల్లుండి వస్తున్నారు” అంది సహస్ర ఆనందంగా.
“భలే! భలే! అమ్మమ్మ, తాతయ్య వస్తారట…” పిల్లలు సంతోషంతో గంతులు వేసారు.
భర్తవంక కృతజ్ఞతాపూర్వకంగా చూసింది సహస్ర. జవాబుగా అతని పెదవులపైన మందహాసరేఖ వెలసింది.