“బాబూ! సదా! కాస్త మంచినీళ్ళు పట్రామ్మా, తెగ దాహం వేస్తోంది” అంటూ ఇంట్లోకి అడుగు పెట్టాడు శంకరరామయ్య. అసలే రోహిణికార్తె యెండలు మండిపోతున్నాయి. అందులోనూ మిట్టమధ్యాహ్నంలో వంటపని చేసుకుని ఇంటిలోకి అడుగు పెట్టిన క్షణం కళ్ళు బైర్లు కమ్మాయి. అక్కడే ఉన్న చాప మీద నీరసంతో, ఉస్సూ….రంటూ చతికిలబడ్డాడు. తండ్రి అడుగుల సవ్వడి, పిలుపు విన్న 17 యేళ్ళ సదానందం ఒక చేతిలో కుండనీళ్ళ చెంబు, మరోచేత్తో విసనకర్ర తీసుకువచ్చాడు. తండ్రి సేదదీరేదాకా విసనకర్రతో వీస్తూ, ఆయన చొక్కాని వదులు చేసాడు. కాస్సేపు తరువాత తండ్రి కళ్ళు తెరవడం చూసి, నాన్నా!మొదట కాళ్ళు, చేతులు కడుక్కో. ఆ తరువాత మంచినీళ్ళు తాగుదువుగాని” అంటూ కాళ్ళు కడుక్కోడానికి నీళ్ళ చెంబు అందించాడు చిరునవ్వుతో.
చాచిన కాళ్ళని సర్దుకుని, నిదానంగా కూర్చున్నాడు శంకరం. కొడుకు చెప్పినట్లే చెంబు అందుకుని కాళ్ళు, చేతులు, ముఖం కడుక్కున్నతక్షణం కాస్త బడలిక తీరినట్లైంది. తరువాత కొడుకు అందించిన నీళ్ళచెంబు అందుకుని, గబగబా తాగబోయాడు. “నాన్నా! మెల్లగా తాగు, పొరపోతుంది” అన్న కొడుకుని చూస్తూ, వాడు చూపే అక్కరకి, ఆప్యాయతకి మురిసిపోతూ, “అలాగేలేరా!” అంటూ, కరెంటు పోయిందా నాన్నా? విసురుతున్నావు” అని అడిగాడు. “వేసవి లో మామూలుకన్నా యెక్కువగానే కరెంటు పోతుంది కదా. అదీకాక నిన్నటితో కరెంటుబిల్లు కట్టవలసిన తేదీ ముగిసింది.
ఈ రోజు కరెంటు ఆఫీసతను వచ్చి, ఫ్యూస్ తీసికెళ్ళాడు, బిల్లు కట్టాకే కరెంటు ఇస్తామని చెప్పి” అని మెల్లగా చెప్పాడు సదా. “మరి…నీవు….” అంటూ ప్రశ్నార్థకంగా చూసిన తండ్రికి “ నేను నా స్నేహితుని ఇంట్లో చదువుకుని వచ్చాను నాన్నా రేపటి పరిక్షకి. నీవేం దిగులుపడొద్దు” అంటూ నవ్వాడు సదా. తన మనసులోని మాటని ఇట్టే పసిగట్టి, జవాబిచ్చిన కొడుకుని ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నాడు. అమ్మకి మందులిచ్చావా నాన్నా? అనడిగాడు మెల్లగా. “గంట క్రితం కాస్త చారన్నం పెట్టి, మందులిచ్చాను. ఇందాకే నిద్ర పోయింది.” అంటూ “నీవు రానాన్నా! ఇద్దరం కలిసి భోంచేద్దాం” అంటూ లోపలికి వెళ్ళాడు సదానందం.
శంకరం 5 వ తరగతి దాకా చదువుకున్నాడు. పేదరికం వల్ల చిన్నపుడే తలిదండ్రులను పోగొట్టుకోవడంతో, ఇరుగుపొరుగువారి దయాదాక్షిణ్యాలపైన పెరిగి, పెద్దవాడై అందరికీ చిన్న, చిన్న సహాయాలు చేస్తూ కాలం గడిపేవాడు. గంతకు తగ్గ బొంత అన్నట్లు వంట పని చేసి, పొట్టపోసుకునే ఒక కుటుంబంలోంచి వచ్చిన మరకతం అతని భార్య ఐంది. క్రమంగా శంకరం కూడా వంటలు చేయడం నేర్చుకుని, భార్యాభర్తలిద్దరూఇల్లు జరుగుబాటుకి కావలసినంత సంపాదించసాగారు. ఒద్దికగా ఉంటూ, పొదుపుగా కాపురం చేసుకుంటూ, ఇరుగు పొరుగువారి మన్ననలు పొందారు. పెళ్ళైన 15 యేళ్ళకి ఒక కొడుకు పుట్టాడు. ఇక వారి ఆనందానికి అంతే లేదు. ఎలాగైనా తమ పిల్లవాడిని బాగా చదివించి, తమలాగా కష్టపడకుండా, మంచి ప్రభుత్వ ఉద్యోగిగా చూడాలనుకున్నారు. ఐదేళ్ళకి ప్రభుత్వం నడిపే బడిలో కొడుకుని చేర్చారు.
దానికి తగ్గట్లుగానే సదానందం బాగా చదివేవాడు. చిన్నప్పటినుండే తోటివారికి సహాయం చేసే అలవాటు అబ్బింది. అందరినీ నవ్వుతూ, పలకరించేవాడు. వాళ్ళకి నోట్స్ రాసిపెట్టేవాడు. వాళ్ళకి అర్థం కానివాటిని నేర్పేవాడు. సదా చేతివ్రాత చాలా బాగుండేది కనుక, బడి యాజమాన్యం వారు బడిలో వ్రాసే పనులన్నింటినీ సదాకే ఇచ్చేవారు. ప్రభుత్వ బడి కనుక, అక్కడే మధ్యాహ్నం భోజనం కూడా ఐపోయేది సదాకి. అలా ఇంటర్మీడియట్ కి వచ్చాడు సదానందం.
కాలం యెప్పుడూ ఒకేరకంగా ఉండదుగా. ఒకరోజు ఉదయం నిద్రనుండి లేచిన మరకతం బాత్రూంకి వెళుతూ, చీర కుచ్చిళ్ళు తట్టుకుని, క్రింద పడిపోయింది. దబ్బుమన్న శబ్దం విన్న శంకరం, సదా మేలుకున్నారు. అస్తవ్యస్తంగా పడిపోయిన మరకతాన్ని జాగ్రత్తగా యెత్తుకుని, చాపమీద పడుకోబెట్టారు.
సదా వెంటనే పక్కీంటి మామ్మగారిని పిలుచుకునివచ్చాడు. మామ్మగారు మరకతాన్ని చూసి, కళ్ళు తెరిచినవెంటనే కాస్త యేదన్నా తాగించమని, ఆ తరువాత ప్రక్కవీధిలోని వైద్యుణ్ణి పిలుచుకురమ్మని చెప్పి వెళ్ళిపోయారు. తండ్రీకొడుకులకి యేంచేయాలో పాలుపోలేదు. వారింతదాకా జలుబు, జ్వరమన్న విషయమే యెరుగరు. అందువల్ల వైద్యుని అవసరం కలగలేదు. మరకతం వంట పనిచేసే ఇంటి యజమాని వైద్యుడు కనుక, సదా ఆయనని వెంటబెట్టుకొచ్చాడు.
ఆయన వచ్చి, పరిక్షచేసి, “ఆమెకి పక్షవాతం వచ్చింది. ఎన్నాళ్ళిలా ఉంటుందో తెలియదు. అసలు స్పృహ వస్తుందా అన్నది తెలియదు. వచ్చినా ఎప్పుడు వస్తుందో అన్నది తెలియదు. నేను కొన్ని రోజులకి సరిపడా ద్రావకాలిస్తాసు. త్రాగించండి. రెండ్రోజులయ్యాక యే విషయం నాకు తెలపండి. కాస్త మెరుగుపడితే గంజిలాంటి ద్రవాహారం ఇవ్వండి. “ అంటూ చెప్పేటప్పటికి తండ్రికొడుకులిద్దరూ కూలబడిపోయారు. ఎప్పుడూ గిరగిరా తిరుగుతూ పనులుచేసే మరకతానికి ఈ పరిస్థితి యెందుకు వచ్చిందో తెలియలేదు.
ఇంకొక రెండునెలలలో సదాకి 12 వతరగతి పరిక్షలు. తండ్రి పనులమీద బయటికి వెళితే, తల్లికి శుశ్రూష చేస్తూ, వంటచేసి, బడికి వెళ్ళేవాడు. బడిలోని అందరికీ వాడి పరిస్థితి తెలుసుకనుక, కాస్త వాడు ఆలస్యంగా వచ్చినా, యేమీ అనేవారు కాదు. బడికి వెళ్ళే సమయంలో ప్రక్కింటివారిని కాస్త తల్లిని కనిపెట్టుకోమని చెప్పేవాడు. మధ్యాహ్నానికి శంకరం ఇంటికి వచ్చి, సాయంత్రం సదా వచ్చేదాకా ఉండేవాడు. ఇక మళ్ళీ సదా డ్యూటి మొదలయ్యేది. అలా వారు చేసిన సేవ ఫలితంగానో, భగవంతుని కృపవల్లో సరిగ్గా నెలరోజులకి మరకతంలో కాస్త కదలిక వచ్చింది. కనుసైగలుచేసేది. ఆ తరువాత మెల్లగా ద్రవాహారం తీసుకోవడం ప్రారంభించింది. తండ్రికొడుకుల ఆనందానికి అవధులు లేవు.