పెళ్లంటేనూరేళ్ళపంట (కథానిక )

Advertisement
Update:2023-01-21 16:16 IST

‘నిజం చెప్పక్కా !ఈ పెళ్ళి నీ ఇష్టం తోనే జరుగుతోందా ?”

నాకెందుకో అనుమానంగా ఉంది . సుజాతక్కకి ఈ పెళ్లి ఇష్టం లేదని . ఎంతో సేపు అనుమానాన్ని నా కడుపులో దాచుకోలేకపోయాను , ఆ మాటే అడిగేసాను .

“మధ్య తరగతి కుటుంబాల్లో ఇష్టాయిష్టాల పసక్తి  లేదు. పెళ్లి ప్రతి స్త్రీ కి తప్పనిసరి .. నాకూ జరుగుతోంది” .

బెంగళూర్ లో ఇంజనీరింగ్ చదువుతున్న నేను వీకెండ్

ఊరికె డితే అమ్మ చెప్పింది సుజాతక్కకి పెళ్లని

సుజాతక్క వాళ్ళు మా పక్కింట్లో ఉంటారు. మాకు చిన్నప్పటి నుంచి బాగా క్లోజ్ . సుజాతక్కకి తండ్రి లేడు . ఒక అన్న,ఒక సుజాతక్క తమ్ముడు . చిన్నప్పటి నుండి బాగా గారాబంగా పెరిగింది అక్క. అన్న ఏదో ప్రైవేట్ కంపెనిలో పనిచేసేవాడు జీతం

బొటాబొటీ గా సరిపోయేది . ఒక్కోసారి అదనపు ఖర్చు వచ్చిపడితే కకావికలై పోయి ,అమ్మతో ఇప్పించుకునేవాళ్ళు . చదువుమీద శ్రద్ద లేని తమ్ముణ్ణి చిన్న ఫ్యాక్టరీలో చేరించారు . తండ్రి మిగిల్చి పోయిన ఇంటిని రెండు బాగాలు చేసి,ఒక దాంట్లో తాము ఉంటూ మరోదాన్ని అద్దెకిచ్చి ,

నెట్టుకొస్తున్నారు .

సుజాతక్క చదువు ఇంటర్ తో ఆగిపోయింది . ఆర్థిక సమస్యల వల్లననుకుంటా సుజాతక్క ఎప్పుడూ ముభావంగా ఉండేది. దేవిమీద ఇంటరెస్ట్ చూపేదికాదు.

అప్పుడప్పుడు చిన్న చిన్న తగవులు, అరచుకోవడాలు వినిపించేవి .

‘ఏమిటే సుజాతా మీ అన్న ఎందుకో అరుస్తున్నాడు” అని అమ్మఅడిగితే “ అది మామూలే ఆంటీ ! తాను సంపాదిస్తున్నాడు కదా అందుకే "అని చప్పరించేసేది .

చదువుకొమ్మని,కనీసం టైలరింగ్ నేర్చుకొమ్మని  అమ్మ చాలా సార్లు చెప్పింది . అన్నకు బర్డన్ అని ఒప్పుకోలేదు .

సుజాతక్కది చూడగానే అక్కట్టుకునే అందంకాదు . అమ్మ రెండుమూడు సంబంధాలు చూసినా ,అమ్మాయి నచ్చలేదనో ,కట్నం ఇచ్చుకోలేరనో కుదరలేదు.

ఇప్పుడు అక్క పెళ్లి కుదిరిందని అని తెలిసి అంత సహృదయులు ఎవరబ్బా అనుకున్నాను చాలా సంతోషం వేసింది. అయితే ఆ సంతోషం ఎక్కువ కాలం నిలువ లేదు. ఆ అబ్బాయి గురించి పూర్తి వివరాలు తెలిశాక , నాలోని ఆనందం ఉఫ్ మంటూ ఎగిరిపోయింది . డీలా పడిపోయింది మనసు.

ఆ అబ్బాయికి ఉద్యోగం సరిగాలేదట . టెంపరరీగా పనిచేస్తున్నాడట . ఇదివరకే పెళ్లయిందట . అయితే  ఆ అమ్మాయి ఇతని జతలో లేదట. విడాకులు ఇచ్చాడో లేదో కూడా వీరికి తెలియదట. ఆ అబ్బాయి కారెక్టర్ కూడా మంచిది కాదట. తాగుబోతు , తిరుగుబోతు నట . ఇన్ని అవలక్షణాలు ఉన్న అతన్ని ఎలా ఒప్పుకుంది అన్న ఆలోచనలో మాటలు రాక, ఏమి మాట్లాడాలో  తెలియక మౌనంగా ఉన్న నన్ను “ మధూ ! ఎప్పుడొచ్చావు  అన్న సుజాతక్క  మాటలతో ఈ లోకం లోకి వచ్చాను.

‘రాత్రి వచ్చాను’! అక్కా ఓ విషయం అడుగుతా , సూటిగా సమాధానం చెబుతావా! అన్నాను .

‘నువ్వేం  అడుగుతావో  నాకు తెలుసు! . కాబోయే భర్త గురించి , అతని వ్యసనాల గురించి , తెలిసి కూడా పెళ్లి చేసుకునేందుకు ,ఎలా ఇష్టపడ్డానని కదా!. నిజమే మధూ ! ఏ ఆడపిల్ల  ఇలాంటి భర్తను కోరుకోదు .. నేనేం  అతన్ని వలచి చేసుకోవడం లేదు. ఇందాక  చెప్పాను కదా , గాలి అలా వీస్తూంది నేను అలా వెడుతున్నాను .

“ఇది నీ జీవితం కదక్కా ! అంత నిర్లిప్తత అయితే ఎలా” ! . నా గొంతు లో ఏదో తెలియని బాధ ధ్వనించింది.

“ సరే! మధూ! నాకు బహుబలీ  ప్రభాస్ లాంటి అబ్బాయిని చేసుకోవాలని ఉంది. అయితే అది కుదురుతుందా. అలాంటివి కలనైనా ఊహించ గలనా .

నేను జవాబు చెప్పలేక దిగాలుగా  ఆమెనే చూస్తున్నాను.

“ కానీ మధూ! నేను ఈ పెళ్లి  ఇష్టపడే చేసుకుంటున్నాను. నాకు కాబోయే భర్త ఎలాంటి వాడయినా ఫర్వాలేదు . భర్త అన్న సంబంధం చాలు. నేను ఎంత త్వరగా ఈ ఇంటి నుండి  వెళ్ళి పోతే అంత సంతోషం. భర్త తో జీవితం ఎంత నరకమయినా  భరిస్తానేమో గాని ,పెళ్లి ఇంకా ఎందుకు కాలేదు,అసలు అవుతుందా !. మాకు గుదిబండ గా నిలిచి పోయావని ,ఈ మాటలను భరించలేను. భర్త నిరాదరణకి గురి అయిన  భార్యకి ఈ సంఘం , జాలి, సాను భూతి చూపిస్తుంది. కారణాంతరాలవల్ల , పెళ్ళికాని అమ్మాయని మాత్రం సూటిపోటి మాటలతో హింసింస్తుంది . ఎద్దుగాయం కాకి కి రుచి మాదిరి.అంటూ ! నీవెలా  ఉన్నావు !. కాంపస్ సెలెక్షన్ అయిందా.. పెళ్ళయిన తరువాత , మేము హనీమూన్ కి బెంగళూర్ వస్తాం. అంటూ  గల గల నవ్వి వాతావరణ తేలిక పరిచేందుకు చూసింది సుజాతక్క.

నవ్వలేక నవ్వుతోందని అర్థమయింది నాకు. కానీ ఏమి చేయలేని అసమర్థత .

“ ఏమిటి మధూ ఆలోచిస్తున్నావు!.. పెళ్లయ్యాక ,అతనికి నాకు పడకపోతే మరలా ఇక్కడికే రావాలి కదా అనా !అప్పుడు కంపల్‌సరీగా  ఏదో పని చేసుకుని బతుకుతాను . ఇక్కడికి మాత్రం ఎలాంటి పరిస్థితిలోనూ రాను. జీవితం గడపాలిగా . అనుభవమే జీవనపాఠం కదా..” అంది

“ మధూ నా అదృష్టం బాగుండి , మనం విన్నవన్నీ పుకార్లని , అతను మంచి వాడయితే , నాకు పునర్జన్మ అనుకుంటాను. నిజమనుకో .. ముందే తెలుసు కాబట్టి , ఓ నిట్టూర్పు వదలి జీవితం ప్రారంభిస్తాను. అంది సుజాతక్క అదే నవ్వుతో .

"మరోసారి ఆలోచించక్కా !"అన్న మాటలు పెదవి దాటి రాలేదు నాకు.

“ అన్నట్టు మధూ పెళ్ళికి తప్పక వస్తావుగా “ అంది .

“ వీలు  పడదక్కా ! ఇంటర్నల్స్ ఉంటాయి. "అని.నిన్ను పెళ్లి పీటల మీద బలిపశువుగా చూడలేను . అని మనసులో అనుకున్నాను .

సుజాతక్క పెళ్లి జరిగిపోయింది .

పెళ్లికొడుకు బాగున్నాడని , పెళ్లి బాగా జరిగిందని  అమ్మ ఫోన్ చేసి. చెప్పింది.సంతోషమయినా , మనసులో ఏదో భయం.సమాజం లో మరో మధ్యతరగతి మహిళ ప్రవేశించింది . ఇంతేగా!  ఈ జీవితం అంటుందో . ఇంతే  ఈ జీవితం అని ధైర్యంగా ముందుకు సాగుతుందో కాలం నిర్ణయిస్తుంది .

సుజాత విజేత కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంది మధు.

- తిరుమల ఆముక్త మాల్యద

Tags:    
Advertisement

Similar News