చిరుగాలి తోడై తాకకుంటే
గడ్డిపువ్వుకు
గుర్తింపెక్కడిది?
పిడికెల్లో ఒదగక
తప్పించుకోకపోతే
కిరణానికి
గమనశీల మెక్కడిది?
భూమి గుండెను
చీల్చుకుని
సగర్వంగా తలెత్తకపోతే
విత్తనానికి అస్తిత్వమెక్కడిది?
దోసెడు నీళ్ళిచ్చి
దాహం తీర్చకుంటే
జలపాతం
జన్మకు ధన్యత్వమెక్కడిది?
ఆకాశాల్ని అనంత ధైర్యంతో
ఈదుకుంటూ వచ్చి
చెట్టుగూడుపై రెక్కలతో వాలకుంటే
పక్షికి అంత పేరెక్కడిది?
కాలాన్ని నిద్రపోనివ్వని మనిషి
నిరంతర పథికుడు కాకుంటే
ప్రగతికి పల్లవి ఎక్కడిది?
కూలీల భుజాల బరువులు
శ్రామిక శబ్దాలను
పలికించకుంటే
నాదానికి జనమోద
మెక్కడది?
జడదృశ్యాదృశ్య ఘటనలు
చరిత్రగా పురుడోసుకోకుంటే
భవిష్యత్తుకు
మార్గదర్శనమెక్కడిది?
అలసటెరుగని శ్రమే
శ్రామిక శబ్దాలను
నిర్మించకుంటే
చిందిన చెమటకు
చిరునామా ఎక్కడిది?
- తిరునగరి శ్రీనివాస్