నిద్రలో ఉన్నప్పుడు
నీళ్ళ సప్పుడు
మగతలో నుంచి కదిలి
మెలకువలో
కన్నీళ్ళ సప్పుడు!
కలలో ఇలలో ఒకటే సప్పుడు
గుండెలో కదిలే దుఃఖం సప్పుడు
ద్వీప మంతా జీవితం చుట్టూ
సముద్రమంత మరణం సప్పుడు
మరణం నేర్పుతున్న బ్రతుకులో
బాధల సప్పుడు
జననమంతా నడుస్తున్న అడుగుల సప్పుడు
గుబులు లేచిన గుబురులో
గాలి సప్పుడు
గాలి వడగళ్ళ ఊపులో
వర్షం సప్పుడు
వర్షం ఇంకిన బురద నీళ్ళమీద కిరణం సప్పుడు
కిరణం పొడిచే పొద్దులో
పక్షులు ఎగిరే రెక్కల సప్పుడు!
రెక్కలు ముడిచిన పక్షి గూళ్లలో
గింజని ముక్కున కరచే
కలల సప్పుడు
కలనుంచి ఇల దాకా
అల నుంచి కలదాకా
బతుకు బండి నడిచే చక్రం సప్పుడు
కొలమానం లేదు
గడియారము లేదు
మనసే కాలమై నడిచే
సమయం సప్పుడు!
-దుర్గాప్రసాద్ అవధానం
(నల్గొండ)
Advertisement