గోపీచంద్

Advertisement
Update:2023-09-08 15:05 IST

1910, సెప్టెంబర్ 8 న కృష్ణా జిల్లా అంగలూరు గ్రామములో త్రిపురనేని రామస్వామి చౌదరి, పున్నాంబలకు జన్మించారు.

ఈయన తండ్రి కవిరాజు త్రిపురనేని రామస్వామి గారు హేతువాది సంఘసంస్కర్త. గోపీచంద్ చిన్నతనములోనే తల్లిని పోగొట్టుకున్నాడు. ఇంటి పనులతోపాటు, తండ్రి నాస్తికోద్యమమునకు సహాయము చేయటం లాంటి పనులతో అతని బాల్యం చాలా గడచి పోయింది.

ఈయనకు కొమ్మా నారయ్య గారి పుత్రిక శకుంతలా దేవితో 1932 లో వివాహం జరిగింది, 1933లో బి.ఎ పట్టా పొంది ఆ తర్వాత మద్రాసులో లా డిగ్రీ చదివారు. కొంతకాలం పాటు న్యాయవాదిగా ప్రాక్టీసు పెట్టినా ఆ వృత్తిలో ఇమడలేక పోయాడు. వీరికి ఆరుగురు సంతానం. ముగ్గురు అబ్బాయిలు ముగ్గురు అమాయిలు.ఈయన ఆఖరి కుమారుడు త్రిపురనేని సాయిచంద్ సినీ నటుడు, దర్శకుడు.

నవలలు :

అసమర్థుని జీవయాత్ర

గడియపడని తలుపులు

చీకటి గదులు

పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా

ప్రేమోపహతులు

పరివర్తన

యమపాశం

శిధిలాలయం

ఇతరాలు

తత్వవేత్తలు

పోస్టు చేయని ఉత్తరాలు

మాకూ ఉన్నాయి సొగతాలు

గోపీచంద్ రచనలలో విలువల మధ్య పోరాటం ముఖ్యముగా చెప్పుకోతగినది. అతని మీద చాలా కాలము వారి నాన్నగారి ప్రభావం ఉండేది. ఆయన మొదట వ్రాసిన చాలా నవలలో మార్క్సిస్టు భావాలు మనకు పూర్తిగా కనిపిస్తాయి.

మొదట్లో కథా సాహిత్యంపై దృష్టి సారించిన ఆయన కొద్దికాలానికి నవలా రంగంవైపు కూడా మళ్ళారు. ఆయన రచనల్లో అసమర్ధుని జీవితయాత్ర, పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా మొదలైనవి పేరు గాంచాయి.

ఆయన వ్రాసిన అసమర్థుని జీవయాత్ర తెలుగులో మొదటి మనో వైజ్ఞానిక నవల. 1963లో పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామాకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది

గోపీచంద్ తన జీవితంలో చాలా సంఘర్షణను అనుభవించాడు. అనేక వాదాలతో వివాదపడుతూ, తత్త్వాలతోదాగుడుమూతలాడుతూ, సంతృప్తిలోనూ అసంతృప్తిలోనూ ఆనందాన్నే అనుభవిస్తూ జీవయాత్ర కొనసాగించాడు. తన తండ్రినుంచి గోపీచంద్ పొందిన గొప్ప ఆయుధం, ఆస్తి, శక్తి ఎందుకు? అన్న ప్రశ్న. అది అతన్ని నిరంతరం పరిణామానికి గురిచేసిన శక్తి. అతనిలోని అరుదైన, అపురూపమైన, నిత్యనూతనమైన అన్వేషణాశీలతకి ఆధారం. ఎందుకు? అన్న ప్రశ్నే అతన్ని ఒక జిజ్ఞాసువుగా, తత్వవేత్తగా నిలబెట్టింది. ఈ క్రమంలో అతనిలో చెలరేగిన సంఘర్షణ అతని నవలలన్నింటిలోనూ ప్రతిఫలించింది.

ఒక పుస్తకాన్ని ఆయన తండ్రిగారికి అంకితం ఇస్తూ- 'ఎందుకు' అని అడగటం నేర్పిన నాన్నకి అని వ్రాసాడు. అలా నేర్చుకోబట్టే స్వతంత్ర భావాలు గల ఒక గొప్ప రచయిత స్థాయికి ఎదిగాడు.

మార్కిజాన్నిఅధ్యనం చేసి 'బీదవాళ్ళాంతా ఒక్కటే' , గోడమీద మూడోవాడు , పిరికివాడు వంటి కథలు రాసారు. మార్కిజం అంటే ఏమిటి? , పట్టాభి గారి సోషలిజం, సోషలిజం ఉద్యమ చరిత్ర వంటి గ్రంధాలు రాసారు.

తరువాత మార్కిజంలో లోటుపాటులు గ్రహించి ఎం.ఎన్. రాయ్ గారి నవ్య మానవ వాదం వైపు పయనించారు. రాడికల్ డెమక్రటిక్ పార్టీ కార్యదర్శిగా నవ్య మానవ వాదాన్ని విస్త్రుతంగా ప్రచారం చేసారు. పార్టీ రహిత నవ్య మానవ సమాజం నిర్మాణం వైపుగా భావ విప్లవం కొరకు సాహిత్య కృషి చేసారు.

గోపీచంద్ నెమ్మదిగా నాస్తిక సిద్ధాంతం నుండి బయటపడి, చివరి రోజులలో తత్వవేత్తలు అనే తాత్విక గ్రంథాన్ని వ్రాయటం జరిగింది. పోస్ట్ చెయ్యని ఉత్తరాలు, అసమర్ధుని జీవయాత్ర, మెరుపుల మరకలు - ఈ గ్రంథాలలో కూడా చాలావరకు తాత్విక చింతన కనపడుతుంది.

గోపిచంద్ ఒక చోట ఇలా అంటాడు, "మానవులు జీవనదుల లాగా ఉండాలి కానీ, చైతన్యంలేని చెట్లు, పర్వతాల లాగా ఉండకూడదు". మానవ జీవితం ఒక చైతన్య స్రవంతి. ఎన్నో మలుపులు తిరుగుంది. అలాగే మనం కూడా నిరంతర అన్వేషణలో ఉండాలి. అప్పుడే మనకు సత్యమంటే ఏమిటో తెలుస్తుంది. నిన్న మనం నమ్మింది ఈ రోజు సత్యం కాదని తెలిసిన వెంటనే దాన్నివదలి మళ్ళీ అన్వేషణ సాగించాలి.

ఇదే విషయాన్ని జిడ్డు కృష్ణమూర్తి, చలం కూడా చెప్పారు. జీవితం అంటే నిరంతర అన్వేషణ.

సినీరంగంలో

1939లో చలనచిత్ర రంగంలోకి ప్రవేశించిన గోపీచంద్ దర్శకనిర్మాతగా కొన్ని చిత్రాలను నిర్మించాడు. అయితే వాటివల్ల ఆర్థికంగా చాలా నష్టపోయారు. కొన్ని సినిమాలకు రచయితగా పనిచేశాడు. చదువుకున్న అమ్మాయిలు, ధర్మదేవత, రైతుబిడ్డ మొదలైన చిత్రాలకు మాటలు రాశాడు. ప్రియురాలు, పేరంటాలు, లక్ష్మమ్మ మొదలైన చిత్రాలకు దర్శకత్వం వహించాడు.

• చదువుకున్న అమ్మాయిలు (1963) (మాటల రచయిత)

• ధర్మదేవత (1952) (మాటల రచయిత)

• ప్రియురాలు (1952) (కథ, మాటల రచయిత, దర్శకుడు)

• పేరంటాలు (1951) (దర్శకుడు)

• లక్ష్మమ్మ (1950) (దర్శకుడు)

• గృహప్రవేశం (1946) (కథా రచయిత)

• రైతుబిడ్డ (1939) (మాటల రచయిత)

జీవనక్రమం :

8-సెప్టెంబర్-1910 నాడు గోపీచంద్ జన్మించాడు. సుప్రసిద్ధ రచయిత, హేతువాది, సంస్కరణవాది అయిన త్రిపురనేని రామస్వామి ఆయన తండ్రి, తల్లి పున్నమాంబ.

హేతువాద నాస్తికత్వపు భావజాలాల వాతావరణంలో పెరిగిన గోపీచంద్ పై వాటి ప్రభావం సహజంగానే పడింది.

అయితే తరువాతి కాలంలో ఆయన ఆస్తికుడిగా మారాడు.

1932 లో వివాహం; 1933లో బి.ఎ పట్టా, ఆ తర్వాత లా డిగ్రీ. కొంతకాలం పాటు న్యాయవాదిగా ప్రాక్టీసు పెట్టినా ఆ వృత్తిలో ఇమడలేక పోయాడు. ఈ దశలో ఆయన కమ్యూనిజం (మార్క్సిజం) పట్ల ఆకర్షితుడయ్యాడు. కానీ అందులోని అరాచకత్వం ఆయనకు నచ్చలేదు.

ఆ తర్వాత ఎం.ఎన్.రాయ్ మానవతావాదం ఆయన పై గొప్ప ప్రభావాన్ని చూపింది.

ఈ కాలంలో ఆయన ఆంధ్రా రాడికల్ డెమొక్రటిక్ పార్టీ కార్యదర్శిగా పనిచేసాడు.

1928లోనే శంబుక వధ కథ ద్వారా సాహిత్యరంగంలోకి ప్రవేశించిన గోపీచంద్ 1938లో పట్టాభి గారి సోషలిజం అన్న పుస్తకాన్ని వెలువరించాడు.

తొలుత కథా సాహిత్యంలో స్థిరపడ్డ గోపీచంద్ ఆ తర్వాత నవలా సాహిత్యరంగంలోకి అడుగుపెట్టాడు. ఆయన తొలి నవల పరివర్తనం (1943). నూతన దృక్పదంతో షూమారు 300 కథలు రాసారు.

1939లో చలనచిత్ర రంగంలోకి ప్రవేశించిన గోపీచంద్ దర్శకనిర్మాతగా కొన్ని చిత్రాలను నిర్మించాడు. అయితే వాటివల్ల ఆర్థికంగా చాలా నష్టపోయారు.

1953లో ఆంధ్రరాష్ట్ర సమాచార శాఖ డైరెక్టర్ గా, 1956లో ఆంధ్ర ప్రదేశ్ సమాచార శాఖ సహాయ డైరెక్టర్ గా పనిచేసాడు.

1957-62 వరకు ఆకాశవాణిలో పనిచేసాడు. వారి 'ఉభయకుశలోపరి ' కార్యక్రమం జనరంజకమైనది. కాళిదాసు రచనలన్నిటిని రేడియో రూపకాలుగా రాసారు.

వీరు రచించిన అనేక నాటకాలు, నాటికలు శ్రోతలను విశేషంగా ఆకర్షిచాయి. ఈ దశలో అరవిందుని భావాల పట్ల విశ్వాసం ఏర్పడడంతో ఆధ్యాత్మికవాదం వైపుకి పయనించాడు.

1962 నవంబర్ 2 నాడు 52 సంవత్సరాల వయస్సులోబహుముఖ ప్రతిభాశాలి అయిన గోపీచంద్ గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు.

1963లో వీరు రాసిన [పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా ' కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది.

భారత ప్రభుత్వము 2011 సెప్టెంబరు 8న గోపీచంద్ శతజయంతి సందర్భమున తపాలా బిళ్ళ విడుదల చేసింది. అంతకుముందు 1987 వ సంత్సరంలో జరిగిన కవిరాజు త్రిపురనేని శతజయంతి వేడుకలలో త్రిపురనేని రామస్వామి చౌదరి స్మారక తపాళా బిళ్ళను జారీ చేయడం జరిగింది.

తెలుగు వారిలో తండ్రి, కొడుకులు ఇద్దరికి తపాల బిళ్ళలు విడుదల చేసిన అరుదైన గౌరవం వీరికి దక్కింది.

Tags:    
Advertisement

Similar News