అశాంతి నుండి ప్రశాంతతకి (కథ)

Advertisement
Update:2022-11-10 18:33 IST

"హాయ్! నేను వచ్చేసాను" అంటూ ఇంటి లోపలికి ఎంతో ఉత్సాహంగా వచ్చిన ప్రశాంత్ కాళ్ళు మంత్రం వేసినట్లు ఠక్కున ఆగాయి, తన ఇంట్లో ఒక అపరిచితురాలిని చూసి. వెంటనే గంభీరంగా మారి, "శాంతీ, ఓ సారి ఇలా రా" అంటూ భార్యని కేకేస్తూ, సోఫాలో కూర్ఛుని, షూస్ విప్పుకోసాగాడు.

"ఇదుగో వస్తున్నా"నంటూ, వంటగదిలోంచి శాంతి బయటికి వచ్చింది." ఎవరీమె? అన్నట్లు కనుబొమలెగరేసిన భర్తకి, నవ్వుతూ, శాంతి "అరే మీకు తెలియదు కదూ, మా బాబాయిగారి అమ్మాయి సుప్రసన్న. ఢిల్లీలోహాస్టల్లో ఉంటూ, పీ.జీ చేస్తోది.

పరీక్షలవల్ల, మన పెళ్ళికి రాలేకపోయింది. ఇప్పుడు, చివరి సెమెస్టర్ ప్రాజెక్ట్ చేయడానికి మన ఐ.ఐ.టి.లో ఇంటర్వ్యూకి వచ్చింది." అంటూ, "ప్రసన్నా, వీరే మీ బావగారు" అంటూ చెల్లెలికి భర్తని పరిచయం చేసింది. సుప్రసన్న నవ్వుతూ, " మిమ్మల్ని చూడలేదు కాని, మీ గంతులు చూసినపుడే అనుకున్నామీరే నా బావగారని. ఎందుకంటే, మీరు చాలా అల్లరివారని, ఎప్పుడూ హుషారుగా ఉంటారని మనవాళ్ళందరూ చెప్పగా విన్నాను లెండి. బావగారు! నైస్ టు మీట్ యూ" అంటూ చాలా చనువుగా, ఎంతో కాలం పరిచయం ఉన్నట్లు పలికింది. మరదలి మెచ్చుకోలుకి లోలోపల ఉబ్బి తబ్బిబ్బైనా, బయటికి మాత్రం "హె హె మరే మరె" అని సిగ్గుపడ్డాడుప్రశాంత్.

రాత్రి భోజనాలయ్యాక, ప్రసన్న ఊరెళ్ళేదాకా,తనని విడిగా పడుకోవాలన్నభార్యతో " అదేమిటి శాంతీ, పెళ్ళై ఏడాదికూడా కాలేదు. అంతలోనే ఈ ఎడబాటు ఏమిటి? ఆ అమ్మాయిని విడిగా పడుకోమంటే పోలా? అనవసరంగా మనింట్లో మకాం పెట్టనిచ్చావు" అంటూ నసిగాడు భార్య ఎడబాటుని సహించలేక.

"ఒక్క వారం రోజులే కదండీ.

ఇంటర్వ్యూవచ్చే సోమవారమే. అదే రోజు సాయంత్రం తను ఫ్లైట్ లో వెళ్ళిపోతుంది. విడిగా పడుకోమంటే బాగుండదు. దయచేసి ఈ సారికి క్షమించండి." అని నచ్చజెప్పింది. ప్రశాంత్ కూడా ఒక వారం రోజులేకదా అని మెత్తబడ్డాడు. కానీ, తను చిక్కుల్లో పడతాడని కలలో కూడా అనుకోలేదు ప్రశాంత్.

ఇక సుప్రసన్న గురించి –ఆస్తిపరులైన జగన్నాథం, జగదంబ దంపతుల గారాలపట్టి. పెళ్ళైన చాలాకాలందాకా సంతానభాగ్యం లేకపోవడంతో, జగన్నాథం తలిదండ్రులు తమ కొడుకుకి పునర్వివాహం చేయదలచారు. కానీ భార్యమీద ఉన్న ప్రేమ వల్ల ఒప్పుకోని జగన్నాథం పిల్లలు కావాలంటే యేదో ఒక అనాథాశ్రమంనుండి ఒక శిశువుని దత్తత తీసుకోడానికి కూడా తయారే కానీ రెండవ వివాహం మాట ఎత్తకూడదని నిర్మొహమాటంగా చెప్పేశాడు. చివరికి దంపతులిద్దరూ తెలిసినవారి ద్వారా ఒక అనాథాశ్రమానికి వెళ్ళడానికి ఒక మంచి రోజుకూడా చూసుకున్నారు.

ఆశ్రమానికి బయలుదేరుతున్న సమయంలో జగదంబ మైకం వచ్చి క్రింద పడిపోయింది. భయాందోళనలతో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్ళాడు జగన్నాథం. వారు చిత్తశుద్ధితో చేయాలనుకున్నపనికి భగవంతుడు మెచ్చి వరమిచ్చినట్లు, పరీక్ష చేసిన డాక్టరు జగదంబ గర్భవతని నిర్థారించింది. ఇక వారి ఆనందానికి యెల్లలే లేకపోయింది. పుట్టిన పాపాయికి సుప్రసన్న అని పేరు పెట్టారు. పాప ఆడిందే ఆటగా, పాడిందే పాటగా బాగా గారాబంగా పెరగసాగింది. తెలివైనది కనుక తలిదండ్రులు వద్దన్నా, పట్టుదలగా పి.జీ చేస్తోంది.

మొదట మెల్లగా ప్రశాంత్ ని మాటల్లో దింపిన ప్రసన్న, అతని సత్ప్రవర్తన, ఒడ్డు,పొడుగు, హాస్యరసం పండించే విధానానికి ఆకర్షితురాలైంది. ఎలాగైనా ప్రశాంత్ ని తన వైపుకి తిప్పుకోవాలనుకుంది. అక్కకి ద్రోహం చేయకూడదన్న తలపువచ్చినా, కాస్త ప్రయత్నిస్తే తప్పేమిటి అన్న మనసువైపుకే మొగ్గింది ప్రసన్న.

ఒక వైపు తను చేస్తున్న పని మంచిది కాదు, అది తలవంపులు తెచ్చే పని అని ఏదో ఓ మూల అనిపించినా, పట్టించుకోలేదు. తన ప్రయత్నానికి శ్రీకారం చుట్టడానికి పథకం తయారు చేసింది. మెల్లగావంటింట్లోఉన్న అక్క దగ్గరికి వెళ్ళింది. "అక్కా! నేను రెఫెర్ చేయడానికి వెళ్ళబోయే లైబ్రరీ బావగారు ఆఫీసుకి వెళ్ళే దారిలోనే ఉంది. కాస్త నన్ను అక్కడ దింపమని చెప్పవూ?" అని గారాలు పోయింది. శాంతి "అలాగేలేవే, మీ బావగారికిచెప్తాను" అంటూ, వెంటనే భర్తకి ఆ మాటని చెప్పింది. నచ్చకపోయినా, ప్రశాంత్ ప్రసన్నని లైబ్రరీలో దింపాడుతన బైక్ మీద, కూర్చోబెట్టుకుని. దారిలో స్పీడ్ బ్రేకర్స్ దగ్గిర కాస్త నిదానంగా తోలుతూ, ఏమరుపాటున కూడా ప్రసన్న తనకి తగలకుండా జాగ్రత్తపడ్డాడు. ఇలాగే ఆరు రోజులు గడిచాయి. ఇంతలో ఇంటర్వ్యూ రోజు రానే వచ్చింది.

అదే ఆఖరి రోజు కనుక, ఎలాగైనా బావతో కాస్త చనువుగా ఉండాలని నిశ్చయించింది ప్రసన్న. ఇంటర్వ్యూలో తప్పక విజయం కలుగుతుందనే నమ్మకంతో పాటు, బావని కూడా తన సొంతం చేసుకోగలనన్న గట్టి నమ్మకం ప్రసన్నకి కలిగింది- కారణం తన అందంపైన తనకు గల అపారమైన నమ్మకమే.

అక్క దగ్గరికి వెళ్ళి, మెల్లగా అక్క కొంగును తన వేలికి చుట్టుకోసాగింది.చెల్లికి ఏదో కావాలని అర్థం చేసుకున్న శాంతి, "ఏవిటే ఇంటర్వ్యూ టెన్షన్ మొదలైందా?" అని అడిగింది.

"అదేం కాదక్కా, నాకు ఈ ఊరు కొత్త కదా. నా ఇంటర్వ్యూ ఇక్కడినుండి 20 కి.మీ. దూరంలో ఉన్న ఐ.ఐ.టి.లో. ఎలాగూ ఆదివారం కనుక, బావగారికి సెలవు కదా. ఇంటర్వ్యూకి నాతో రమ్మనవూ? మళ్ళీ సాయంత్రం ఫ్లైట్ అందుకోవాలి కదా" అని గోముగా అడిగింది.

చెల్లి ఆంతర్యం తెలియని అమాయకురాలైన శాంతి "అంతగా అడగాలా చెల్లీ, నేను ఆయనకి చెప్తాగా" అంటూ, భర్త గదిలోకి వెళ్ళి, మెల్లగా విషయం చెప్పింది శాంతి. ఉన్న ఒక్క ఆదివారం కూడా ఇలా ఖర్చైపోతోందికదా అని మనసులో అనుకున్నడు ప్రశాంత్.

అసలే మార్చ్ నెలాఖరు కాబట్టి, ఆఫీసులో పని ఒత్తిడితో రోజూ ఇంటికి రావడం రాత్రి పది దాటుతోంది. భార్య కూడా ప్రక్కన లేకపోయె. ఈ ప్రసన్న వల్ల భార్యతో మనసు విప్పి మాట్లడడానికి కూడా కుదరడంలేదుఇందువల్ల ప్రశాంత్ కి చాలా అశాంతి గా ఉంది. అసలే తిక్కతిక్కగా ఉన్న ప్రశాంత్ కి శాంతి మాటలకి చిర్రెత్తుకొ చ్చింది. విసుగుతో కూడిన కోపంతో "శాంతీ, ఇంటర్వ్యూ ఆదివారం కనుక,అదీ నీవు చెబుతున్నావు కనుక ఒప్పుకుంటున్నాను. ఇదే నీవు నీ చెల్లి కొరకు చేసే చివరి అభ్యర్థన అన్నది మరచి పోకు. అసలే కావలసినంత విశ్రాంతి లేక, ఆఫీసు పని ఒత్తిడిలో నేను చాలా అప్సెట్ ఐ ఉన్నాను." అని నిక్కచ్చిగా చెప్పాడు.

బావకి మనసులోని మాటను చెప్పాలని ఉవ్విళ్ళూరుతున్న ప్రసన్న ఎదురుచూస్తున్నఆదివారం రానే వచ్చింది. మానస విహంగాన్ని స్వేచ్ఛగా, హాయిగా విహరింపచేసిందిపొద్దున 'పంఛి బనూ..ఉడ్తి ఫిరూ..మస్త్ గగన్ మే "..అని కూని రాగాలు తీస్తూ, రోజు కన్నా పెందరాళే లేచింది. చకాచకా అన్ని పనులు ముగించింది తన మేని అందం ఇనుమడించే విధంగా గులాబి రంగు జార్జెట్ చీరను పొందికగా కట్టింది. దానికి తగ్గట్టు గులాబి రంగు దండ, చెవి రింగులూ, గాజులు వేసుకుంది.

ఎన్నడూ లేంది అతి శ్రద్ధగా అలంకరించుకుంది. చెదరని ముంగురులని, చీర కొంగుని మాటిమాటికీ సవరించుకుంది. అక్క అందించిన ఉప్మాని, తనకి నచ్చకపోయినా'బావ కోసం' అనుకుంటూ, చాలా బాగుందని, మరీ మరీ అడిగి పెట్టించుకుని కడుపారా తిన్నది ప్రసన్న.

తింటున్నంతసేపూ ఎదురుగా కూర్చున్న బావపైనే తన చూపులని కేంద్రీకరించింది ప్రసన్న. మరదలి చూపులలో మార్పుని గమనించిన ప్రశాంత్ కి తన పైన బొద్దింకలు ప్రాకినట్లనిపించికుంచించుకుపోయాడు.ఈ పిల్ల కళ్ళల్లో విచిత్ర మైన భావం కనబడుతోంది ఎందుకుచెప్మా అనుకుంటూ, వంచిన తలని యెత్తకుండా గబగబా ఉప్మా తినేసి, తన గదిలోకి వెళ్ళిపోయాడు.

ఈ పిల్ల ప్రవర్తనలోని మార్పుకి తన ప్రవర్తనలో ఏదైనా లోపముందా అని ఆలోచించసాగాడు ప్రశాంత్. నిదానంగా ఆలోచించగా, చించగా విషయం కాస్త అవగతమైంది. ఇది వరకుబండిలో స్పీడ్ బ్రేకర్స్ దగ్గిర మెల్లగా బండిని పోనిచ్చినపుడు కూడా, అనవసరంగా ప్రసన్న తన భుజాల్ని గట్టిగా పట్టుకోవడం, కావాలని తన కాలర్ సర్దడం, తన ముఖందగ్గరికి వచ్చి, తనతో ఏదో చెప్పాలని ప్రయత్నించడం వంటివి జ్ఞప్తిలోకి వచ్చి, లీలగా ఏదో అర్థమైంది. సరే, ఇంటర్వ్యూ ఐయ్యాక, ట్యూషన్ చెప్పాల్సిందే అనుకుంటూ, 'శాంతీ, టైం ఐంది. బయలుదేరాలి, మీ చెల్లిని రమ్మను.' అంటూ ఆలో చిస్తూ, ఉత్సాహంగా ఈలవేస్తూ, బండి తాళాన్ని కుడిచేతి kచూపుడువేలితో తిప్పుతూ, బండి దగ్గరికి నడిచాడు. బావ హుషారుగా వేస్తున్న ఈలని వేరే విధంగా అర్థం చేసుకున్న ప్రసన్నకి ఉన్న హుషారు రెట్టింపయ్యింది.

'భలే భలే ' అనుకుంటూ, అక్క దగ్గర బెస్ట్ విషెస్ అందుకుని, బావ వెనక కూర్ఛుంది బుద్ధిగా. బండి నడుపుతూ, తన గతం నెమరేసుకున్నాడు ప్రశాంత్. తనకి, తోడబుట్టిన అక్కకి ఎడం 16 యేళ్ళు కాబట్టి, ఎప్పుడూ అక్కతో చనువుగా మాట్లాడలేకపోయేవాడు ప్రశాంత్. అక్క చెప్పిన మాటలు వింటూ, ఆమె జారీ చేసే ఆర్డర్స్ కి ఎప్పుడూ తల వంచాల్సివచ్చేది. లేకుంటే అమ్మా, నాన్న చివరికి అక్కదగ్గర కూడా తిట్లు తినాల్సివచ్చేది, ఒక్కొక్కపుడు కొట్టడాలు కూడా .

తన చిన్ననాటి స్నేహితులు తరుణ్ కి వర్ష అని, వరుణ్ కి హరిణి అని చెల్లెళ్ళు ఉండేవారు. తను వారి అనురాగానికి ముగ్ధుడయ్యేవాడు. బడిలో ఎవరైనా పుట్టినరోజులకి, పండగలకి వెళ్ళినపుడు అక్కడ వారిచ్చే తిండి పదార్థాలు, చిన్న చిన్న బహుమతులు వాళ్ళు వాటిని తమ చెల్లెళ్ళకి ఇవ్వడానికని దాచుకొనే వారు. వారి ఆప్యాయతని చూసి భలేసంబరపడిపోయేవాడు. తనకి కూడా అటువంటి ఒక చిన్న చెల్లి ఉంటే ఎంత బాగుండేది అనుకునేవాడు.

దానికి ఎలాగూ నోచుకోలేదు కనుక వీలైనపుడల్లా వాళ్ళతో ఆడుకోడానికి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళేవాడు. ఇక సెలవు రోజుల్లో ఐతే అక్కడే ఠికాణా. ఒకరోజు వర్ష పుట్టినరోజని తరుణ్, ప్రశాంత్ ని తమ ఇంటికి ఆహ్వానించాడు. చాలాసంతోషంతో రిబ్బన్లు, బొమ్మలు కొనుక్కుని వాళ్ళింటికి వెళ్ళాడు ప్రశాంత్. క్రొత్త బట్టలతో, బుట్టబొమ్మలా తయారై,ముద్దుగుమ్మలాగున్న వర్షని కళ్ళార్పకుండా చూసుకున్నాడు.

ఉంగరాలజుట్టుతో, అల్లరినిండిన చిలిపి కళ్ళతో, ఆ రోజు తనే రాజ కుమారి నన్నట్లు కూర్చుని ఉన్నవర్షకి తెచ్చిన బహుమతులను ఇవ్వబోయాడు ప్రశాంత్. మొదటి బహుమానం అన్న తరుణ్ దే కావాలన్న తన కోరికను ఎంతో సున్నితంగా, తనకు నొప్పి కలిగించకుండా వర్ష చెప్పిన విధం తను ఎప్పటికీ మరవలేడు.

'ప్రశాంతన్నా, నీ గిఫ్ట్ తరుణన్న గిఫ్ట్ తీసుకున్నాక పుచ్చుకుంటానే.. ఏమీ అనుకోకు' అంటూ ముద్దుగా నవ్వింది. నవ్వినపుడు కాటుక కళ్ళు చిన్నవైయ్యాయి. బుగ్గల్లో సొట్టలు పడ్డాయి. పై పలువరుసలో ముందు ఒక పల్లు ఊడిపోవటంతో కాస్త గాలి బయటికి వచ్చింది. ఇది చూసి, ముచ్చటపడి, తను అమాంతం వర్షని రెండు చేతులతో పైకెత్తి, ఆనందంతో గిరగిరా తిప్పసాగాడు, 'అన్నయ్యా, ఆపు, ఆపు' అని వర్ష అరుపు వినిపించేంతవరకు.

అలా చాలా సేపు తిప్పడంతో పాపం వర్ష కళ్ళల్లోంచి కారిన నీళ్ళు చూసి, తనకు కూడా ఎంతో బాధ కలిగింది. అనుకోకుండా బండి నడపబోతున్న ప్రశాంత కళ్ళు చెమర్చాయి. మళ్ళీ గతంలోకి వెళ్ళాడు. ఆ తర్వాత తనకి చెల్లెలు లేని కొరత వర్ష తీర్చింది. క్రమం తప్పకుండా ప్రతిపుట్టినరోజూకీ హాజరయ్యేవాడు . కాలేజ్ చదువులకని హైద్రాబాదు వచ్చేదాకా. ఇప్పటికి ఊరు విడిచి దాదాపు 7 యేండ్లయ్యింది. కానీ అక్కడి విషయాలు ఉత్తరాలద్వారా తెలుస్తూనే ఉన్నాయి. ఆఫీసులో ఆడిట్ పని ముగిసాక, శాంతితో ఊరెళ్ళి, తనకివర్షని పరిచయం చేయాలనుకున్నాడు ప్రశాంత్.

ఇప్పుడు అనుకోకుండా సుప్రసన్నని తన చెల్లెలిగా భార్యపరిచయం చేసినపుడు, ప్రసన్న నవ్వినపుడు బుగ్గల్లో పడే సొట్టలని చూసాక, తన చిట్టి చెల్లి వర్షే మళ్ళీవచ్చినట్లనిపించి, మరో చెల్లెమ్మ దొరికిందనుకున్నాడు సంబరంగా. సహజంగానే స్నేహశీలుడైన తను అరమరికలు లేకుండా ప్రసన్నతో స్నేహంగా మెలిగాడు. కానీ, ప్రసన్న తన ప్రవర్తనని అపార్థం చేసుకుందేమో. ఏది ఏమైనా, ఈ వేళ ఎలాగో ఈ విషయాన్ని ఒక కొలిక్కి తీసుకురావాలని అనుకున్నాడు ప్రశాంత్.

'బావా, ఏమిటి బండి నడపకుండా ఆలోచనలో పడ్డావు?'అన్న ప్రసన్న మాటలకి వర్తమానంలోకి వచ్చాడు ప్రశాంత్. వీధి చివరిదాకా బుద్ధిగా కూర్చున్న ప్రసన్న, మలుపు తిరిగాక' బావా, కాస్త బండి ఆపు' అంటూకిందకి దిగిచెదరని జుట్టు సరిచేసుకుంది. చేతిసంచీ లోని చిన్న అద్దంలో తన ముఖం చూసుకుని, కాస్త పౌడరు అద్దుకుంది. క్రీగంట అద్దంలోంచే బావని ఒకసారి చూసింది.

తనవంక ప్రశ్నార్థకంగా చూసిన బావతో," కాస్త బాగా, ఫ్రెష్ గా కనబడాలికదా బావా! ఈరోజు నా డ్రెస్ఎలావుందో నీవు చెప్పనేలేదు." అంటూ అనవసరంగా నవ్వింది, బావకేసి చిలిపిగా చూస్తూ, కన్ను కొట్టిమరీ. ఏమీ ఎరగనట్లు, మళ్ళీ బండిపై కూర్చుని' పద బావా, టైం ఔతోంది' అని తొందరపెట్టింది.

ఇది చూసాక, ప్రసన్న వైఖరి అర్థం చేసుకున్న ప్రశాంత్ "ఈ పిల్లకి ఎలా నచ్చజెపాలా" అని ఆలోచిస్తూ, జాగ్రత్తగా బండి నడిపి, ఐ.ఐ.టి. కాంపస్ లో బండి ఆపాడు. క్యాంపస్ ద్వారం నుండి ఇంటర్వ్యూ జరిగే హాల్ కి ఒక కిలోమీటరు దూరంలోనే బండిని పార్క్ చేయాలి కనుక, ఆ దారి పొడవునా ప్రసన్నతో నడవక తప్పలేదు ప్రశాంత్ కి. హాలు దగ్గిరవగానే "ప్రసన్నా! బెస్ట్ ఆఫ్ లక్! ఇంటర్వ్యూ బాగా చేయి" అన్నాడు నవ్వుతూ. "థాంక్యూ బావా" అంటూ ప్రశాంత్ కుడిచేతిని తన కుడిచేత్తో అందుకుని, నవ్వుతూ " ఒక గంటలోపల వచ్చేస్తాను బావా! కాంటిన్ లో కలుద్దాం" అంటూ చాలా ఉత్సాహంతో, పరుగెడుతున్నట్లు వేగంగా హాలులోకి ప్రవేశించింది ప్రసన్న.

"పిచ్చిపిల్ల!" అని అనుకుంటూ పరిసరాలు గమనిస్తూ, అక్కడి పచ్చటి ప్రశాంత వాతావరణాన్ని ఆస్వాదిస్తూ, కాంటీన్ వైపుకి దారి తీసాడు ప్రశాంత్.సుమారు గంటన్నర తర్వాత "బావా!" అంటూ చాలా ఉత్సాహంగా బిగ్గరగా పిలిచినట్లై, ఉలిక్కిపడ్డాడు, కాంటీన్ లో ఒక మూలగా కాఫీ త్రాగుతూ, పుస్తకం చదువుకుంటున్న ప్రశాంత్. చదువుతున్న పుస్తకంలో పేజ్ మార్క్ పెట్టి మూస్తూ, "హాయ్! ఏమైంది ప్రసన్నా? సెలెక్ట్ అయ్యావా?" అంటూ ఉత్సుకతతో ప్రశ్నించాడు.

"మనం కాక వేరెవరు సెలెక్ట్ ఔతారు బావా?" అంటూ లేని కాలర్ని ఎగరేస్తున్నట్లు నటించి, పౌరాణిక సినిమా గెటప్ లో జవాబిచ్చి, దుర్యోధనుడిలాగా "హా హా హా" అంటూ లేని మీసం మెలిపెడుతూ నవ్వింది ప్రసన్న. "కంగ్రాట్స్" అంటూ కరచాలనం చేసాడు సంతోషంతో. పట్టుకున్న చేతిని చటుక్కున ముద్దు పెట్టుకుని "బావా! నాదొక చిన్న కోరిక. తీరుస్తావా?" అనడిగింది. "తీర్చగలిగిందైతే తప్పక తీరుస్తా" అని జవాబిచ్చాడు ప్రశాంత్. మెల్లగా తల వంచుకుని, ప్రశాంత్ కుడిచేతిపై తన ఎడమచేతితో గీతలు గీస్తూ, "బావా! నా ఈ చేతిని ఎప్పటికీ వదలనని మాట ఇవ్వు.

మన బంధువులందరూ నీ గురించి ఎంతో మంచిగా చెప్పినపుడే, నిన్ను చూడకుండానే నీవంటే నాకు చాలా ఇష్టం కలిగింది. ఇపుడు నీ ప్రవర్తన, ఆదరాభిమానాలు నీపై ఆరాధనని కల్గించాయి. వరకట్న దురాచారాన్ని రూపుమాపాలని అందరూ మాట్లాడతారు. కానీ, నీవు ఆచరణలో పెట్టి, పెళ్ళి కూడా నిరాడంబరంగా చేయించి, బాల వితంతువైన అక్కయ్యని ఎంతో ప్రేమగా ఆదరించిన ఆదర్శమూర్తివిగా నీ పైన గౌరవాభిమానాలు రెట్టింపయ్యాయి. నీకు సొంతం

కావాలనుకుంటున్నాను. నన్ను నీ దాన్ని చేసుకో బావా….ప్లీజ్…."అని ఆర్తిగా అంది ప్రసన్న. మెల్లగా తన చేతిని ఆమె చేతుల్లోంచి విడిపించుకున్నాడు ప్రశాంత్. ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చోమన్నాడు. బేరర్ ని పిలిచి, మొదట మంచినీరు, తర్వాత ఇడ్లీ, వడలని తెమ్మన్నాడు. బేరర్ తెచ్చిన మంచి నీటిని ప్రసన్నని త్రాగమన్నాడు.

మంత్రముగ్ధురాలైనట్లు నీరు త్రాగింది. తెచ్చిన టిఫిన్ ని సుష్టుగా తిన్నాక, "ఇపుడు నీ విజయాన్ని సంతోషంగా జరుపుకుందాం" అంటూ ఫ్రూట్సాలడ్ ని తెప్పించాడు ప్రశాంత్. "బావా! నీవిచ్చే సమాధానమే నాకు సెలిబ్రేషన్" అని మెల్లగా ఇంకా ఏదో అనబోతున్న ప్రసన్నతో "ఉండు. మొదట కడుపు నిండితే, మాటలు ఆడటానికి, వినడానికి శక్తి వస్తుంది" అంటూ మధ్యలోనే ప్రసన్న మాటలు తుంచేసాడు. తిని ముగించాక, బిల్లు చెల్లించి, ప్రసన్నతో బయటికి నడిచాడు.

ఇద్దరూ చెట్లమధ్యగా ఉన్న రోడ్డుపై నడుస్తూంటే, ప్రసన్న "మనసు పాడింది సన్నాయి పాట" అంటూ మెల్లగా కూనిరాగం తీయసాగింది, బావ ప్రక్కన తన బంగారు భవిష్యత్తుని ఊహించుకుంటూ. "ఇక్కడ కూర్చుందామా?" అని అడిగిన ప్రశాంత్ కి ఊహల్లో విహరిస్తున్న ప్రసన్న వెంటనే జవాబీయలేదు. "నిన్నే ప్రసన్నా! ఇక్కడ కూర్చుందామా?" అని రెట్టించాడు, ఆమె భుజాన్ని తడుతూ. ఉలిక్కిపడి, అకారణంగా సిగ్గుపడి, కొంగు సర్దుకుంటూ, తలవంచుకునే సరే నన్నట్లు తల ఊపింది ప్రసన్న.

దించిన తల ఎత్తకుండా, పరధ్యానంతో కూర్చున్న ప్రసన్నతో "కుదురుగా కూర్ఛో. నా కళ్ళకేసి చూడు. నీతో కాస్త మాట్లాడాలి" అన్నాడు ప్రశాంత్.ప్రసన్న మెరుస్తున్న కళ్ళతో ఏం మాట్లాడతాడో అని కుతూహలంతో చూసింది.

"మొదట నీ జీవితాశయం గురించి తెలుసుకోవాలని ఉంది. చెప్పు" అనడిగాడు ప్రశాంత్. "బావా! నాకు బీ.టెక్.లో గోల్డ్ మెడల్ వచ్చింది. ఎమ్.టెక్.లో ఇంతదాకా నేనే యూనివర్సిటి టాపర్ ని. అప్పట్లో రీసెర్చ్ చేయాలన్న కోరిక బాగా ఉండేది. " అని ఆగింది. "మరి ఇప్పుడు?" ప్రశాంత్ అడిగిన ప్రశ్నకి సమాధానంగా సిగ్గుతో తలవంచుకుని, మట్టిపై కుడిచేతి వేళ్ళతో ముగ్గులేయసాగింది.

కాస్సేపాగి, మళ్ళీ అదే ప్రశ్నని వేశాడు ప్రశాంత్.విశాలమైన తన కళ్ళతో ప్రశాంత్ కేసి ఆరాధనగా చూస్తూ, "చెప్పనా, చెప్తే తిట్టవు కదా బావా?" అని అడిగింది. తలని అడ్డంగా ఊపాడు ప్రశాంత్. " ఇప్పుడు అనిపిస్తోంది రీసెర్చ్ ఎందుకు? చక్కగా పెళ్ళి చేసుకుని, హాయిగా ఉందామని" అని కాస్త ఆగి, "అదీ… నీవు ఒప్పుకుంటే" అని ముగించింది ప్రసన్న.

ఆ మాటలని పట్టించుకోకుండా, ప్రశాంత్" ప్రసన్నా! చదువనేది అందరికీ అబ్బదు. ఈ కాలంలో ఎంతమంది అమ్మాయిలు రీసెర్చ్ చేస్తున్నారు చెప్పు. పై చదువులు చదవాలన్న కోరిక ఉన్నా, ఆర్థిక స్తోమతు లేక చాలామంది ఇంటి బాధ్యతలను మోయడానికి, మనసుకి నచ్చకపోయినా, తక్కువ జీతాలకే, దొరికిన ఉద్యోగాలు చేస్తూ, తమ కుటుంబాలని పోషిస్తున్నారు. జీవితాంతం చదవలేకపోయామనే బాధతో,నిరాశ, నిస్పృహలతో జీవచ్ఛవంలా కాలం గడుపుతూ, గంతకు తగ్గ బొంతగా దొరికిన మగాడిని పెళ్ళి చేసుకుని, ఒక సరాసరి ఆడదానిలా, బొటాబొటిగా జీవనం సాగించేవారు కోకొల్లలు. కానీ, నీ విషయం అలా కాదు కదా.

నీవెంతదాకా చదవాలనుకుంటావో, అంతదాకా చదివించగలిగే ఆర్థిక స్తోమత గల తలిదండ్రులు, సిటీలో ఇంద్రభవనం లాంటి ఇల్లు, ఇంటినిండా నౌకర్లు, చాకర్లు, పడవలాంటి కారు. నీ అందానికి, ఐశ్వర్యానికి, చదువుకి 'కో' అంటే కోటిమంది కోటీశ్వరులైన వరుళ్ళు క్యూలో నించుంటారు స్వయంవరానికి. ఇక నీవు కోరుకున్న నాతో జీవితం గురించి కాస్త చెబుతాను. ఆదర్శభావాలని, బాహ్య సౌందర్యాన్ని చూసి ఆకర్షితురాలవై, బంగారు భవిష్యత్తుని పాడు చేసుకోవద్దు.

నీ లక్ష్యం ప్రకారం నీకు నచ్చిన విషయంలో రీసెర్చ్ చేసి, అనుకున్నది సాధించు. ఆదర్శంగా ఉండాలనుకుంటే, సమాజానికి శ్రేయస్సు చేకూర్చే విషయంపై రీసెర్చ్ చెయ్యి. లోక కల్యాణానికి నీ వంతు సహకారం అందజేయి. అంతే కానీ, చదువు మధ్యలో మానేసి, మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఒక వివాహితుడిని పెళ్ళి చేసుకోవాలనుకోవడం మంచిది కాదు. దీనివల్ల అటు నీకు సంతోషం కలగదు. ఇటు నాకు, నీ అక్కకి మనస్పర్థలు తప్ప. ఆదర్శవంతులని ఇష్టపడవచ్చు, ఆరాధించవచ్చు. కానీ, వారిని పొందాలనుకోవడం భావ్యం కాదు.

మన జీవిత ధ్యేయాలు ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాధించాలంటే, నిబ్బరం, శ్రద్ధాభక్తులు, నిరంతర కృషి చాలా అవసరం. ఈ వయసులో ఇలాంటి ఆకర్షణలు సహజమే !కానీ వాటికి లోబడకుండా లక్ష్యాన్ని సాధించాలి నీలాంటి తెలివైనవాళ్ళు. నీ లక్ష్యసాధనలో నాకు చేతనైనంత సహాయం చేయటానికి ఎప్పుడూ నేను సిద్ధమే. సరేనా? అన్నట్టు నిన్ను చూసాక, నాకు ఒక చెల్లెలు దొరికిందనుకున్నానే కానీ, వేరే ఉద్దేశ్యం కలగలేదు. అందుకే నీ మాటలు జలుబు చేసినపుడు ఐస్క్రీం కోసం మారాం చేసే పసిపిల్లనే జ్ఞప్తికి తెప్పించాయి. కాస్త మనసు కుదుట పడ్డాక, నిదానంగా ఆలోచించు నేను చెప్పింది సరైనదా అన్నది. ఆ....బుర్ర చాలా వేడెక్కింది, కాస్త చెరకు రసం త్రాగి, ఇంటికెళదామా?" అంటూ లేచాడు. తననే కళ్ళార్పకుండా చూస్తున్న ప్రసన్నకి స్నేహభావంతో చేయి అందించాడు లేవడానికి.

మౌనంగా అతని చేయి అందుకుని, మెల్లగా అతనితో నడిచి, కాంపస్ బయటికి వచ్చి, అల్లం, నిమ్మరసాల రుచితో అదరగొట్టే చెరకు రసం త్రాగింది.ఇల్లు చేరేదాకా మౌనంగానే గడిచింది. ఇల్లు చేరగానే, బండి దిగుతూ, చటుక్కున వంగి, ప్రశాంత్ కి పాదాభివందనం చేస్తూ, " బావా" అని ఆర్తిగా పిలిచి, "ఊహూ(…కాదు కాదు భయ్యా" అంటూ అతని చేతులని తన కళ్ళకి అద్దుకుంది పూజ్యభావంతో ప్రసన్న.

-డా.తిరుమల ఆముక్తమాల్యద

Tags:    
Advertisement

Similar News