జోకాభి రామాయణం

Advertisement
Update:2023-05-24 12:45 IST

‘‘సుతారానికీ, మొరటుకీ తేడా ఏమిటి?’’

‘‘ఓ పక్షి ‘ఈక’తో చెంప నిమరడం సుతారం. ‘పక్షి’నే చెంప మీద రాయడం మొరటు’’.

వెంగళప్ప ఎలక్ట్రానిక్స్ షాప్‌కు వెళ్లి- ‘‘మీ దగ్గర ‘కలర్ టీవీ’లు వున్నాయా’’ అని అడిగాడు.

‘‘ఉన్నాయి సార్!’’ అన్నాడు షాప్ వాడు.

‘‘అయితే ఓ బ్రౌన్ కలర్‌ది ఇవ్వండి’’ అన్నాడు వెంగళప్ప.

కళాకృష్ణ, సుందరం సినిమాకు వెళ్లారుగా అయితే అప్పటికే అరగంట సినిమా అయిపోయినా బానే వుందనుకున్నారా? ఎందుకలా?

వాళ్లు వెళ్లిన సినిమా ‘అలా మొదలైంది’ మరి!

‘‘భార్యలకు తమ మొగుళ్లు తాగడం అస్సలు నచ్చదు ఎందుకంటావ్’’ అడిగాడు కృష్ణమాచారి పాత్రోని.

‘‘పిల్లిలా వుండే మొగుడు తాగాక పులిలా ప్రవర్తిస్తాడనే’’ అన్నాడు పాత్రో.

‘‘నువ్వెక్కడ పుట్టావ్’’ అడిగాడు బాస్ సర్దార్జీని

‘‘పంజాబ్’’ సర్దార్జీ అన్నాడు గర్వంగా.

‘‘ఏ ప్రాంతం’’

‘‘ఏ ప్రాంతం ఏమిటి? మొత్తం శరీరం అంతా పంజాబ్‌లోనే పుట్టింది’’ అన్నాడు సర్దార్జీ.

“డాక్టర్ గారూ! నేనూ, మా ఆయనా ఒకేసారి కొవ్వు తగ్గడానికి మీ దగ్గర మందు తీసుకున్నాం కదా! ఆయన పది పౌండ్లు తగ్గి, నేను అలానే వున్నానేమిటి’’ అడిగింది ఉష అజయ్‌ని.

‘‘నా దగ్గర మందు తీసుకున్న ఆయనకు బుర్ర లేదు కదమ్మా’’ - డాక్టర్ అజయ్ సమాధానం.

కొత్తగా కట్టిన ఓ మేడని చూపించి, ‘‘అదేంటి’’అని అడిగాడు జెన్నీ-సాయిని.

‘బిల్డింగ్’ అన్నాడు సాయి.

‘‘ఆల్‌రెడీ బిల్ట్’ అయిన దానిని, ‘బిల్డింగ్’ అంటావేమిటి’’ కోప్పడ్డాడు జెన్నీ.

“మన పిల్లల మీద, పెద్దలకు కోపం వుంటే- విషమో, నిద్రమాత్రలో ఇచ్చో, ఉరేసో, కొండమీంచి తోసేసో చంపేయకుండా ఏం చేస్తారు చెప్పు?’’ అంది సుమిర ప్రతీతితో క్లాసులో. ‘‘ఏవుంది’’ ‘చదువు’అంటూ బడిలో పడేస్తారు. మనం అలాగే కదా ఛస్తున్నాం’’ అంది ప్రతీతి.

జీవిత సత్యo:

———————

ఒకరిని ప్రేమించి మరొకరిని వివాహమాడతాం.

వివాహమాడిన వ్యక్తి జీవిత భాగస్వామి కాగా,ప్రేమించిన వ్యక్తి ఈ మెయిల్ ఐ.డి కో మరే ఆన్లైన్ అక్కౌంట్ కో పాస్‌వర్డ్‌గా పరిణమించడం జరుగుతుంది.

“ఏమండోయ్ డాక్టర్ వివేకానందమూర్తిగారూ! ఎక్కడా కనబడ్డం లేదు నాల్రోజుల్నుంచీ’’ కొత్తగా ప్రాక్టీసు పెట్టిన డాక్టరు మిత్రుడిని అడిగాడు భ.రా.గో.

‘‘తుపాకీ కొన్నానుకదా! వేటాడదామని శ్రీకాకుళం అడవులకెళ్లాను’’ అన్నాడు డాక్టరు.

‘‘మరేమైనా చంపారా లేదా?’’

‘‘ఉహూ! ఒక్కటి కూడా దొరకలేదు.’’

‘‘అయితే ఊళ్లోనే ఉందురూ! ఇక్కడ మీ ప్రాక్టీసేనయం కదా!’’ అన్నాడు భరాగో.

ఓ సాహిత్య సభలో పాల్గోవడానికి మునిమాణిక్యం, జాషువా హైదరాబాద్ వెళ్లారు. ఆంధ్ర రాజధానిగా ‘హైదరాబాద్’ గుర్తింపబడిన మొదటి రోజులవి. ఇద్దరూ నగరమంతా తిరిగి ఓచోట కబుర్లు మొదలెట్టారు.

‘‘ఏమండీ మునిమాణిక్యంగారూ! మన ప్రాంతాల్లో ఎక్కడబడితే అక్కడ కనబడే గాడిదలు ఇక్కడ ఒక్కటీ కనిపించదేమండీ’’ అన్నారు జాషువా.

దానికి మునిమాణిక్యం ‘‘మొన్ననేకదండీ ఈ హైదరాబాద్ మన రాజధాని అయ్యింది. ఇప్పుడిప్పుడే వస్తున్నాయ్! నాలుగురోజులుపోతే మీకు కావలసినన్ని గాడిదలు కనబడతాయ్ ఎక్కడబడితే అక్కడ’’ అన్నారట.

భరాగో సంగీత ప్రియుడనీ అందులోనూ సైగల్ అభిమాని అనీ తెల్సిన మిత్రులు కొందరు విశాఖ సాహితి పిక్నిక్‌లో ఆయన్ను సైగల్ పాటలు పాడమని బలవంతం చేశారు.

ఆయనందుకు ఒప్పుకోకపోవడంతో కొంతమంది ‘‘సైగలు- సైగలు’’ అని ఆయనను చూసి గొడవ చేశారు.

అపుడు భరాగో లేచి ‘‘సైగలు చేసే వయసు దాటిపోయింది నాకు .దయచేసి నన్ను ఇప్పుడు ఇబ్బంది పెట్టకండి’’అని చక్కా కూర్చున్నాడు.

కథా రచయిత శివల జగన్నాథరావు పొట్టివారయినా కథా రచనలో గట్టివారే.

భరాగో ఆయనకోసారి ఉత్తరం రాస్తూ ఎడ్రస్‌లో ఇలా రాశారు శ్రీ.శివలజగన్నాథరావు ,'షార్ట్'.. స్టోరీ రైటర్...’’

ఓమారు ద్విభాష్యం రాజేశ్వర్రావ్ భరాగో రూంకి వెళ్ళి గోడకున్న ఓ గ్రూప్ ఫొటో చూసి ‘‘ ఫొటో గ్రాఫరెవరో గానీ సరిగా తీయలేదు. బుర్రలన్నీ చిన్నవిగానూ బ్యాక్‌గ్రౌండ్ పెద్దదిగానూ తీశాడు’’ అన్నాడట.

దానికి భరాగో ‘‘పాపం! ఫొటోగ్రాఫర్‌ని ఏం అనకండి! ఇందులో ఎవరి బుర్రలూ పెద్దవికావు’’ అన్నాడు.

భరాగో ఓ సినిమాకు వెళ్లాడు. పావుగంట చూసేసరికి వళ్ళుమండిపోయింది.

‘‘ఇంతోటి సినిమా చూడటానికి కళ్ళజోడు కూడా ఎందుకు దండగ’’అని కళ్ళజోడు తీసేసాడు.

దేవెళ్ళ బాలకృష్ణ తూలుతూ ఇంటికొచ్చి తలుపు తాళం తీయడానికి నానా అవస్థా పడుతున్నాడు.

అదంతా గమనిస్తున్న భరాగో జాలిపడి ‘‘తాళంచెవి యిటివ్వండి! నేను తీస్తాను’’ అన్నాడు.

‘‘అవసరం లేదు! నేను తియ్యగలను. కాస్త ఇల్లు కదలకుండా పట్టుకోండి చాలు’’ అన్నాడాయన.

‘‘నా భార్యకు జబ్బు వచ్చిందోయ్ ఈమధ్య. రాత్రి రెండు మూడింటివరకూ మేలుకుని కూర్చుంటోంది’’ భరాగో చిరాగ్గా తన స్నేహితుడితో అన్నాడు.

‘‘అరె పాపం! అంతవరకూ ఏం చేస్తూంటుంది’’ అడిగాడతను.

‘‘నాకోసం ఎదురుచూస్తూంటుంది వీధి తలుపు తీసిపెట్టి’’ జవాబిచ్చాడు భరాగో.

Tags:    
Advertisement

Similar News