ఉనికి

Advertisement
Update:2023-03-04 12:35 IST

క్షణం ఇక్కడ ఉంటానా

అంతలోనే ఎవరో చెయ్యట్టుకు లాక్కువెళ్ళినట్టు

ఏ మారు మూల జ్ఞాపకంలోకో చేరిపోతాను.

ఏళ్ళ క్రితం వెలిగిన చుక్కల మెరుపులా

మళ్ళీ సజీవంగా నాముందు నిలబడి ఉంటుంది

మౌనం గీసిన రేఖా చిత్రంలా.

ఇన్ని కాలాలు ఎక్కడికి ఎగిరిపోయినట్టు

కాదనడానికి లేకుండా

ముఖ శిల్పంమీద ముఖారి చెక్కిన ఆనవాళ్ళు

నీ వెనకే ఉన్నామంటూ

నీడలునీడలుగా పరచుకుంటున్న నిజాలు

మెత్తని ఉలి ములుకుల్లా అనుక్షణం గిచ్చుతున్న

ఏకాంతాలూ - ఎడారి చూపులూ

వెనకెనకే పరుగెత్తుకు వస్తూ

వేటాడుతున్న పులిపిల్ల వాస్తవం

ఆగి ఒక్క సారి వెనక్కు తిరిగి

స్పష్టంగా ఒక తపస్సమాధి సముద్రాన్ని

అరచేత పరచినప్పుడు

పిచ్చి చూపులు చూస్తూ సశేషమైన భయం

ఎక్కడో నుండో కురిసే రెండు చుక్కల తొలకరికే

పచ్చదనం మెరిసే మాగాణీ నేల ఉనికి

కత్తి మొనమీద కాలాన్ని సాగదీస్తూ

కడదాకా చిగురించే పచ్చని కలే

- స్వాతి శ్రీపాద

Tags:    
Advertisement

Similar News