చాలు కదా !

Advertisement
Update:2023-05-01 12:30 IST

వెలుగైతేనేం

అది రూపాలు మార్చుకునే

చీకటి అయితేనేం

నీడలు నీడలుగా ప్రవహిస్తున్న ఊహలు

రెక్కలు మొలిచిన

పసిడి ముక్కలుగా చేసుకు

అక్షరాలుగా చెక్కుకునే ఉలి నయాక అది ఏదైతేనేం గాక!

మాటలూ మాటలూ కోడిపుంజుల్లా దూసుకు వెళ్ళే క్షణాలెందుకు

ఒకదాన్నొకటి రాసుకు విద్వేషాల బూడిద రాల్చుకోడం ఎందుకు

నిశ్శబ్దాన్ని తీగలుగా సాగదీసి సరిగమల మెట్లపై పిలుపులు నాదాలయ్యే వేళ

ఏ మాటలూ ఎందుకు

చుట్టూ ఒక కనిపించని సముద్రం

అహర్నిశలూ అలలుఅలలుగా అల్లుకుపోయి

చిత్తడిగా మారిన మనసు పొరల లోలోనికి ఇంకి

సుషుప్తిలో కలలను బీజాక్షరాలుగా మొలకెత్తి౦చే వేళ

ఆ మెత్తని స్పర్శే

పది ప్రపంచాలుగా ...

మూల మూలల్లో భయాలు పొదిగి

ఎటునించో ఎగిరొచ్చే ఉత్పాతాల దిగులెందుకు?

ఎదుట కళ్ళల్లో నన్ను నేను

సవరి౦చు కోలేని

ఈ నిస్పృహ కన్నా

పెద్ద ఉత్పాతం ఎక్కడు౦టు౦ది

వెలుగు చీకట్ల మధ్య

సమయాన్ని సాగదీస్తూ

గతాన్ని అర్ధరాత్రి కాఫీలా తాగి తాగి

వలయాలు వలయాలుగా తిరుగుతున్నా గాలి గుసగుసలల్లో

లాలిపాట ఒకటి నాకు మాత్రం

జోల అవుతుంది

ఒకానొక పారవశ్యపు మగతలో

ప్రపంచం నడి వీధిన

పరుగులు పెడుతూ పాటలవుతూ

వసంతాలూ హేమంతాలూ చల్లుకునే క్షణాలు చాలు

- స్వాతి శ్రీపాద

Tags:    
Advertisement

Similar News