ఓ పెన్సిల్ ముక్కు
విరిగి పోయింది
ఈ పెన్సిల్ తోనే
చిన్నప్పుడు
గది గోడలమీద
పిచ్చిగీతలు గీసి
చివాట్లు తిన్నాను
నాలుగులైన్ల కాపీ పుస్తకంలో
అక్షరాలను చూచిరాతగా
దిద్దుతూరాసాను
అక్షరాలను కలిపి
పదాలు కూర్చినపుడు
ఆనందంతో ముఖం
వెలిగిపోయింది
అవే పదాలు
వాక్యాలుగా మారి
భాషను సంపన్నం చేశాయి.
ఆ భాషతోనే రచనలు చేసాను
ఆ అక్షరాలనే ముత్యాలు జేసి
కవితలు రాసాను
కాలక్రమేణా
భూగోళ పటాలకు రంగులద్దాను
రేఖాగణిత కోణాలను గీశాను
జీవశాస్త్ర శరీరాంగాలను చిత్రించాను
ప్రేమలో పడ్డాక
ఆమె మనోహర నేత్రాల మాటున
దాగిన భావాలను
కాగితం మీద పరవశించి రాసాను
రంగుల చిత్తరువులు వేశాను
ఇదే పెన్సిల్
చేత పట్టించి
కొత్త తరానికి సైతం
భవిష్యత్ అక్షరాలు నేర్పించాను
పదసంస్కారాన్నీ
వాక్యాల భావాల్నీ బోధపరిచాను
ఉన్నట్టుండి అనుకోకుండా
పెన్సిల్ ముక్కు
విరిగిపోయింది
షార్పనర్ లో పెన్సిల్ ముక్కు
మళ్ళీ చెక్కే ప్రయత్నంలో పడి
ఆ నా పాత జ్ఞాపకాలను
చెక్కుతున్నాను.
కొంకణి : శ్రీ మనోజ్ నరేంద్ర కామత్
తెలుగుసేత : సుధామ