శృంగార రస కథలు రాసే రచయితగా శ్రీనాథ్ కి మంచి పేరుంది.
అతని కథలు, కొన్ని రకాల పత్రికల్లో విరివిగా వస్తుంటాయి.ఇటీవల ఒక పత్రిక అతని కథల్ని సీరియల్ గా వేస్తోంది.
పెళ్ళికాని యువతీ యువకులపై మీ కథలు చెడు ప్రభావాన్ని కలిగిస్తాయని ఎవరైనా చెబితే,"రచనలెక్కడైనా జీవన విధానాన్ని మార్చేస్తాయా అంటూ వాదిస్తాడు. పైగా,"మన ప్రబంధాలన్నీ అంగాంగ వర్ణనలతో నిండిన బూతుల బుంగలు కావా?" అని తన రచనల్ని సమర్ధించుకుంటాడు.
పెళ్ళికి ముందు కొందరమ్మాయిల్ని ప్రేమించి వాళ్ళ తిరస్కారానికి గురయ్యాడు శ్రీనాథ్.
తెరమీద హీరో హీరోయిన్లు డ్యుయెట్లు పాడుకునేటపుడు హీరోయిన్ పక్కన తననిఊహించుకునేవాడు.నవలలు చదివినపుడు కూడా అంతే.
చివరికి పెద్దలు కుదిర్చిన సంబంధమే చేసుకున్నాడు శ్రీనాథ్.
ఇప్పుడతనికి ఆడవాళ్ళ మీద ఒకరకమైనకసి,కోపం.ప్రేమించనివాళ్ళని ఏమీ చేయలేని అశక్తత.అవన్నీ తన శృంగార రచనల ద్వారా బయట పెడుతున్నాడు.
ఈ విషయాలు అతని చిన్ననాటి స్నేహితుడు సాగర్ కి తెలుసు.మిత్రుడి రచనా ధోరణి మార్పించాలని ఎన్నిసార్లో ప్రయత్నించి విఫలమయాడు.
" ప్రేమనేది తామరాకు మీది నీటిబొట్టులాంటిదిరా.దానిమీద నీటిబొట్టును నిలకడగా వుంచడానికి ఎంత కష్టపడాలో ప్రేమించి ఆ ప్రేమను పొందటానికి కూడా అంతే కష్టపడాలి" అని చెప్పేవాడు.అయినా పట్టించుకునేవాడు కాదు శ్రీనాథ్.
* * * *
శ్రీనాథ్ గారికి
నమస్కారాలు.మీ రచనలు చాన్నాళ్ళుగా చదూతున్నాను.అవి శృంగారం పేరు మీద చలామణీ అవుతున్న బూతు కథలని గ్రహించేలోగానే నేను కాలుజారి బురదలో కూరుకుపోయాను."తామరాకు మీది నీటిబొట్టులా,కరడిగిన
మంచి ముత్యంలా వుంటావమ్మా నువ్వు"అంటుండేవారు మా నాన్నగారు.అటువంటి నేను మీ కథలు చదివి చదివి వాటి ప్రభావానికి గురై ఒక మగ పురుగు కాటుకు బలయ్యాను.మా తలిదండ్రులకు,ముఖ్యంగా మా నాన్నకు ముఖం చూపలేని నాకిక మిగిలింది ఆత్మహత్యే.నా పతనానికీ,నా ఆత్మహత్యకీ మీరే బాధ్యులని మరచిపోకండి.
ఇట్లు
సునీత
ఉత్తరం పూర్తి చేసిన శ్రీనాథ్ కి నెత్తిమీద ఇంటి దూలం విరిగి పడినట్టనిపించింది.తన కథాసాగరంలో తానే మునిగిపోతున్నట్టు ఫీలయ్యాడు.కాదు కాదు తన కథాపంకంలో తన కూతురే కూరుకుపోయినట్టు వ్యధ చెందేడు.
తమ ఊళ్ళో కాలేజీ లేని కారణంగా పొరుగూర్లో హాస్టల్ లో ఉండి చదూకుంటున్న సునీతకు ,శ్రీనాథ్ అనే కలం పేరుతో సెక్సు కథలు రాసేది తన తండ్రేనని తెలీదు.
-మాధవి సనారా