మృత్యువొసంగే
మాతృ కరమ్ముల
విధవ కానుపు
పెదిమల
వెలుగై వెలిగి
నలుపెక్కిందీ సంధ్య
ఖేదం రేపీ
రోదసి నిండి
విశ్వ గళమ్మున
హాలాహలమై
విస్తరిల్లినవి
చీకటులు!
నల్లని త్రాచు కోరలు
తెల్లని మశూచి కుండలు
గగనమ్మున
తారలు!
* * * *
జట్కా గుఱ్ఱం
కాలం మెళ్ళో
గంటలు రెండు
మ్రోగినవి
చచ్చిన తల్లి శవం
మెళ్ళో గజ్జెల
పట్టెడతో
ఉల్లాసంగా
ఆడుకునే
పసి పిల్లడులా
గాలి!
ఒళ్ళు తెలియని
పుళ్ళ బాధతో
వెక్కి వెక్కి
ఏడ్చినది
చుక్కల ఆకాశం!
సద్యో ఫలితం
విద్యు ద్దీపం
వెలుగున
గదిలో
ఖ్యాతి గడించే
గీతం వ్రాసి
ప్రేయసి కంకిత
మీయాలంటూ
మూతి బిగించి
చేతులు నులుముతు
కూచున్నావ!!
-శ్రీరంగం నారాయణ బాబు
Advertisement