చివరి ఊహ

Advertisement
Update:2023-11-01 19:00 IST

చుట్టూ వెతికితే ఏమీ దొరకదు

గుండె లోపలికి చేతులు జొనిపి

కాసేపు శూన్యాన్ని హత్తుకుని దుఃఖపడ్డాక

బయటంతా చీకటేనని నిందలు మోపుతూ

లోపలే దాక్కోడం అతిపెద్ద చీకటి ఊబి.

బండరాళ్లను నిర్వేదపు ఉలితో చెక్కుతూ

చేతులకెన్నో పదునైన గాయాలు!

రాయిపై రాయి..

రాయిపై రాయి...

ఇదొక కిటికీల్లేని మహా ఇరుకు కారాగార నిర్మాణం!

వెల్తురు పోట్ల గాయాల గాలుల్ని కోరుకుంటూనే

పలుగును అవతలకు విసిరేసే నిస్సహాయత.

ఏదో ఓ రోజు ఈ నిర్లిప్తతపు బంధీఖానాలో నిండా మునిగిపోకమునుపే

చేతి పిడికిలిలోకి పలుగు చేరాలనీ

వెలుతురి వరదలో రాళ్ళూ, నేనూ కొట్టుకుపోయి

చెరో తీరం చేరాలనే చివరి ఊహ.

భయమల్లా ఒక్కటే

ఊపిరైన ఊహా

ఈ బండరాళ్ల గుహలో జీవితఖైదీనేమోనని.

-- శ్రీ వశిష్ఠ సోమేపల్లి

Tags:    
Advertisement

Similar News