నేనొక ఇంద్రచాపాన్ని ( కవిత )

Advertisement
Update:2023-07-26 23:37 IST

నేనొక ఇంద్రచాపాన్ని,

వివిధవర్గాల రూపాన్ని

నేనొక కుసుమకదంబదామాన్ని

మధురపరీమళాల ధూపాన్ని

నేనొక సుందరసప్తతంత్రిని

గుప్తసుప్త నినాదాల నియంత్రిని.

చలిలో గడ్డకట్టి గిడసలు బారే

ఊర్పుల కూర్పుల చేర్పుల బలంలో

మహాతమిస్రామషీలిప్త మహీతలంలో

ఋగ్వేద గాథల ఉషస్సుషమలో నా జననం

రత్నధాతువుల యజ్ఞదేవుని

నులివెచ్చని ఒడిలో నా మననం.

సప్తసింధు నీరాల తీరాలలో

సప్తసప్తి వెలుగుల జిలుగులలో

నా చిన్ననాటి ఆటల బాటల పాటలు

సూర్యాదేవీ పూషదేవుల తేజోంగణాలు నా తోటలు

జరదుష్ట్రుని జెంద్ అవస్థా నా చెల్లి

జర్మణ్యుని డొయిష్చ్ సెన్ నా సోదరీమతల్లి

గంగాయమునలు, జీలంచీనాబులు

త్వంగత్తరంగసింధువు, శతద్రువు

రంగద్రావీ వితస్తలు

మింగన్మేఘ్నా పద్మాహుగ్లీలు

శతధా, సహస్రధా నాచీలుకలు

శాఖికలు, వాలికలు, మాలికలు

తూరుపు పడమరలుగా

వేలయోజనాల మేర వ్యాపించి, దీపించీ

వేనవేలు సామ్రాట్టుల, విభ్రాట్టుల

సంస్కృతీ సౌరభాల సంచారాల

పతనాభ్యుత్థానాలు, సంకోచవ్యాకోచాలు

తిలకించీ , పులకించీ, పలికించీ

పరికించిన గిరిరాజుకు

ప్రాచ్యజగతి వృద్ధిక్షయ

నిత్య మానదండమై

ప్రభాకరుని ఉదయాస్తాలను

ప్రపంచానికంటే ముందు

పారావారాలు దాటి

పరికించే గిరిరాజుకు పురరాజుకు

అన్ని దిశలలో తోడును

అన్ని దిశలలో నీడను

పంచనదం నా ఇతిహాసం

పంజాబీ నా యిప్పటి వేసం

లవహుర జాలంధరాలలో

సోరస్ పూరణ్ భగత్ లలో

ఆడిన వాణిని నేనే

పాడిన బానీ నేనే

గంగా తరంగమాలల

తుంగజలధి భంగావళి

మేళవించి తాండవించి

అగ్నివీణ గీతాంజలి

ఆలపించి వంగభూమి

అంగభూమి కళింగభూమి

చెంగున లేచేట్టు చేసి

వీరుల ఆరాధనాలు

శూరుల ఆత్మాహుతులు

చేయించినది నేనే, భేరీ

వాయించినది నేనే.

పూరీ కోణార్కల

భువనేశ్వర బరంపురాల

దేవాలయ బాలాలయ

దీపావళి సాలభంజికలతో

రామాయణగానంతో

రాసాలూ, లాస్యాలూ

రాసకాలు చేయించిన

చంద్ర విశదకీర్తి కవి

ఉపేంద్ర భంజ్ నేనే

తుంగభద్రా సముత్తుంగ వీచీ ఘటలలో

కృష్ణావెణ్ణా పెన్నా తరంగ

కాకలీ నినాదాలలో

ప్రబంధాలు పలికించినది నేనే

కబంధాలు సమయించినది నేనే.

కవేరజా తటాలలో

కన్నడ కస్తూరిని తమిళ తంగాన్ని

విన్నాణంతో చెప్పింది నేనే.

సరయూసరిత్తునుండి శోణానది దాకా

గిరివ్రజం నుంచి వింధ్యాద్రిదాకా

సౌభ్రాత్ర సౌజన్యాల ప్రావృ

డభ్రాలతో తడిపింది నేనే.

కులాల కూకటివేళ్లు

కుళ్లజేస్తాను

మతాల మాయగోడలు

కుప్పకూలదోయిస్తాను

కర్రగలవానిదే బర్రె అనే

విర్రవీగేకాలం

విరిగి పడదోస్తాను

మనిషీ మనిషీ

మమతకేదారాలను

మనీషా హలాలతో

దున్నుకునేట్టు చేస్తాను.

పాలబుగ్గల పసిపాపల పసిడికలల

లీలలు హేలలు మీ మనసులలో

జోలలు ఏలలు పాడేట్టు చేస్తాను.

కన్నెపిల్లల నునుసిగ్గుల నిగ్గులు

వన్నెతరగిన చెడు చేతలనే

చేడియ బెగ్గిలజేస్తాను.

బమ్మెరపోతన మకరందాల మందారాలు

మీ హృదయాలలో విరబూయిస్తాను

మంచుషవర్లలో జలకాలాడిన

మల్లెల మొల్లల మించు తెల్లందనాలు

మీ మేధారామాలలో ఈనగాయిస్తాను.

గోతులు త్రవ్విరాలు తెచ్చిరట్టు చేసినా

జిలుగులు వీడని జాబిల్లి వెన్నెలలో

మీ భావనారోదసిలో నిండుగా

మెండుగా దండిగా కలకండగా పండిస్తాను.

మీ పలుకుల తల్లులను

నా పలుకుల తోబుట్టువులను

ప్రపంచసాహిత్యమంటపంలో

ఆనాబేషాహీ ద్రాక్షాఫలస్తబకాలై

కనులపండువయ్యేట్టు చేస్తాను.

నేనొక ఇంద్రచాపాన్ని,

వివిధవర్గాల రూపాన్ని

నేనొక కుసుమకదంబదామాన్ని

మధురపరీమళాల ధూపాన్ని

నేనొక సుందరసప్తతంత్రిని

గుప్తసుప్త నినాదాల నియంత్రిని. 

-- శ్రీ తిరుమల రామచంద్ర

Tags:    
Advertisement

Similar News