రాములోరి పెళ్ళి!
ఇంటికింతో,అంతేసుకుని,
అంతా కలసి చేద్దాం!
తాటాకు పందిళ్ళ సువాసనలు,
కొబ్బరిమట్టలు,
గెల-గల అరటిచెట్లతో..
వీధంతా పెళ్ళికళే!
ఈ సారి పీటల మీద
మేమే కూర్చుని పెళ్ళి చేస్తున్నామని పొంగి పోయేవారుకొందరు,
విగ్రహాల -ఎంపిక నుంచీ-
ఊరేగింపు వరకూ
పెళ్ళి పనులకు అంతూ-దరీ లేదు,
పెళ్ళి పెద్దలకి తీరికే లేదు!!
సూత్రాలు,తలంబ్రాలు, పూలదండలు,పానకాలు,
సిద్ధం మరి!!
బుగ్గనచుక్క తో, కళ్యాణతిలకంతో మెరిసిపోయే విగ్రహాలు!!
కాపలాగా,లక్ష్మణుడు,
కాళ్ళదగ్గర అరటిపళ్ళపక్క అంజన్న!
చిన్నపిల్లల
కొబ్బరి ఆకుల-బూరాలు!
సన్నాయి,భజంత్రీలు చూపే
"రామభక్తి సామ్రాజ్యము!!
తాళి ని చూపుతుంటే...
పురుషోత్తమునే పెళ్ళాడే
సీతమ్మ అదృష్టం!-
అనుకునే కన్నెపిల్లలు!!
తలంబ్రాల సమయంలో
చినుకులు కోసం చూసే నమ్మకాలు!!
కళ్యాణం చూసి, పానకం తాగి పరవశించటం,
అక్ష తలు తలదాల్చి అనందించటం,
రాత్రికి మళ్ళీ వచ్చి సీతా రాములకి దండంపెట్టి,.హరికథో,
నాట్యమో,నాటకములో
చూడాలి కదా!? మరి
సీతారాముల-కళ్యాణము
చూతము రారండీ !
- వేమూరి సత్యవతి.