"ఉధ్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ |ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః "||
నీకు నీవే శత్రువు -
నీకు నీవే బంధువు
మనిషి తనను తానే యుధ్ధరించుకొనవలెను. తనను అధోగతిని బొందించుకొనగూడదు. ఏలయనగా,ఇంద్రియమనంబులను జయించినచో తనకు తానే బంధువు.జయింపనిచో
తనకు తానే శత్రువు అగును.
ప్రతిజీవుడు తనను తానే యుధ్ధరించుకొనవలసినదిగా భగవానుడుద్బోధించుచున్నాడు.
గురువులు, శాస్త్రములు, దైవము దారిచూపువారే కాని, నడువవలసినది తానే. తన కాళ్లతో తాను నడవవలెను. తన కండ్లతో తాను చూడవలెను. తన ఆకలిని తానేపోగొట్టుకొనవలెను.
మహాత్ములగువారు ఎంతయో శ్రమపడి కష్టములకోర్చి, శీతోష్ణాది ద్వంద్వములను సహించుచు, ఎన్నియో వత్సరములు కఠోరములగు సాధనలను జేసి తమ చిత్తమును, ఇంద్రియములను తామే నిగ్రహించుకొని ధన్యులైరి. అట్లే తక్కినవారును ప్రయత్నపూర్వకముగ తమ చిత్తమును తామే వైరాగ్యబోధోపరతుల ద్వారా శుధ్ధపఱచవలెను. అట్లు శుధ్ధపడిన మనసే జనులను సంసారమను గోతినుండి పైకి తీయగలదు.
గురువు శిష్యునికుపదేశించుట సంప్రదాయమును పాటించుట కొఱకే గాని అసలు చేయవలసిన పనియంతయు శిష్యుని చేతిలోనే యున్నదని వశిష్టుల వారు శ్రీరామచంద్రునకు చెప్పియున్నారు.
భవరోగపీడితుడగు జీవుడు తానే స్వయముగ సాధన జేసి తరించవలెను.
'ఉధ్ధరే దాత్మనాత్మానమ్' అనుదాని యర్థమిదియే.
సామాన్యముగ ప్రతివానికిని మనస్సునందు రెండుభాగములుండును.
ఒకటి మంచిభాగము, రెండవది చెడ్డభాగము. ఒకటి ధర్మము వైపు ఈడ్చునది, మఱియొకటి అధర్మమువైపు ఈడ్చునది. వీనిలో మొదటిదానిచే రెండవదానిని ప్రయత్నపూర్వకముగ నోడించి అద్దానిని ధర్మము వైపు త్రిప్పుకొనవలెను. ఇది పురుషప్రయత్నముచే సాధ్యపడును.
బంధువు తనయందే కలడు, శత్రువు తనయందే కలడు. శుధ్దచిత్తమే బంధువు, వశీకృతమనస్సే బంధువు. కావున దానినే ఆశ్రయించవలెను. అది జీవునకు మహోపకారము చేయగలదు. అట్లే మలినచిత్తము, అవశీకృతమనస్సు తనకు శత్రువు. అది తనకు మహాపకారము చేయగలదు. బాహ్యశత్రువు ఈ జన్మయందు మాత్రము హింసించగలదు. అంతఃశత్రువగు మలినచిత్తమో, జన్మజన్మాంతరము జీవుని వెంబడించి బాధించును. కావున అట్టి అంతఃశత్రువును ప్రయత్నముచే మొట్టమొదట తొలగించుకొని పరమశాంతి పొందవలెను.
ఎవడేసమయమున యోగారూఢుడగునో అట్టి సమయమున నట్టివానిచే యాత్మసంసారానర్థ సముదాయమునుండి నుధ్ధృతమగును. కాన వివేకయుక్తమగు మనస్సుచే సంసారసముద్రమునందు మునిగిన జీవనరూపమగు తనను సంసారసముద్రమునుండి యుధ్ధరించుకొనవలెను. అనగా విషయాసక్తపరిత్యాగపూర్వకముగా యోగారూఢత్వమును పొందించవలెను. కాని విషయాసక్తిచే జీవస్వరూపమగు తనను సంసారసముద్రమున మునుగునటుల జేయరాదు.
మనస్సే సంసారబంధనమునుండి మోచకమగుటచే తనకు బంధువు ఇతరుడు కానేరడు. లౌకికబంధువు స్నేహానుబంధముచే బంధహేతువే కాని బంధమోచకుడు కాడు.
పట్టుకాయయందు ప్రవేశించి యచటనేయుండి బంధింపబడు పట్టుపురుగువలె మనస్సే విషయబంధకమగుటం జేసి తనకు శత్రువు. బాహ్యశత్రువుకూడ మనఃప్రయుక్తుడగుటచే మనస్సే జీవునకు శత్రువు. విషయములయందాసక్తిని విడచినచో మోక్షము ప్రాప్తించును. విషయములందాసక్తుడగుచో బంధము ప్రాప్తించును. కాన నీ రెండువిషయములను జక్కగ బరిశీలించి రాగాదిస్వభావమును బరిత్యజించవలెనని 'ఉధ్ధరేత్' అను శ్లోకముచేజెప్పుచుండెను.
వివేకయుక్తమగు నాత్మచేతనే తను సంసారమునుండి ఉధ్ధరించుకొనవలెను. క్రిందకి త్రొక్కివేయరాదు. మనస్సాంగత్యమును త్యజించిన యాత్మయే ఆత్మకు (తనకు) బంధువు. మనస్సాంగత్యము గల యాత్మయే తనకు శత్రువు.
సౌజన్యం :శ్రీ పులివర్తి కృష్ణమూర్తి