కల్లోల పరిస్థితుల్లోంచి తప్పకుండా కమనీయత జనిస్తుంది. కన్నీటి మడుగుల్లోంచి కమలాలు ఉద్భవిస్తాయి. శ్రీకృష్ణుడి ముఖతా యుద్ధమధ్యంలోంచి భగవద్గీత ఆవిర్భవించింది. అంపశయ్యలోంచే భీష్ముడు విష్ణు సహస్రనామాన్ని లోకానికి అందించాడు. ముళ్లమీదినుంచి ముళ్లను వొత్తిగించుకుని వచ్చి వికసిస్తుంది గులాబీ పువ్వు. చీకట్లనుచీల్చుకుని కాంతి పుంజం బయటకు వస్తుంది. మథనం, గరళం తరవాతే జనించింది అమృతం.
కల్లోలాలూ, కన్నీళ్లూ అనివార్యాలు. నిజానికి అవన్నీ అవసరాలే. అవి అనివార్యాలనీ, అవసరాలనీ గుర్తించినప్పుడు కన్నీళ్లు కళ్లను శుభ్రం చేస్తాయనీ, గుండెమంటలు ఆర్పుతాయనీ, కల్లోలాలు అమృతోద్భవం ముందు గరళం వేసే చిందులనీ అర్థం చేసుకోగలుగుతాం.
సంతోషాన్నీ, సౌందర్యాన్నీ ఇనుమడింపజేయడానికే భగవంతుడు విభిన్న అంశాలను పక్కపక్కనే సృజించాడు. సర్వత్రా వర్జనీయమైన 'అతి'ని నియంత్రించేందుకే మంచైనా, చెడైనా, దేన్నయినా దీర్ఘం నుంచి లఘువుగా మలిచాడు.
ముల్లు విరిగిందని మనిషి తన నడక ఆపడు. ముల్లు తీసేసి నడుస్తాడు. ఎండ ఉందనీ, వర్షం వచ్చిందనీ తన పనులేవీ ఆపేయడు. గొడుగుపట్టుకుని వెళ్లి పనులు ముగించేస్తాడు. అతి చిన్న అవసరాలను, ఆటంకాలను కూడా ఇంత శ్రద్ధగా సరిచేసుకుని, పూడ్చుకొని ముందుకు వెళ్లే మనిషి జీవనగమ్యమైన, జీవిత సార్థక్యమైన అసలు గమనాన్ని గుర్తించకుండా కష్టాల దగ్గరే కుంగిపోయి ఆగిపోతున్నాడు.
చిన్నచిన్న అవసరాలకే ఆటంకాలనధిగమించగలిగే మనిషి అత్యంత పెద్దదైన జీవిత సార్థక్యదిశగా సాగిపోయే క్రమంలో ఎదురయ్యే కష్టాలనూ, ఆటంకాలనూ లెక్కచేయాల్సిన అవసరంలేదు. ఆగిపోయి అత్యంత విలువైన కాలాన్ని వృథా చేయవద్దు.
పరమ పదసోపాన అధిరోహణాక్రమంలో గమ్యం ఎంతో దూరం. దుర్గమమూ, దుర్లభమూ, దురూహ్యం. ఐనా పయనించాల్సిందే. పయనంలో మనం ముళ్లూ రాళ్లనే కాదు. కాలనాగుల్నీ, కారు చీకట్లనూ సైతం అధిగమించక తప్పదు.
మనకేవస్తువూ ఉచితంగా రాదు. పొందగోరే అంశాన్ని బట్టి శ్రమో, ప్రేమో, ధనమో, మరేదో పెట్టుబడిగా పెట్టక తప్పదు. దీపంపురుగులు దీపాన్నాశించి రెక్కలు కాల్చుకుంటాయి. ప్రాణాలనూ పోగొట్టుకుంటాయి. నిజానికి తామాశిస్తున్నది తమకు ఉపయుక్తమైందేనా, లభించి తీరేదేనా అనే జ్ఞానం వాటికి లేదు. ఐనా ప్రయత్నాన్నాపవు.
భగవంతుడనే జ్ఞానదీపం, అమృత కలశం, వాడని పుష్పం, సర్వ కాలాల్లో, సకలలోకాలను కాచే సర్వశ్రేష్ఠుడున్నాడు. మనకు అంది తీరుతాడు. మన శాశ్వతానందం, పరిణామం, ప్రమాణం ఆయనలో ఐక్యతే. మనం ప్రయత్నించాలి. ప్రయత్నం, ప్రయాణం కష్టమే. కఠినమే. ఐనా అనివార్యం.
ప్రయత్నం మొదలుపెట్టాలి. ప్రయాణం ప్రారంభించాలి. అంపశయ్య సిద్ధమై ఉన్నా, గరళం గొంతులోకి దిగినా మనసు మాధవుడితో నిండిపోతే… గమ్యం గోవిందుడే ఐపోతే మనం ప్రహ్లాదులమే. మనల్నప్పుడు విషం చంపదు. అగ్ని కాల్చదు. నీరు ముంచదు.
-శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి.