శ్లోకమాధురి : శృంగార హర్షవర్ధనం

Advertisement
Update:2023-05-14 14:35 IST

"భాసో హాస: కవికుల గురు కాళిదాసో విలాసః "అంటూ వారి ప్రక్కనే " కవితా కన్యక యొక్క హర్షము "అని జయదేవునిచే కీర్తింపబడ్డ హర్షవర్ధన (హర్షో హర్షః ) మహాకవి నాటకత్రయకర్త. ఆరవ శతాబ్దంలో భారతదేశం పర్యటించిన చైనా యాత్రికుడు తన అనుభవాలలో హర్షుని ప్రశంసించాడు.

బాణుడు రచించిన హర్ష చరిత్ర ద్వారా ఇతని గురించి తెలుస్తూ ఉన్నది. రచించిన మూడు నాటకాలు రత్నావళి, ప్రియదర్శిక, నాగానందము లలో విద్యాధర చక్రవర్తుల జాతక కథలను ఆశ్రయించి రచించినదిగా చెప్పబడుతున్న నాగానంద నాటకంలో నాయకుడు జీమూతవాహనుడు. నాయిక మలయవతి.

ధర్మబద్ధంగా వివాహమాడిన నాయికా నాయకుల సరస సల్లాపాలలో నాయకుడు మలయవతి ముఖ కాంతి చంద్రుడిని కూడా ధిక్కరించి రాగమనే సూర్య తాపమును ప్రతిబింబిస్తూ కమలాన్ని కూడా జయించాలని కోరుకుంటున్నది అని అంటాడు మలయవతి సౌందర్యం రాత్రి చంద్రుని కాంతులు,ఉదయసూర్యుని రక్త వర్ణమును మించినవని , చంద్రుడు,పద్మము రెండు కూడా ఆమె సౌందర్యమునకు సాటి రానివి అని అంటూ స్తనభారమే అధికమైన నడుము, నితంబాలని మోయలేని ఊరుద్వయము వంటి సహజ సుందరమైన అవయవాలు ఉన్న, కొత్త పెళ్లాంతో పచ్చిక బయలులో పాన్పులు, స్వచ్ఛమైన శిలాఫలకాలు, సెలయేళ్ల జలకేళీలు,స్వర్గసుఖాలనీ,వర్ణిస్తూ, ముగ్ధత్వం తో ఆమె ప్రదర్శిస్తున్న సిగ్గు తన హృదయాన్ని ఆకర్షిస్తూ ఉన్నా యంటాడిలా.

“దృష్టా దృష్టిమధో దదాతి కురుతే నాలాపమాభాషితా

శయ్యాయాం పరివృత్య తిష్టతి  బలాదాలింగితా వేపతే

నిర్యాంతీషు సఖీషు వాసభవనాన్నిర్గన్తుమేవేహతే

జాతా వామతయైవ మే అద్య సుతారం ప్రీత్యై నవోఢా ప్రియా"

చూపులతో చూపులు కలిసినప్పుడు కళ్ళు కిందకి దింపేసుకుంటున్నది, మాట్లాడదామంటే బదులు పలకదు, శయ్యాగతులమైనప్పుడు పక్కకు తిరిగి పడుకుంటుంది, బలవంతంగా కౌగిలించుకుంటేవణికిపోతుంది,

చెలికత్తెలతో పాటు తాను కూడా వెళ్లిపోవాలని తలుపు వైపు చూస్తుంది, ఇలాంటి చేష్టలు చేస్తున్నప్పటికీ కూడా ఈ కొత్త పెళ్లికూతురు నాకు మరీ మరీ ప్రియతమంగానే ఉన్నది అని పరవశుడైన నాయకుని చేత పలికిస్తూ అతి లలితంగా,అతి సుకుమారంగా, అతి సహజంగా కొత్త పెళ్ళికూతురి సిగ్గుదొంతరలు హృద్యంగా   అభివర్ణించాడు.

ఆ కొత్త పెళ్లికూతురు దూరం వెళుతున్న కొద్ది దగ్గరికి రమ్మంటున్నది అని భావించుకుంటూ వర్ణించాడు. నేటి యువదంపతులలో కూడా ఇలాంటి సున్నిత భావాలు సజీవంగా ఉంటే ఎంత మధురంగా వుంటుందో!!

- డాక్టర్ భండారం వాణి

Tags:    
Advertisement

Similar News