బీడుగుండెలు పూడాలి (కవిత)

Advertisement
Update:2023-10-04 13:24 IST

చుట్టలేని చాప కక్కలేని నీటిచుక్క

నేలచెక్క గుండెను బీటలు వార్చింది

గుంటలోని నల్లనక్షత్రం రాల్చిన బిందువు

మట్టి పగుళ్ళను తడపలేక జారి పాతాళం చేరింది

పచ్చని రంగు కలికానికి కూడ

చిక్కడం లేదు

ఆకలి చీకటి కప్పిన మనిషి తరువుకు తోరణమయ్యాడు

కడిగిన అక్షయపాత్రను కసిగా శోధించాలి

అడుగు పొరల దాగిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి

రంగు రసాయనాలకు

మంగళగీతం పాడి

జీవసంబంధ సేంద్రియ సేద్యానికి నడుము బిగించాలి

ఆకుపచ్చ తివాచి బొక్కలకుఆశల మాసికలు వేసుకుని

సాలీడు సోదరుడిలా సమరశంఖం పూరించాలి

పొలిమేరల చెట్లు

పచ్చదనం పుంజుకుని

పక్షులు గూళ్ళు కట్టాలి

వలసపోయిన పావురాలు తిరిగి సొంతగూటికి చేరాలి

బీడుగుండెలు పూడి

హరితవనాలతో అవని పండాలి... 

-శింగరాజు శ్రీనివాసరావు,

(ఒంగోలు)

Tags:    
Advertisement

Similar News