ఆకాశమే సాక్షిగా
అవని మీద గర్భస్థ శిశువై
అతివ దేహం
ఆచ్ఛాదన రహితమైంది
నవ నాగరిక ప్రపంచంలో
నాటి మహాభారతం
నడిబొడ్డులో నలుగురి ముందు
నగ్నంగా నవ్వింది
కళ్ళులేని నాటి దృతరాష్ట్రుడు
కళ్ళున్న నేటి నాయకుడై
అస్మదీయ అభిమానంతో
అగ్నిని రగిలించాడు
రాముడు అనుమానించాడు
దుర్యోధనుడు అవమానించాడు
హరిశ్చంద్రుడు అమ్మేశాడు
నేటి మగవాడు నగ్నాన్ని వరమిచ్చాడు
యుగాలు మారినా
యాగాన సమిథ ఆడదేనా
జన్మనిస్తున్న దేవత బ్రతుకు
వథ్యశిల మీద బలి పశువేనా...
కలాల జారిన నల్లచుక్కలు
కావాలి కాముకుల పాలిట
విషపు చుక్కలు
న్యాయదేవత గాంధారి కట్టువిప్పి
నా తల్లులకు న్యాయం చేయాలి
చట్టాలు చెదలు దులిపి
మతోన్మాదులకు మరణశాసనం వ్రాయకపోతే
ఆడపిల్ల అమ్మతనాన్ని చంపుకుంటుంది
అప్రజాతగా మారి మరోతరాన్ని
తనే వధిస్తుంది.
-శింగరాజు శ్రీనివాసరావు
(ఒంగోలు)
Advertisement