మనిషే నా సర్వస్వo (కవిత)

Advertisement
Update:2023-01-21 15:59 IST

మనుషులంటే నాకు

ఎనలేని ప్రేమ

నన్ను నేను ఇష్టపడేంత

అవ్యాజమైన మక్కువ

నడిచే దారులలో

కాంతి వలయాలల్లేవారు

ఎదురైనా వారికల్లా

నవ్వుల సుంగంధం

పంచుతూ పోయేవారు

చేతులు సాచి నీడలు

పరచే వారు

ప్రేమ క్షమ కరుణ ఓదార్పు

ఒకటి గానో అన్నీగానో

అనుకూల వర్ణాలతో

తెలుపు నలుపుల లోకాన్ని

రంగులతో నింపేవారు

ఎవరో ఒకరు

మనిషి ఎదురైన ప్రతీసారీ

నా కళ్ళలోకి కాంతి చొరబడి

విద్యుదీకరించబడతాను

ఆకాశంలో మేఘాల దగ్గరగా

గుంపుగా ఎగిరే గువ్వల్ని

చూసారా?

కలివిడిలోని కమ్మదనాన్ని

పాడుతున్నట్టుండదూ?

రాగమో భారమో

పంచుకోవడానికీ ఓంపుకోవడానికీ

మనిషి కావద్దా?

ఏడంతస్తుల ఏకాంత

వాసాన మనలేను

నాకు మనిషి ఊపిరి సోకే

మాదక పరిమళం కావాలి

మనిషి లేని చోట ఊపిరి ఆగినట్టుంటుంది

ఏదో తలుపు మూసిన ఉక్కపోత

చూపు చీకటైనట్టు

అంధకారం అల్లుకుంటుంది

నన్ను మట్టిలో పూడ్చినా సరే

మనిషి అలికిడైతే చాలు

మొలకత్తే విత్తునై

నేలను చీల్చుకుని

శిరసెత్తుతాను

మనుష్యుడే నా సంగీతం

మానవుడే నా సందేశం

మనిషే నా సర్వస్వo

- శారద ఆవాల

Tags:    
Advertisement

Similar News