అతిసూక్ష్మ శబ్దంతో తెల్లవారుతుంది.
అందమైన సూర్యోదయాలు
పూలు వికసించే దృశ్యాలు
హృదయంలోకి ఇంకకుండానే ఆవిరైపోతూ
అప్పుడే
ఇరవైనాలుగ్గంటల పరుగుకు
ప్రారంభోత్సవమౌతుంది
నిస్తేజంగా రాలుతున్న కాలాన్ని
నిస్సహాయంగా చూస్తుంటే
రెక్కలు తెగిన కాలెండరు
లోతుగా గాయపరుస్తుంది.
పగళ్ళ రాత్రుల నడుమ
కాంతిలేని చూపుల లోలకాలు వేళ్ళాడుతూ
గదిగదిలో ఓటీటీల ధ్వనులు
అరచేతిలో గాజుతెరల
నిశ్శబ్దపలుకుల ప్రవాహాలు
ఒంటరితనాన్ని రాజేస్తూ
చేతిలో ముద్ద నోట్లోకి వెళ్ళేలోగా
మనసు ఎటో ఎగిరిపోయి
జీవితం వగర్చుతూ
లోపలి తడి గడ్డకడుతూ
ఇదీ అని పోల్చుకోలేని దుఃఖం
వెక్కిళ్ళుపెడుతూ
ఎవరికి వారే
రహస్యంగా ఖాళీ అవుతూ
- పద్మావతి రాంభక్త
Advertisement