అక్షద్వయం
వేదన లావాని వర్షపు జడిలా కురిపిస్తుంటే..
దుఃఖం ఆవలతీరానికి చేరుతుందా?
వేదనకు హేతువేదోతెలుసుకుని
కూకటివ్రేళ్ళతో పెకలించే ప్రయత్నంచెయ్..
శిశిరం ముసిరిన మనసు
నిశిథిలో నడయాడుతుంటే..
వసంతపు శోభ నీకెలా కానవస్తుంది..?
చీకటిని చీదరించడం మాని
ఓ ఆశాజ్యోతిని వెలిగించి చూడు
పుడమి నవవధువులా కళకళలాడుతుంది..!
అహం కంబళి కప్పుకుని
అవని ఏలాలని ..
భ్రాంతిలో బ్రతుకుతావెందుకు..!?
మండే చెట్టుపై ఎగిరేపిట్ట సైతం
వాలదని తెలుసుకోముందు..!
ధనం కోసం గుణం వదిలి
మనశ్శాంతి అర్థం మరిచి
ఏన్నాళ్ళయిందో కదా..!
భానుడి భగభగలు
వరుణుడి టపటపలు..
గీములో నిత్యకృత్యాలైన
లేమితనపు నేస్తం గాళ్ల కంచంలో
వెండి బువ్వవై మెరిసి చూడు..
గుండెగది దూదిపింజెలా తేలికవుతుంది.
మనసంతా సంతోషాలకు వేదికవుతుంది!
Advertisement