దాదాపు 80 ఏళ్ళ క్రితం తెలుగు లో వెయ్యిన్నొక్క నవలలు రాసి, పాఠకులను సమ్మోహితులుగా చేసిన శ్రీ కొవ్వలి లక్ష్మీనరసింహారావు 1 జులై 1912 న తణుకు లో జన్మించారు. చలం స్త్రీలను ప్రత్యక్షంగా సమర్థిస్తూ వారిని ఉన్నతులుగా చిత్రిస్తే, కొవ్వలి పరోక్షంగా స్త్రీలను ఉన్నతంగా చిత్రించారు. ఆ పాత్ర వేశ్య అయినా సరే ఎక్కడా ఔన్నత్యం చెడకుండా రాయటం వల్ల స్త్రీల పట్ల ఆయనకున్న గౌరవ భావం తెలుస్తుంది. కుటుంబంలో స్త్రీలు పడే బాధలు, కన్నీళ్లు, ఆవేదనలు, ఆలోచనలు ఆ నవలలలో ఉండేవి. రైల్వే స్టేషన్స్ లో తోపుడు బండ్ల మీద ఆ నవలలు విరివిగా అమ్ముడుపోయేవి. ప్రయాణికులు ఎక్కువగా అవే కొనుక్కొని చదువుకుంటూ, ఎంతగా లీనమై పోయేవారంటే - వారు దిగాల్సిన స్టేషన్ దాటి పోయినా పట్టించుకునే వారు కారు. ఇంతటి విజయం ఒక్కసారిగా ఆయనకు ఊడిపడలేదు. శ్రీపాద వంటి మహామహులు అద్భుతమైన రచనలు చేస్తున్న రోజుల్లో ఈయన రచనల్ని వేసుకోవడానికి ఏ పబ్లిషరూ సాహసించలేదు.
ఒకరోజు ఒక పబ్లిషర్ టేబుల్ మీద కొవ్వలి నవల రాతప్రతి ఎవరూ పట్టించుకోకుండా పడి ఉంది. అప్పుడే అక్కడికి వచ్చిన పోస్ట్ మేన్ ఏమీ తోచక ఆ టేబుల్ మీద ఉన్న కొవ్వలి గారి రాతప్రతిని చదవడం మొదలుపెట్టి, పరిసరాలను కూడా మరిచిపోయి, పబ్లిషర్ కం అధినేత పలకరించినా పట్టించుకోకుండా చదవడంలో మునిగిపోయాడు. తర్వాత "ఏమిటి అంతగా చదువుతున్నావ్" అంటే, "అమ్మో, ఏం పుస్తకం అండీ. అస్సలు పూర్తయ్యేదాకా వదలలేకపోయాను" అన్నాడు. గొప్ప వ్యాపార వేత్త అయిన ఆ పబ్లిషర్ (కొండపల్లి వీరు వెంకయ్య) 'ఒక సాధారణ పాఠకుడికి ఇంతగా నచ్చిందంటే, ఇది ప్రజల్లోకి ఎంతగా వెళుతుందో' అని అంచనా వేసుకొని వెంటనే అచ్చువేశారు. అలా వచ్చిన మొదటి నవల 'పల్లెపడుచు'. తర్వాత 'దాసీపిల్ల' 'తానాజీ'. అప్పటినుంచి కొవ్వలి నవలలు వెల్లువ ప్రారంభమైంది. ఇవి ఇంతగా ప్రజాదరణ పొందడానికి కారణం భాష. జానపదం, మిస్టరీ, రాజుల కథలు ఏవైనా కావచ్చు . కానీ భాష మాత్రం మామూలు ప్రజలు మాట్లాడుకునే, అందరికీ అర్థమయ్యే, హాయిగా చదువుకునే వ్యవహారిక భాష.
భాషా చైతన్యంతో పాటు ఇతివృత్తం, పాత్రచిత్రణలో నవ్యత, భావ చైతన్యం, సాంఘిక దురాచారాలు, స్త్రీల సమస్యలు అన్ని వీరు తన రచనల్లో విశ్లేషించడం, స్త్రీల జీవితాలను శాసించే పద్ధతులను నిర్మొహమాటంగా ఖండించడం జరిగింది. కొవ్వలి రచనల్లో సంస్కృత పదాడంబరత, పాండిత్య ప్రకర్ష ప్రభావము లేనట్టే అశ్లీలత అసభ్యత కూడా ఉండవు. కనుకనే ఆనాడు జన బాహుళ్యంలో- ముఖ్యంగా మధ్యతరగతి స్త్రీలలో కొవ్వలి నవలల పట్ల ఆసక్తి పెరిగింది. ఆ నవలలలోని విశేషాలను అభిమానులు కథలుకథలుగా చెప్పుకొనేవారు. పుస్తకాల షాపుల్లో పుంఖానుపుంఖాలుగా ఎప్పటికప్పుడు సరికొత్తవి ప్రత్యక్షం అవుతూ ఉండేవి.
ఒక్కోసారి నలుగురు పబ్లిషర్స్ కి నాలుగు నవలలు ప్రారంభించేవారట. విభిన్నమైన కథాంశాలు, కథాగమనం అయినా ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా, 25 ఏళ్ల వయసుకే నాలుగు వందలు, ముప్పై ఐదేళ్ళ వయసుకే 600 నవలలు పైగా రాసిన గొప్ప రచయిత ఆయన.
1940 ప్రాంతంలో నందిగామలో ఒక బట్టల షాపతను (తెలివైన వ్యాపారి ) తన వస్త్రాల కంటే కొవ్వలి నవలలు నమ్మకమే ఎక్కువ చేసేవాడు. 'అణా' డిపాజిట్ కడితే నవలను 'కాణి' కి అద్దెకు ఇచ్చే వాడు. ఆ స్కీం లో చేరి కొన్ని వందలమంది ఆ నవలలను విరివిగా చదివేవారు. వేలాదిమంది, అందులోనూ ఐదో క్లాస్ వరకు చదువుకొని కాపురానికి వచ్చిన స్త్రీలు ఆ నవలలలో తమ జీవితాలను, అభిప్రాయాలను దర్శించు కునేవారు. ఉపన్యాస ధోరణిలో కాకుండా, సంభాషణ రూపంలో సాగుతూ కళ్ళకు కట్టినట్టు ఉండే ఆ కథనం ఆంధ్రదేశములోని నగరాలలోనే కాక పల్లెటూర్లలో కూడా బహుళ ప్రచారం పొందింది. ఆనాటి రచయితలు 'పేరు' రావాలంటే ఆయనలా రచించక, ఆయన శైలిని అనుసరించక తప్పలేదు.
ఇదే సమయంలో అనుకోకుండా ఆయన జీవితం మరో మలుపు తిరిగింది. శ్రీమతి కన్నాంబ, భర్త కడారు నాగభూషణం ఒక చిత్రం నిర్మించ తలపెట్టి ఆయనను కథ రాయమని ఆహ్వానించారు. చిన్ననాటే తల్లిని కోల్పోయిన కొవ్వలి తన మనసులోని భావాల్ని చేర్చి కూర్చి 10 రోజుల్లో రాసిన "తల్లి ప్రేమ" కథ ఆ దంపతులకు నచ్చింది. ఈ సందర్భంగా సినీ జగత్తులో ఒక చారిత్రక సంఘటన జరిగింది. తల్లి ప్రేమ చిత్రంలో పన్నెండేళ్ల పిల్లవాడి పాత్ర కోసం వెతుకుతున్న నిర్మాతల దగ్గర ఒక అందమైన 16 ఏళ్ల యువకుడు వచ్చాడు. సున్నితంగా ఆకర్షణీయమైన ముఖ కవళికలతో ఉన్నాడు. ఆ పిల్లవాడి పాత్రకు కొంచెం ఎక్కువ అనిపించింది. అయినా అతన్ని వదులుకోలేక మరో చిత్రంలో అవకాశం ఇవ్వాలని నిర్ణయంతో 6 నెలలు మద్రాసు లోనే ఉంచేశారు. వారి నమ్మకం వమ్ము కాలేదు. ఆ 16 ఏళ్ల కుర్రాడే ఆ తర్వాత కాలంలో తెలుగు సినీ సామ్రాజ్యాన్ని 'నటసామ్రాట్' గా ఏలిన 'అక్కినేని నాగేశ్వరరావు'.
రాజరాజేశ్వరి పిక్చర్స్ బ్యానర్ మీద తీసిన తల్లి ప్రేమ తర్వాత శాంతి, బీదల ఆస్తి , సిపాయి కూతురు, దక్షయజ్ఞం మొదలగు సినిమాలకు కథ మాటలు కూడా రాశారు కొవ్వలి.
సమాజం ఏర్పరచిన కట్టుబాట్ల పంజరాల్లో ఊపిరాడక కొట్టుమిట్టాడే స్త్రీలకు, ఉత్సాహం ఉరకలు వేసే యువతరానికి ఆయన అభిమాన రచయిత అయ్యారు. అదే సమయంలో కొందరికి కంటగింపుగా తయారయ్యారు. ఒక ప్రణాళిక ప్రకారం తెలుగు సాహిత్య చరిత్రలో ఆయన పేరు రాకుండా చేశారు. కానీ సమాజంలోని సమస్యల్ని వెయ్యి విధాల నిశితంగా పరిశీలించి వెయ్యి నవలలు రాసిన 'సహస్రాక్షుడు' ఆయన.
డా.సిహెచ్.సుశీల