ద్విగుణీకృతమైన
ఈ శరత్కాల వెన్నెల
నీరవ సౌందర్యాన్ని ఏమని వర్ణించను...
శృంగార రసకేళీ విన్యాసాలకు
తెర లేపుతున్నట్లుగా
తొలిరేయి నూతన వధువు సిగ్గుపడుతున్నట్లుగా
ప్రియుడికై ఎదురుచూస్తున్న అభిసారికలా
అమాయక పల్లెటూరి పిల్ల చిరునవ్వులా
తోటలో విరబూసిన చామంతిలా
మంద్రగమనంలో వీణానాద స్వరకంపనల్లా
చలిరాత్రులలో నిశ్శబ్ద మౌనరాగాల్లా
స్వర్గసీమలో అప్సరసల నృత్యగానాల్లా
కిన్నెరసానుల జలక్రీడల పాటల్లా
పైనున్న అమ్మ అందించే ఆశీర్వాదాల్లా
ఆ తెల్లని వెన్నెల ధాత్రినంతా నింపేసింది
మగత నిద్రలో
తీయని ఊహల స్వప్నాలు.....
ఎవరో బంగారుగిన్నెలో
వెన్నెల అమృతం తెచ్చారు
అల్లకల్లోలంగా ఉన్న నా మనసుకు
కష్టాల కడలి నుండి
తేరుకోలేని నా మనసుకు
ఆశ చావని ఈ పేదవాడి మనసుకు
విసుగెత్తి ఈ జీవితాన్ని చాలిద్దామనుకుంటున్న
ఈ మనసుకు
ఈ వెన్నెల ఆ అమృతాన్ని నాకందిస్తుందా!
ఆప్యాయంగా ఆదరించి స్వాంతన చేకూరుస్తుందా!
లేక అడవి గాచిన వెన్నెలలా మిగిలిపోతుందా!
- రూపాకృష్ణ