కడలి కష్టాలు ( కవిత)

Advertisement
Update:2023-01-05 22:45 IST

సముద్ర అలల తరంగాలు ఘోషిస్తున్నాయి

బడుగుజీవుల ఆర్తనాదాల లాగా

తీరాన్ని తాకిన అలలు వెనక్కివెళుతున్నాయి

రూపాయి విలువ పతనమవుతున్నట్లు

సముద్ర గర్భంలోని మొసళ్లకు

మేత దొరికింది

కార్పోరేట్ ఆసాములు కుబేరులవుతున్నారు మరి

నీటి గుర్రాలు ఎగిరెగిరి పడుతున్నాయి

కుబేరుల జాబితాలో చోటు కోసం ఎగపడినట్లు

సొరచేపలు దొరికింది దోచుకొని కనుమరుగవుతున్నాయి

బ్యాంకుల దోపిడీలు చేసి

విదేశాలకు చెక్కేసినట్లు

తిమింగలాలు జిఎస్టి రూపంలో బయల్దేరాయి

చిన్నపెద్ద చేపలు (పాలు,పెరుగు వగైరా)అన్నీ దానికి బలవుతున్నాయి

ఆ వసూళ్లలో కొంతమంది శవాలవుతున్నారు

మరికొంత మంది వాటి మధ్య పేలాలేరుకుంటున్నారు

చిన్న చిన్న బోట్లు హుందాగా తిరుగుతున్నాయి

డ్రగ్స్, మత్తుమందులు ఓపెన్ మార్కెట్లో దొరుకుతున్నట్లు

షిప్ కమాండర్ శత్రువుపై ఎన్నో అస్త్రాలు ప్రయోగిస్తున్నాడు

అత్యాచారాల కేసుల్లో నిర్భయ,దిశ చట్టాల్లా విఫలమవుతున్నాయి

తాకినా బిల్కిస్ బాను రేపిస్టుల లాగా బయటపడొచ్చు

ఇక పెద్దా,చిన్నా జలప్రాణులన్నీ విర్రవీగుతున్నాయి

ప్రజాప్రతినిధులు దేశసంపదను దోచుకుంటున్నట్లు

ఆణిముత్యాలు,రత్నాలు,

పగడాలు మొదలైనవి

ఈ విధ్వంసక

దాడిలో మరుగునపడి

అందకుండా నీటి అడుగుకు చేరినాయి

నీతి,నిజాయితీ తో నిష్కల్మషమైన ప్రజాసేవ చేయాలనుకునేవారిలాగా

తుఫానులు, సునామీలు సముద్రాన్నిఅతలాకుతలం చేస్తున్నాయి

సంస్కృతీ సాంప్రదాయాల విలువల పరిరక్షణ ధ్వంసమైనట్లు

ఈ కష్టాల కడలిలో కనపడేదేమిటీ?

మద్దతు ధర లేని రైతుల ఆవేదనలు

దళారుల వల్ల సంక్షేమపథకాలు అందని అభాగ్యులు

పెరిగిన ధరలతో అల్లాడుతున్న మధ్యతరగతి దీనులు

సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్న అమాయకులు

ఇంకా ఇంకా ఎన్నోరకాలుగా బాధలు పడుతున్న కుత్సితులు

అయ్యా!షిప్ కమాండర్ గారు

కొరడా ఝళిపించండి

స్వపర భేదాలు లేకుండా

మన సముద్ర సంపదను కాపాడాల్సిన సమయం ఆసన్నమయింది

- రూపాకృష్ణ

(ప్యారక కృష్ణమాచారి)

Tags:    
Advertisement

Similar News