మంచు నిండిన
ఈ ఉదయసంధ్యారాగాన
ఎక్కడివీ
మధు పరిమళాలు ?
బహుశా మత్తెక్కించే
స్వప్నాలలో విహరించిన-
నీ జ్ఞాపకాల
పారిజాత సుమాలు
వెదజల్లాయి కాబోలు!
పురివిప్పిన నెమలి ఆనందనాట్యానికి తోడుగా-
కుహుకమై దివ్య గానాలతో అలరించినావు నీవు...
ఆ కలలో!!
మన ప్రేమ బంధం
ద్వేషం నుండే పుట్టింది కదా!
అయినా - నీ సంకల్పానికి,
నీ భావనలకి కట్టుబడి
ఆ మహత్తర శక్తి గల ప్రేమతో
ఈ బంధాన్ని
పటిష్ట పరచుకున్నానే!
ప్రేమ తత్వంలో
ఉన్న ఐక్యత భావనలతో
ప్రకృతి లయలతో
మమేకమయ్యానే !
ఒక్కసారి నిన్ను
స్పృశించనియ్యి చెలీ!
నీ ప్రేమ కోసం పరితపిస్తున్న
నా హృదయ వేదనను
ఆ తపనను
అర్థం చేసుకొని -
నీ ప్రేమను పంచవా చెలీ....
దేవుడు మన హృదయాల్లో ఉన్నాడంటారు!!
పాపం ఆ దేవుడికి
నా హృదయంలో చోటే లేదు..
ఎందుకంటే-
నా హృదయం నిండా
నీవే కదా!
అందుకేనేమో -
ఆ దేవుడు నాలో
ఎన్నో లోపాలు ఉంచాడు!!
అందులో
ముఖ్యమైన లోపం-
నా సర్వస్వం
నీవే అనుకోవడం!!
ఈ లోపం సర్దుబాటు
చేసేందుకు
నీ హృదయంలో
నన్ను ఐక్యం చేసుకో!!
- రూపాకృష్ణ