ఇల్లు చేరే సరికి ఎప్పటిలా సాయంత్రం చివరంచుకు రానే వచ్చింది. ఉన్న ఉత్సాహమంతా ఊడ్చుకు పోయింది ప్రశాంతికి. ఉదయం ఎనిమిది దాటకుండానే ఆదరాబాదరా సర్ధుకుని బయల్దేరితే మళ్ళీ ఇల్లు చేరడం ఈ సమయానికే. ఉసూరుమనిపించింది. ఈ వైభోగానికేనా.....
ఆలోచన అక్కడే ఆగిపోయింది.
బాగ్ టీవీ పక్కన ఓ మూలకూ విసిరి లంచ్ బాగ్ తీసుకుని లోనికి వెళ్ళింది. సోఫాలో శేష తల్ప సాయిలా శయనించిన రాఘవ తలతిప్పికూడా చూడలేదు.
కొంతలో కొంత అదృష్టం నాలుగిళ్లవతల ఉండే రావులమ్మ అన్ని పనుల్లోనూ చేదోడు వాదోడుగా ఉంటుంది. ప్రశాంతి రాకముందే ఇల్లంతా సర్ది అన్నిపనులూ చూసుకుని వెళ్తుంది. రావులమ్మ దగ్గర ఒక ఇంటి తాళం చెవి ఉంచుతుంది. ఇంట్లో ఎవరున్నా లేకున్నా స్వంత ఇల్లులా భావించి శ్రద్ధపెడుతుంది.
టిఫిన్ బాక్స్ సింక్ లో వేసి వెళ్ళి చల్లటి నీళ్ళతో మొహం కడుక్కు వచ్చింది. అప్పటికే మసక చీకటి ముసురుతోంది. మొహం తుడుచుకుని దేవుడి ముందు సంధ్యా దీపం వెలిగించింది.
దీపం సర్వ మంగళ మాంగల్యం
దేపం సర్వ పాప తిమిరాపహం
సంధ్యా దీపం నమోస్తుతే
అంటూ లేచి పిసరంత కుంకుమ నొసటనా పాపిటా అద్దుకుంటుంటే నవ్వొచ్చింది.
రాఘవ రూపం కంటి ముందుకొచ్చింది.
కొత్త కొత్తగా స్కూల్ టీచర్ గా చేరిన రోజులు. నగరం నించి నలభై కిలోమీటర్ల దూరాన ఉన్న స్కూల్. ఉదయం ఆరింటికి బయలు దేరితే సాయంత్రం ఏడయేది. రాఘవ కూడా ఆ ఊరిలోనే బాంక్ లో పని చేసేవాడు. అతను రోజూ నగరం నుండి బండి మీద వచ్చివెళ్ళేవాడు. అడపాదడపా అతనిచ్చే లిఫ్ట్ ప్రశాంతికి చాలా పెద్ద ఉపకారం లా అనిపించేది.
పరిచయం పెరిగే కొద్దీ అతనిపట్ల ఆరాధనా భావం పెరిగింది. పెద్ద కుటుంబం అనీ, ఇల్లు సత్రం లా ఉంటుందనీ నిజానికి ఉద్యోగం చెయ్యవలసిన అవసరం లేకపోయినా, ఎన్ని చెప్పాడనీ, ఇంట్లో కారు తీసుకు వెళ్లమంటారు గాని తన సరదా కొద్దీ స్కూటర్ తెస్తాననీ, ఒకటి రెండు సార్లు పెద్ద రెష్టారెంట్కి తీసుకువెళ్ళాడు.
ఏం మైకం కమ్మిందో గాని నమ్మేసింది ఆక్షణం లో---
అవును. అందుకే కాబోలు ప్రేమ గుడ్డిదంటారు. పెళ్లైన ఆర్నెల్లకు గాని తెలిసి రాలేదు అతను బాంక్ లో టెంపరరీ గా ఒక లీవ్ వేకెన్సీలో పని చేసాడని.
రెండు గదుల ఇల్లు. ఇంట్లో ఒప్పుకోలేదన్న సాకు.
ఇంటి ఖర్చు సమస్తం తన జీతంలోనే... పైగా పెళ్ళి వల్లే ఇంట్లోకి రానివ్వడం లేదన్న సాకుతో, డిప్రెషన్ పేరుతో ఇంట్లో తిని పడుకుంటే చేతి ఖర్చులకంటూ అడిగినప్పుడల్లా అడిగినంత సర్దుబాటూ...
ఇద్దరు పిల్లలు పుట్టే సరికి ఎప్పుడు ఎలా జరిగిందో కాని, ఆమె డబ్బు సంపాదించే యంత్రం అతను అన్నిరకాలా తనను గుప్పెట్లో పెట్టుకుని కాపలా కాసే మగ మహారాజు.
పిల్లలిద్దరినీ పెంచడానికి ఎంత నరక యాతన పడిందో, ఎన్ని అగచాట్లు పడిందో ఆమెకే తెలుసు.
అవును, పెద్ద వాడు వినయ్ చదువుల్లో ఎక్కిరాలేకపోతుంటే వాడికి ఆసక్తి ఉన్న ఆటల్లో చేర్చి, చివరికి ఈ రోజున బాక్సింగ్ లో మరో మహమ్మదాలీ అనిపించుకుంటున్నాడంటే , దాని వెనక ఎంత యాతన, ఎంత కృషి.
చిన్నది మాత్రం, ఎంత బాగా చదువుకున్నా, ఒక ఇంజనీరుగా పట్టా తెచ్చుకుందుకు, వెనకాల ఒంటి చేత్తో ఎలా నెట్టుకు వచ్చిందో తెలియదా, ఒక్క మాటా చెవినెక్కనిస్తుందా, తనకు తోచినదే చెయ్యాలి. నచ్చిన వాడితోనే పెళ్ళి చెయ్యాలి. గొప్పింటి సంబంధమే, దానికి తూగలేకపోయినా కూతురిపైన ప్రేమ ముందు తలవంచి ఒక ఊబిలో కూరుకు పోయింది. ఇప్పుడు దానికి తన ఐశ్వర్యం ముందు తల్లి హోదా ఆనదు, ఏ మాట మాట్లాడినా తీసిపారేస్తుంది.
కొడుకు ఒక ఇంటి వాడైతే, ఇహ బాధ్యతలు తీరినట్టే అనుకుంటే...
లేచి హాల్లోకి వచ్చింది.
వస్తూ వస్తూ రావులమ్మ ఫ్లాస్క్ లో పోసి ఉంచిన టీ రెండు కప్పుల్లో పోసుకుని తీసుకు వచ్చింది.
టీ వాసన సోకుతూనే లేచి కూచున్నాడు రాఘవ. చేతుల్లేని కట్ బనియన్, గళ్ల లుంగీ ఒకటి మోకాళ్ళ కింద వరకే వచ్చేలా కట్టుకుని అచ్చం ప్రేమ సినిమాలో విలన్ లానే అనిపిస్తాడు.
టీ పక్కన టీ పాయ్ మీద ఉంచి సింగిల్ సోఫాలొ కూర్చుని కాళ్ళు చాపింది.
" టీ వాసనకే ప్రాణం లేచి వచ్చింది సుమా ... అలసిపోయావా? ఆలస్యం అయిందేం? "
అతని పరామర్శకు జవాబు చెప్పాలనిపించలేదు.
అదంతా మేకతోలు కప్పుకున్న పులి నటనే.
కాస్సేపట్లో మొదలు...
రోజంతా నిమిష నిమిష ఎవరితో ఏం మాట్లాడినదీ చెప్పాలి. చివరికి ఎప్పుడెప్పుడు బాత్ రూమ్ కి వెళ్ళినదీ , నీళ్ళు తాగినదీ ...
" అన్నట్టు నీ కొడుకు రేపు ఉదయం దిగుతున్నాడు. సెలవు పెట్టు "
" మళ్ళీ వస్తున్నాడా ? " గుండెలో అక్కాశం గొంతులో సముద్రం అడ్డం పడ్డట్టయింది.
" ఇందాక ఫోన్ చేసాడు. నాక్కదా కొడుకు ఉన్నాడని అరచేతుల్లో పెట్టుకుని పెంచావు. అందుకేగా తైతక్కలాడుతున్నాడు. అనుభవించు. " ఈసడింపుగా అన్నాడు.
చేదు తిన్నట్టుగా మొహం పెట్టి లేచి బాల్కనీలోకి నడిచింది ప్రశాంతి.
ఆరేళ్ళుగా న్యూజిలాండ్ లో ఉంటున్నాడు. ప్రపంచ స్థాయి బాక్సర్ గా మారాక తమ దేశ పౌరసత్వాన్నీ హోదాగల ఉద్యోగాన్నీ ప్రకటించింది ఆ దేశం. అప్పటినుండి అక్కడే ఉంటున్నాడు.
మూడేళ్ల క్రితం కాబోలు చూచాయగా జెస్సీ గురించి చెప్పాడు. తను పేయింగ్ గెస్ట్ గా ఉండే ఇంటి వారమ్మాయి. తండ్రి పెద్ద బిజ్జినెస్ మాగ్నెట్, తల్లి కార్డియాలజిస్ట్. జెస్సీ బుల్లితెర నటి. ఒక్కతే కూతురు.
నోట మాట రాలేదు ప్రశాంతికి.
కొడుకు సక్రమమైన దారిలో పెరగాలని అన్ని విధివిధానాలూ సకృత్తుగా నిర్వహించటం గుర్తుకు వచ్చింది. తొమ్మిదో యేట సాంప్రదాయికంగా రెండు రోజుల ఒడుగు గాయత్రీ మంత్రోపదేశం జరిపించింది. సరిగ్గా లక్ష రూపాయల ఖర్చు.
అయినా బుద్ధిగా ఇంటర్ ముగిసే వరకూ సంధ్య వార్చి గాయత్రిని జపిస్తుంటే ఎంతమురిసిపోయిందనీ, తనుపడ్డ కష్టం ఫలించిందనుకుంది.
కాని ఇంటర్ రెండో సంవత్సరం కాలేజీ ప్రిన్సిపల్ గారు పిలిచి అటెండెన్స్ ఇరవై శాతం కూడా లేదు పరీక్షలకు అనుమతించం అని చెప్పే వరకూ కొడుకు కొండయ్య బంగారమనే అనుకుంది.
గట్టిగా నిలదీస్తె అవును నాకు చదువు మీద ఆసక్తి లేదనేసాడు. నాకా పాఠాలు నచ్చడం లేదన్నాడు. ఈ గ్రూపు కాదు ఆ గ్రూప్ మరో గ్రూప్ అంటూ అయిదారేళ్ళు గడిపేసాడు. చివరికి తిని నిద్రపోడం తప్ప మరేం చెయ్యని వాడిని బాక్సింగ్ ట్రైనింగ్ లో చేర్చాక కొంచం దారికి వచ్చాడు. ఈ గొడవల్లో గాయత్రీ మంత్రం ఎటు దారి చూసుకుందో ...
పూజా పునస్కారం మాటే లేదు.
ఎలాగైతేనేం బాక్సింగ్ లో నిలదొక్కుకున్నాడు. పదేళ్ళు కష్ట పడినా ఫలితం అద్భుతం అనిపించింది.
మూడేళ్ల క్రితం జెస్సీ మాట చెప్పినప్పుడు తెల్లబోయి తేరుకుని,
" అదెలా కుదురుతుందిరా మనకూ వాళ్లకూ ..."
"అదేం, ఎందుకు కుదరదు మామ్ వాళ్ళూ మనుషులే మనమూ మనుషులమే " దూకుడుగా అన్నాడు.
" వాళ్ళ పద్దతులూ , వారి అలవాట్లూ ..."
మాటయినా పూర్తికాకమునుపే,
"అక్కడికి మనవేవో గొప్ప పద్దతులూ ఇతరులవి కానట్టూ ..."
మూడేళ్ల పాటు, ఎన్ని చర్చలు, ఎంత ఆగ్రహం, ఎన్ని నిష్టూరాలు, అయినా ఎవరి మాట వారిదే.
ఏడాది క్రితం కాబోలు మతం మార్చుకున్నాడని పేరు మార్చుకున్నాక తెలిసింది.
వినయ్ వింజమూరి కాస్తా వినయ్ జోసెఫ్ గా మారాడు.
అదేం అని అడిగే అవకాశమే లేదు.
జెస్సీ కి తమ మతం పట్ల గొప్ప నమ్మకం-తమవారిని తప్ప మరొకరిని పెళ్ళి చేసుకోదట.
అక్కడితో ఆగితే బాగుండును.
" మీరూ మతం మార్చుకోవాలి -అందుకే నాన్న పేరు విక్టర్ జోసెఫ్ గా సెలెక్ట్ చేసుకున్నా. నీ పేరూ ఆలోచించాను --విన్నీ జోసెఫ్ బాగుంది కదా ..."
అవాక్కయిపోయింది ప్రశాంతి.
నోట మాటరాలేదు. వహ్వా, తల్లిదండ్రులకు నామకరణం చే సే కొడుకు.
ఏడాదిలో ఇది నాలుగో సారి రాడం రెండు రోజులు భీకర యుద్ధం ప్రకటించి, ఆగ్రహించి, " మీకు నా సుఖం కావాలంటే నా మాట వినక తప్పదని" బెదిరించి వెళ్లడం .
మళ్ళీ రేప్పొద్దున మరో రామ రావణా సంగ్రామమా...
విసిగిపోయిన మనసు ఎదురు తిరిగింది.
" ప్రశాంతీ , దేనికి నిన్ను నువ్విలా త్యాగ శీలగా మార్చుకుంటున్నావు? మూరెడు పసుపుతాడూ, నొసటన చిటికెడు కుంకుమ కోసం మనశ్శరీరాలను తాకట్టుపెట్టావు, ముప్పై ఏళ్ళు కట్టు బానిసగా బతికావు. ఎవరైనా మెచ్చి మేకతోలు కప్పాలనా, మహా పతివ్రతా శిరో మణి , మాతృదేవత లాంటి బిరుదులు ఇవ్వాలనా?
రేప్పొద్దున నువ్వు గట్టిగా కాదంటే నీ బాక్సర్ కొడుకు ఒక్క గుద్దు గుద్ది నిన్ను పాతేసి ప్రార్ధనలు చేస్తాడు.
నీ పెన్షన్ తో ఎప్పటిలాగే బతుకు తాడు నీ మొగుడు
ఇహ నువ్వో ... ఎటూ కాని అధోగతి పాలయ్యేది." రాత్రి చాలా పొద్దుపోయే వరకు బాల్కనీ లోనే ఉండి పోయింది ప్రశాంతి.
ఎనిమిదింటికి కాబ్ దిగి తలుపులు తోసుకు వినయ్ జోసెఫ్ ఇంట్లో అడుగు పెట్టే వరకూ సోఫాలో నిద్ర పోతూనే ఉన్నాడు రాఘవ.
శ్మశాన నిశ్శబ్దం తాండవిస్తున్న ఇంట్లో తండ్రీ కొడుకూ మౌనంగా నే చదువుకున్నారు ప్రశాంతి వదిలి వెళ్ళిన కాగితం ముక్కను
అరవై ఆరో సారి ఎవరినీ ఏరకంగానూ సంబోధించడానికీ మనసు ఒప్పడం లేదు.
అవును నేను సాంప్రదాయిక మూఢురాలినే. సాంప్రదాయమే నా ఊపిరి. అందుకే దానికి కట్టుబడి మిమ్ములను ,మీ సంతానాన్ని కందిపోకుండా కరిగి నీరవుతూ చూసుకున్నాను.
ఈ రోజున నా ఉనికి నా ఆస్తిత్వం నా సంప్రదాయపు పేరు వదులుకుని బ్రతకాల్సిన అవసరం నాకు కనబడటం లేదు.
మరి ఈ జన్మకు సెలవు. నా కోసం వెతకవద్దు. లాభం లేదు. దొరకను, అలాగని చావను, మిగిలిన సగభాగపు జీవితం నాకు నచ్చిన నేను మెచ్చిన విధానాన వెళ్ళబుచ్చుతాను.
ఋణాను బంధ రూపేణా ఇంత చాలు మన మధ్య అనుబంధం.
దానితో బాటు ఉద్యోగానికి రాజీనామా.
- స్వాతి శ్రీపాద