వసంత యామిని

Advertisement
Update:2023-04-06 15:21 IST

ఒకానొక సాయం సంధ్య వేళ

గమ్యం తెలియని తెరువరిలా అడుగులు వేస్తున్నా

దేహం ముందుకు కదులుతోంది భారంగా

మనస్సుకి మాత్రం ఏదో

తెలియని అలజడి

జ్ఞానేంద్రియాల్లోకి

చొచ్చుకు వెళుతున్న

లోకపు వింతపోకడలు

గుండెను మెలితిప్పుతున్న

జ్ఞాన నరాలు

ఎల్లెడలా అసూయా ద్వేషం

జంట కవుల్లా

విజృంభిస్తున్నాయి

కామక్రోధాలు

రాబందుల జతలా

ఆడదేహాలను

ఛిద్రం చేస్తున్నాయి

దౌర్జన్యం రాక్షసనీడలా కమ్ముకుంటోంది

నిరాశ

నివురుగప్పిన నిప్పులా మండుతోంది

తామరాకుమీద

నీటిబొట్టునవడం ఎలా..?

మనసుకు ఏది అంటకుండా

శాంతి లేని మనసులు

విశ్రాంతి లేని మనుషులు

అందని ఆశలవెంట పరుగులు

తీరని కోర్కెల గుర్రాల పందాలు

మూకుమ్మడిగా మనసుమీద దాడిచేస్తున్నాయి

బాధాతప్త హృదితో

నడుస్తూ ఉన్నాను

ఏ చోటినుంచో వీస్తున్న

చిరు తెమ్మెర

మోముని ముద్దాడింది

హఠాత్తుగా నడక ఆపి

నిలిచి చూసాను

సాలెపురుగు ఒకటి దీక్షగా అల్లుతోంది చెదిరిన గూడును

మోడువారిన కొమ్మ నుంచి

రెండు లేతపచ్చ చిగుర్లు తలలూపుతూ

ఎండినచోటే మళ్ళీ

జీవితాన్ని పండించుకోవాలి

రేపటి ఆశే

ఈ రోజున బతికించేది

అంటున్నాయి

చిరుగాలి ఊగుతున్న

నైట్ క్వీన్ కొమ్మల చివర

పూల గుత్తులు

సుగంధ లేఖలు రాసి

హృదయపు చిరునామాకు పంపుతున్నాయి

మామిడిచెట్టు మీద

ఒంటరి కోయిల

విరహగీతాలు పాడుతోంది

ఆర్తిగా

జంట గువ్వలు గూట్లోకి చేరుకుంటున్నాయి

సరాగాల సయ్యాటకు

ప్రకృతి అంతా ప్రేమమయం

ధైర్యవచనం ఆశల పందిరి

మనిషికి మాత్రమే ఎందుకు అంతులేని దుఃఖం

నిన్ను నువ్వు ప్రేమించుకో

నీ పక్కవాడిని నీలాగే ప్రేమించు

ఇదేగా పంచ మహా యజ్ఞాల పరమార్ధం

ఆచరిస్తే ఎంతమధురం

మనిషి జీవితం

అందని ఆశల వెంట

పరుగులు ఆపేస్తే

తృప్తి అనురాగం

ఆయుధాలుగా చేసుకుంటే

జీవనపోరాటం ఇక

నల్లేరుమీద నడకే కదా

ఇదిగో ఈ సాయంసంధ్య వేళ

ఎన్ని పాఠాలు నేర్పుతోందో

ఈ ఆమని

సుఖం దుఃఖం

సమపాళ్ళు జీవితాన అంటూ

విరిసిన హరితవర్ణ భామిని

రాబోయే శోభకృత్ వత్సరానికి షడ్రుచుల

స్వాగత తోరణాలు కడుతోంది

ఈ వసంత యామిని

  - రోహిణి వంజారి

Tags:    
Advertisement

Similar News