24 గంటల్లో

Advertisement
Update:2023-10-31 18:08 IST

ఈ చెట్టుకి నేనెవరో తెలియదు

నా కిటికీ ఎదురుగా రోడ్డుకి పక్కగా ఉంటుంది

6 గంలకి కళ్ళు విప్పగానే

పచ్చని ఆకుల స్నేహంతో

బాగానే ఉన్నావా అడిగినట్టు అనిపిస్తుంది

9 గం లకి బట్టలు ఆరవేస్తుంటే

కనిపించని పిట్టకూతని

పరిచయం చేస్తుంది

చిరాకుల నుదుటి

ముడులు విప్పీ

పెదవుల మీద నవ్వు రంగుతో

లోపలి పాటని అందుకుంటూ

కొమ్మల అలికిడిలో తొంగి చూస్తానా!

బూడిదరంగు రెక్కలు రివ్వుమంటాయి

ఒంటి గంటకి గాలికి కదులుతూఎండని మోస్తూ బద్దకంగా ఆవులిస్తుంది

4 గంటలకి

వెలుగు అద్దాలతో

కిటికీ చువ్వల కుంచెతో

కొమ్మ ల బొమ్మలతో గోడ మీద నలుపు తెలుపు సినిమా చూపిస్తుంది

6 గంటల వర్షం లో

తలవంచిన కొమ్మలమీద

నీటి పిల్లల జారుడు బండ ఆటలు చూపిస్తుంది

7గంల వీధి దీపాల

వెలుగు చీకటిలో

నీటిరెక్కల తలలతో

రోడ్డువారగా కాలువల

పిల్ల నదిలో ఆకు పడవల

ప్రయాణం చూపిస్తుంది

10గంటలకి పున్నాగపూలు

రాల్చి సువాసనలతో ముంచి

కిటికీ దగ్గరగ ఉన్నానంటుంది

ఈ చెట్టుకి నేనెవరో తెలియదు

అర్ధరాత్రి మెలుకవ వస్తే

కొమ్మ రెక్కలతో స్నేహంగా ఊగుతుంది

తెల్లవారే చూపుతో ఆకుపచ్చని రోజుతో

నేను బతికి వున్నానని

దానికి చెప్పుకుంటాను....

- రేణుక అయోలా

Tags:    
Advertisement

Similar News