రంగుల రాట్నం లా తిరుగుతూ అష్టవధానం చేస్తూ
సూర్యుని గమకాల వెంబడి తిరిగే
పరిభ్రమణంలో
తనఇష్టాలను తోసిరాజని
అందరి కోసం ఆలోచించే అతివ
కాలచక్రపు సంకెళ్లు ఛేదించుకొని
బ్రతుకు పయనములో
చిక్కుముళ్ళు సవరించుకొని
అంధకారం చీల్చుకొని
వెలుగు వెన్నెల తీసుకొచ్చే
మమతలనావ ఈ సమత
ఒక అశ్రువు తుడిచే తర్జని కోసం
యుగయుగాలుగా ద్రిమ్మరిన
స్వప్నం ఆమె
ఆమె కలగనని స్వప్నంలేదు
ఐనా అడుగడుగునా
అణచివేత వివక్షత వెల్లువెత్తిన సమాజంలో
నిదురలో నిజంలో మెలుకువలో ఆకాశంలో సగం
అవనిలో సగం అనే
భూపటలంలో చక్రం ఆమె
కలలు కనే కళ్ళు కన్నీళ్లతో నిండినా
చిరునవ్వు చెరగనీయని స్వప్నిక ఆమె
జీవితచదరంగంలో
నలుపు గళ్ళు మింగినా
వైకుంఠపాళిలో పాములుమింగినా ఆగకుండా కదిలి
నిచ్చినలెన్నో అధిరోహించాలని
ఆశించే నిస్వార్థఝరి
తన ఉనికిని కాపాడుకుంటూ
ఆస్తిత్వాన్ని నిలుపుకుంటూ
ఆత్మ విశ్వాసపు
స్థిరచిత్తగా మారిన ఆమె
తన్నుతాను మరిచి గడియారం ముల్లులా కదిలే ఆమె కుటుంబపు దిక్సూచి అయినా వేధింపులు సాధింపులు
అవమానాలు అవహేళనలు
మోస్తూనే
తన్ను తానుభూదేవిగా
తలుచుకుంటూ
బ్రతుకునుగెలుచుకున్న
ఆమె సహనశీల
సూర్యచంద్రులు ఆమె కళ్ళలోనే
సముద్రాలు ఇంకేదీ ఆ కళ్ళల్లోనే
అణచివేతకు గురైన
మదీయమానసం ఆర్తిగా ఎదురుచూసేది
నీడగా నిలిచే తోడు కోసం
- రెడ్డి పద్మావతి (పార్వతీపురం)