నా పల్లె

Advertisement
Update:2023-04-30 18:09 IST

తొలికోడి కూసెను

రెక్కలల్లార్చి

మలికోడి కూసెను

తెలతెల్లవారే

తామర..తంగేడు...

కలువలన్ పూసే

వాకిట కల్లాపి

వేవేల ముగ్గులున్

మజ్జిగ కవ్వముల్

మృధుమధురవీణ

పక్షుల కిలకిలా

బహు పసందుగాను

మోట గిలకలబావి

మంజీరధ్వనులు

వాకిట వయ్యారి

మరదలిని గాంచి

మనసంతా పులకించే మధురమ్ముగాను

వాసెన గట్టిన

మీగడ పెరుగులున్

కావిళ్ల గట్టిన

కడుసుంతగాను

నాగళ్ల చప్పుళ్ళు

కర్షకుల కావిళ్ళు

తడిసిన అందాలు

తమితీరగాను

ముంజేరు నీరంత

మురిపెంపుగా పట్టి

దోసిట పట్టిన

పరిమళాలను చుట్టి

ఊహలో నొక వంపు

ఊయలలూగి

గర్వాతి శయమున

గరువంపుగా ఒదిగి

నాపల్లె..నా ఇల్లు..

నా ఊరివారని..

ఊరంతా పచ్చగా

ఊహంత వెచ్చగా

కోతి కొమ్మచ్చులాడి..

కోనంత తిరిగి

మామిడి చెట్టెక్కి..

ఏటిలో ఈదాడి

ఆకొమ్మనొక చివురు..

ఈ కొమ్మనొక చివురు

కమ్మరి..కుమ్మరి.. సాలె..

చాకలివాని..

కులమతాలు లేని..

ఊరు బంతిలోన

వెచ్చని నెగడుల

ఊహలా ఉయ్యాల

దారంత గురుతుగా

దారాలు సాగి

ప్రకృతికాంత తన

పైటచెంగుని విసిరి

కమనీయ రమణీయ

దృశ్యాలతోడ

అందాల నావలా..

ఆనందాల తోవ

మమతానురాగాల

బంధాలు సాగి

నా ఊహలో నుండి ఇలకు దిగిరాగా

వాస్తవమ్మును గాంచి

దిగ్బ్రాంతి చెంది

నాఇల్లు.. నా ఊరు..

నా వారు ఏరని

ఏటి గట్టును అడిగి..

కొమ్మ రెమ్మను అడిగి

కోకిలమ్మను పిలిచి..

కొమ్మకొమ్మని వెతికి

గుడిగంట.. బడిగంట..

కానరాదే కంట..

మమతలే మరిచిoది

మాధుర్య సీమ

నెయ్యమే  పంచిన

నేస్తాలు ఏరి

పల్లె పల్లెను విడిచి

పట్నాన చేరి

వలస పక్షులు వలె

వంటరిగా మారి

ఉన్న ఊరును వదిలి

వలసలే మజిలీ

గాయాలు రేగినా..

గుండె గుబులైనా

కన్నీటి సెలయేళ్ళు

కాల్వలుగమారినా

మారిపోయిన బతుకు..

మారాకు తొడగదు

గుక్కెడు గంజికై

గుబులు రేగిన బ్రతుకు

పస్తులున్నా గానీ

పలకరించని మెతుకు

రోజంత పనిచేసి

రోగమొచ్చిన గానీ

కష్టమే ముసిరినా.....

కన్నీరు రానీ

తోడవ్వరూ లేని

తోటమాలిగా మారి

కళ్ళలో మెదిలిన

కన్నతల్లిని తలచి

ఒక కంట పొంగింది

మిన్నేటి గంగ

- రెడ్డి పద్మావతి.

(పార్వతీపురం ,మన్యం జిల్లా ,ఆంధ్రప్రదేశ్)

Tags:    
Advertisement

Similar News